రైతు గుండెలపై పోలీసులు తన్నారు : కొండపోచమ్మ భూ నిర్వాసితులు

కొండపోచమ్మ సాగర్ పనుల్లో ఉద్రిక్తత

రైతు కరుణాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

పోలీసులు గుండెపై తన్నడంతో.. పరిస్థితి విషమించిందంటున్న కుటుంబసభ్యులు

సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ సాగర్ నిర్మాణ పనుల వివాదం మరింత హీటెక్కింది. కోర్టు స్టే ఉన్న భూముల్లో పోలీసు పహారా మధ్య నిర్మాణ పనులు చేస్తున్నారంటూ ఆదివారం రోజున నిర్వాసితులు ఆందోళనకు దిగారు. బలవంతంగా పనులు చేస్తున్నారంటూ… మామిడ్యాలకు చెందిన దాచారం కరుణాకర్ అలియాస్ కనుకయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు అతడిని గజ్వేల్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు.

కొండపొచమ్మ భూ నిర్వాసితులకు మద్దతుగా.. హాస్పిటల్ కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు. నర్సారెడ్డికి అండగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రావడంతో… అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వాళ్లందరినీ అరెస్ట్ చేసి దౌల్తాబాద్ పీఎస్ కు తరలించారు పోలీసులు.

యశోద హాస్పిటల్ కు రైతు కరుణాకర్ తరలింపు

రైతు కరుణాకర్ ను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని.. ముందుగా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు.. ఆ తర్వాత యశోద హాస్పిటల్ కు తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నట్టు కుటుంబసభ్యులు చెప్పారు. కొండపోచమ్మ ప్రాజెక్టు భూనిర్వాసితులు, కరుణాకర్ కుటుంబసభ్యులు యశోదా హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు.

గుండెలపై తన్నడంతో రక్తం గడ్డకట్టి.. సీరియస్ గా మారింది: కరుణాకర్ అన్న

కోర్ట్ స్టే అడ్డర్ ఉన్న భూముల్లో జేసీబీలతో తవ్వుతున్నారనీ.. తమ భూముల్లోకి వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకుని కొట్టారని కొండ పోచమ్మ భూ నిర్వాసితులు చెప్పారు. బెటాలియన్లకు తీసుకొచ్చి అక్కడ తమ భూముల్లో కాలువ తీస్తున్నారనీ ఆరోపించారు. పోలీసులు దాడి చేయడంతోనే రైతు కరుణాకర్ పురుగుల మందు తాగాడని అన్నారు. గజ్వేల్ హాస్పిటల్ లో ఉన్న కరుణాకర్ ను.. వ్యాన్ లో వేసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారనీ.. అతడి గుండెలపై పోలీసులు తన్నడంతో.. రక్తం గడ్డకట్టి అతడి పరిస్థితి సీరియస్ గా మారిందని కుటుంబసభ్యులు ఆవేదనగా చెప్పారు. అందుకే.. గాంధీ నుంచి ప్రైవేటు హాస్పిటల్ అయిన యశోదకు తీసుకొచ్చారని చెప్పారు. అతడి పరిస్థితి బాగాలేదనీ.. తల్లిదండ్రులు, తనను కూడా లోపలికి అనుమతి ఇవ్వడం లేదని కరుణాకర్ అన్న చెప్పారు.

కరుణాకర్ పరిస్థితి విషమంగా ఉంది : యశోద హాస్పిటల్ డాక్టర్లు

రైతు కరుణాకర్ పరిస్థితి విషయగానే ఉందని యశోద హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు. 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచారు డాక్టర్లు. 48 గంటలు గడిస్తే కానీ.. ఏమీ చెప్పలేమని డాక్టర్లు అన్నారు. ప్రస్తుతం ICU లో కరుణాకర్(కనుకయ్య) చికిత్స పొందుతున్నారు.

Latest Updates