ఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర

సిద్దిపేట : కొమురవెల్లి  మల్లన్న జాతర  ఘనంగా జరుగుతోంది. మొదటివారం పెద్ద పట్నాలతో.. మల్లన్న ఆలయం సందడిగా మారింది.  ఆదివారం కావడంతో….. రాష్ట్ర  నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ ఉత్సవాలు ఉగాది వరకు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యి.. స్వామివారిని దర్శించుకుంటారు. మల్లికార్జున స్వామికి తమ మొక్కులు తీర్చుకుంటారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి ఆదివారాన్ని ‘పట్నం వారం’గా పిలుస్తారు. ఈ వారం హైదరాబాద్‌ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అందుకే ‘పట్నం వారం’గా పిలుస్తారు. శనివారం వచ్చే పట్నంవాసులు సోమవారం సాయంత్రం వరకు ఇక్కడే బస చేస్తారు. ఆదివారం స్వామిని దర్శించుకోవడం, బోనాల నైవేద్యం సమర్పించి, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు.భారీ సంఖ్యలో హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయాధికారులు తెలిపారు.

ఈ స్వామీ వారి బ్రహ్మోత్సవాలు ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా జరుగుతాయి. మూడు నెలలపాటు బ్రహ్మోత్సవాలు జరిగే ఏకైక శైవక్షేత్రంగా కొమురవెల్లి ప్రసిద్ధిగాంచింది. ఏటా మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, ఉగాది ముందు వచ్చే ఆదివారం రోజున అగ్నిగుండాల కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.

Latest Updates