టీఆర్​ఎస్​ అవినీతి గురించి మోడీకి అంతా తెలుసు

టీఆర్​ఎస్​ అవినీతిపై ఆయనకు సమాచారం ఉంది

ప్రధాని మోడీని కలిసిన అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

టీఆర్​ఎస్​ సర్కార్​ సిండికేట్​గా దోచుకుంటున్నది

రాష్ట్రాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నది: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

కేంద్ర ప్రభుత్వమే కాపాడాలి

హౌసింగ్​ స్కీంను టేకప్​ చేయాలి

జనం మధ్య నుంచి  ఫార్మా సిటీని తరలించాలి

ప్రధాని మోడీకి ఎంపీ వినతి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రాజెక్టుల పేరుతో బ్యాంకులు, కేంద్ర సంస్థల నుంచి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సిండికేట్ విధానంలో టీఆర్​ఎస్​ సర్కార్​ దోచుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ప్రధాని దగ్గర చాలా సమాచారం ఉందన్నారు. కాళేశ్వరం, పాలమూరు, ఇతర నీటి పారుదల ప్రాజెక్టులను ఇద్దరు, ముగ్గురికి కట్టబెట్టారని ఆరోపించారు. జనం మధ్య ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్​ ఫార్మాసిటీని జనం లేని ప్రాంతానికి తరలించాలన్నారు. మంగళవారం పార్లమెంట్​లోని ప్రధాని ఆఫీసులో ప్రధాని మోడీతో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన నాలుగు అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. అనంతరం వెంకట్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం  రాష్ర్టాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నదో ప్రధాని మోడీకి వివరించినట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాంపిటీషన్ బిడ్డింగ్ లేకుండా పది, పన్నెండు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ను నామినేషన్ మీద ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కాపాడాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. కేంద్ర పథకంలోని ఇండ్లను నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో హౌసింగ్ స్కీంను  కేంద్రమే టేకప్ చేయాలని విన్నవించినట్లు చెప్పారు.

ఫార్మాసిటీని తరలించాలి

జనం మధ్య ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీకి అన్ని అనుమతులు నిలిపివేయాలని ప్రధానికి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలకు హానికలిగించే హైదరాబాద్ ఫార్మా సిటీని బరాబర్ ఆపుతామన్నారు. మొదట మూడు వేల ఎకరాల్లో ప్రతిపాదనలు చేసి, ప్రస్తుతం 19,333 ఎకరాలకు పెంచారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గరి నుంచి తక్కువ రేట్లకు భూములను లాక్కొని, ఫార్మా కంపెనీలకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటోందని ఆరోపించారు. దాదాపు ఒకే చోట వెయ్యి ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే  హైదరాబాద్‌‌పై కాలుష్య ప్రభావం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మా సిటీకి తాము వ్యతిరేకం కాదని, గ్రామాలు, జనాలు లేని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించినట్లు చెప్పారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్తగూడెం రహదారిని కేంద్రం నేషనల్ హైవేగా గుర్తించిందని, వెంటనే ఆ మార్గానికి నేషనల్ హైవే నెంబర్ కేటాయించడంతోపాటూ డీపీఆర్ ను ఆమోదించాలని ప్రధానిని కోరినట్లు ఆయన వివరించారు. కాపర్, జింక్, ఇతర విష పదార్థాలు మూసినది నీటిలో మోతాదుకు మించి కలుస్తున్నాయని, ఈ ప్రమాదకర కణాల శుద్ధి కోసం మూడు వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌‌మెం ట్‌‌ స్కీంలో భాగంగా భువనగిరి లోక్​సభ నియోజకవర్గం పరిధిలో బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం పది వేల కోట్లు మంజూరు చేయాలని అడిగినట్లు తెలిపారు. తన విజ్ఞప్తులకు ప్రధాని సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి అన్నారు. ఢిల్లీలో ఓ పార్టీ ఎంపీ ఫార్మా సిటీని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్, కేటీఆర్ పరోక్షంగా తన గురించి ప్రస్తావించారని, అది తానేనని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తేల్చిచెప్పారు. దాదాపు పది నిమిషాలకు పైగా  ప్రధానితో ఫార్మా సిటీ అంశంపై చర్చించానన్నారు. రాష్ట్రానికి నిధులు రాకుండా ఓ ఎంపీ అడ్డుకుంటున్నారని కేసీఆర్ పరోక్షంగా తన పేరును ప్రస్తావించారని, ఆ విమర్శలు పూర్తిగా తప్పు అని కొట్టిపారేశారు.

For More News..

కరోనా సోకిన వ్యక్తి బయట తిరిగితే 12 ఏండ్ల జైలు

ప్రభుత్వం చెబుతున్నా.. పబ్లిక్ పట్టించుకోట్లే..

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

Latest Updates