- ఓవర్ డ్యూస్, ఆడిట్ రూల్స్ ఉల్లంఘనలతో గంభీరావుపేట పీఏసీఎస్ పాలకవర్గం రద్దు
- ఫలితంగా కేడీసీసీబీ చైర్మన్‌గా కొనసాగే అవకాశం కోల్పోయిన రవీందర్ రావు
- కేడీసీసీ ఇన్చార్జ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే షాక్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన కొండూరు రవీందర్ రావు ఆధిపత్యానికి ఎట్టకేలకు చెక్ పడింది. ఓవర్ డ్యూస్, ఆడిట్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా గంభీరావుపేట పీఏసీఎస్ పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆయన పీఏసీఎస్ చైర్మన్ పదవిని కోల్పోయారు. కేడీసీసీబీ చైర్మన్‌గా కొనసాగాలంటే ఏదైనా పీఏసీఎస్‌కు చైర్మన్‌గా పనిచేస్తుండాలనే నిబంధన ఉండడంతో ఆయనకు కేడీసీసీబీ చైర్మన్‌గా కొనసాగే అవకాశం లేకుండాపోయింది.
పర్సన్ ఇన్చార్జ్గా సంతకం చేసిన మరుసటి రోజే..
రాష్ట్రంలోని అన్ని డీసీసీబీల పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరుడు డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. దీంతో కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా రవీందర్ రావు బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం డీసీసీబీ పర్సన్ ఇన్ చార్జీలుగా కలెక్టర్లను నియమించింది. ఈ విషయమై కొందరు హైకోర్టును ఆశ్రయించగా బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జీలుగా కలెక్టర్లను కొనసాగించవద్దని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే వారి స్థానంలో పాత చైర్మన్లు కొనసాగాలని సహకార శాఖ రిజిస్ట్రార్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అయినప్పటికీ ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఈ నెల 21న కొండూరు రవీందర్ రావు కేడీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు చేపట్టారని విమర్శలు వచ్చాయి. ఇది జరిగిన మరుసటి రోజే మంగళవారం ఆయన చైర్మన్‌గా కొనసాగుతున్న గంభీరావుపేట పీఏసీఎస్ పాలకవర్గాన్ని రద్దు చేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
ఓవర్ డ్యూస్, ఆడిట్ నిబంధనల ఉల్లంఘనలతో పాలకవర్గం రద్దు
గంభీరావుపేట పీఏసీఎస్‌లో లోన్లకు సంబంధించి ఓవర్ డ్యూస్ ఉండడంతోపాటు ఆడిట్ నిబంధనలు ఉల్లంఘించడంతో రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్(డీసీవో), కోఆపరేటివ్ స్పెషల్ కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్ విచారణ చేపట్టారు. 2025, మార్చి 31 నాటికి డీఫాల్ట్ అయిన లోన్లు, వసూలు కాని రాబడి పేరుకుపోయినట్లు గుర్తించారు. పీఏసీఎస్ పరిధిలో మొత్తం రూ. 27.38 కోట్లు వసూలు కావాల్సి ఉందని, ఇందులో 11.78 లక్షల లోన్లు ఓవర్ డ్యూ అయ్యాయని గుర్తించారు. అంతేగాక 2024–25 ఫైనల్ ఆడిట్ రిపోర్టులో ఎత్తిచూపిన ఆడిట్ లోపాలను రెక్టిఫై చేయకపోవడాన్ని అధికారులు తప్పుపట్టారు. అలాగే డిఫాల్టర్ల జాబితాను సిద్ధం చేయడంలో, రికవరీ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు గుర్తించారు.
ధాన్యం సేకరణ ప్రక్రియలో నిర్లక్ష్యం కారణంగా సొసైటీకి రావాల్సిన కమీషన్ లో కోతపడిందని, గన్నీ సంచుల నష్టానికి గాను 2022–23 నుంచి 2024–25 వరకు ధాన్యం కమీషన్ నుంచి రూ. 6,09,415 మినహాయించారని రిపోర్టులో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ పాలకవర్గం పదవీకాలం 2025 ఫిబ్రవరి 14తో ముగిసిందని, దీన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారని, ప్రస్తుతం పాలకవర్గ అసమర్థ పనితీరును పరిగణనలోకి తీసుకుని వారి స్థానంలో పర్సన్ -ఇన్-చార్జ్ కమిటీని నియమించాలని డీసీవో, నోడల్ ఆఫీసర్ సిఫార్సు చేశారు. ఈ రిపోర్టు ఆధారంగా సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేయడంతోపాటు పర్సన్ ఇన్ చార్జీగా వేషాల వెంకట్ తో సహా 13 మందితో కమిటీని నియమిస్తూ సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
