కిడ్నాప్ చేసిన TRS MPTCని హతమార్చిన మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం: మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన  కొత్తూరు TRS ఎంపీటీసి శ్రీనివాస్ రావును మావోయిస్టులు హతమార్చారు. ఘటనా స్థలం దగ్గర చర్ల-శబరి ఏరియా మావోయిస్టు కార్యదర్శి పేరుతో లేఖను వదిలి వెళ్లారు. అందులో.. ఎంపీటీసీ శ్రీనివాస్ రావు పోలీసులకు ఇన్ఫార్మర్ గా మారినందుకే హతమార్చినట్టు తెలిపారు. దీంతో పాటే.. దళాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తున్నాడని.. ఆదివాసీలను ఇన్ఫార్మర్లుగా మారుస్తున్నాడని.. ప్రజా సంఘాల వారిని అరెస్టు చేయించడం చేశాడని లేఖలో చెప్పారు. ఆదివాసీలకు చెందిన 70 ఎకరాల భూమిని పోలీసుల సహాయంతో శ్రీనివాస్ గుంజుకున్నాడని ఆరోపించారు. CPI మావోయిస్టు పార్టీ పై దుష్ప్రచారం చేస్తూ.. అడ్డుతగులు తున్నందునే శ్రీనివాస్ ను చంపినట్లు లేఖలో మావోయిస్టులు తెలిపారు.

శ్రీనివాస్ పోలీస్ ఇన్ఫార్మర్ కాదు: ఎస్పీ సునీల్ దత్
కొత్తూరు ఎంపీటీసి శ్రీనివాస్ రావు పోలీస్ ఇన్ఫార్మర్ కాదన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్. మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీనివాస్ ను దారుణంగా కొట్టి హతమార్చడం హేయమైన చర్య అని అన్నారు. మూడు రోజుల క్రితం బెస్తకూరులో శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు అతన్ని చత్తీస్ ఘడ్ ప్రాంతానికి తీసుకువెళ్లి చంపినట్లు చెప్పారు. చంపిన ప్రాంతం తెట్టేమడుగు,పుట్టపాడు గ్రామాల మధ్య ఉందని అన్నారు.

శ్రీనివాస్ తన ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ చుట్టుపక్కల రైతులకు సహాయం చేసేవాడని అన్నారు సునీల్ దత్. ఒక మంచి రైతును దారుణంగా కొట్టి చంపడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. వారి మనుగడ కోసమే.. చర్ల ఏరియాకు సంబంధించిన రైతులను, వ్యాపారస్తులను ధనం కోసం మావోయిస్టులు వేధిస్తున్నారని అన్నారు. ధనం ఇవ్వడానికి నిరాకరించిన వాళ్లను మావోయిస్టులు హతమారుస్తున్నారని చెప్పారు. ఈ విధంగా సంఘ విద్రోహక చర్యలు పాల్పడుతున్నందుకు మావోయిస్టులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు ఎస్పీ సునీల్ దత్.

Latest Updates