క్యారీ ఓవర్‌ నీళ్లపై చేతులెత్తేసిన కృష్ణా బోర్డు

  • కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్న బోర్డు
  •  ఏపీకి నీళ్లు కావాలంటే మాత్రం ఆగమేఘాల మీద సమావేశాలు
  • పక్షపాత వైఖరి మార్చుకోని కృష్ణా బోర్డు

క్యారీ ఓవర్‌ నీటిపై కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్ఎంబీ) చేతులెత్తేసింది. త్రీమెన్‌ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని ఈ మధ్య రిలీజ్‌ ఆర్డర్  లో పేర్కొన్న బోర్డు.. తర్వాత ఏపీ ఒత్తిడికి తలొగ్గి సమస్యను కేంద్రం కోర్టులోకి నెట్టేసింది. చర్చిస్తే పరిష్కారమయ్యే సమస్యను సాగదీసి నిరుడు తెలంగాణ ఉపయోగించు కోని నీటి సమస్యను జటిలం చేయాలని చూస్తోంది. శుక్రవారం ఈ మేరకు బోర్డు మెంబర్‌ సెక్రటరీ హరికేశ్‌ మీనా.. జలశ క్తి శాఖ సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌‌కు లేఖ రాశారు. 2019-–20 వాటర్‌ ఇయర్‌లో తెలంగాణకు కేటాయించిన నీటిలో 50 టీఎంసీలను ఉపయోగించుకోలేక పోయిందని, ఆ నీటిని ప్రస్తుత వాటర్‌ ఇయర్‌‌కు క్యారీ ఓవర్‌ చేయాలని ఆ రాష్ట్రం కోరుతోందని లేఖలో పేర్కొన్నారు . వాటర్‌ ఇయర్‌లో చేసిన కేటాయింపులను ఆ ఏడాది మాత్రమే వాడుకోవాలని, క్యారీ ఓవర్‌ కుదరదని ఏపీ చెబుతోందంటూ లేఖలో వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాలని కోరారు.

‘కృష్ణా నీళ్లలో 811 టీఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు తాత్కాలిక పంపకాల్లో భాగంగా కేటాయించారు. కృష్ణా బేసిన్‌లో లభ్యమయ్యే నీటిని 66:34 నిష్పత్తిలో పంచుకోవడానికి 2017 నవంబర్‌ 4న నిర్వహించిన కేఆర్‌ఎంబీ ఏడో మీటింగ్‌లో రెం డు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి’’ అని బోర్డు మెంబర్‌ సెక్రటరీ హరికేశ్‌ మీనా పేర్కొన్నారు. 2019-–20 వాటర్‌ ఇయర్‌లో ఏపీకి 647.43 టీఎంసీల కేటాయింపులు ఉండగా 4.56 టీఎంసీల నీటిని అదనంగా తీసుకుందని తెలిపారు. ‘‘తెలంగాణ 333.52 టీఎంసీలు తీసుకోవాల్సి ఉండగా, 278.33 టీఎంసీలు మాత్రమే వాడుకోగలిగింది. 55.19 టీఎంసీల నీటిని తీసుకోలేకపోయింది. అందులో 50 టీఎంసీల నీటిని ప్రస్తుత వాటర్‌ ఇయర్‌లో ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ కోరింది. బోర్డు12వ మీటింగ్‌లోనూ దీనిపై చర్చించాం. ప్రస్తుత వాటర్‌ ఇయర్‌కు వాటర్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చే సమయంలో క్యారీ ఓవర్‌పై త్రీమెన్‌ కమిటీ సమావేశం నిర్వ హించి చర్చిస్తామని సమాచారమిచ్చాం. కానీ క్యారీ ఓవర్‌ నీళ ఇష్యూ రెండు రాష్ట్రాలకు సంబంధించింది కావడంతో దీనిపై కేంద్రమే నిర్ణయం  తీసుకోవాల్సి ఉంది. సీడబ్ల్యూసీ సూచన మేరకు వీలైనంత త్వరగా ఈ అంశాన్ని పరిష్కరించాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

మరోసారి పక్షపాతాన్ని చాటుకున్న బోర్డు

ఏపీకి తాగునీళ్లు అవసరమంటే ఆగమేఘాల మీద త్రీమెన్‌ కమిటీ మీటింగ్‌ పెట్టే కృష్ణాబోర్డు.. క్యారీ ఓవర్‌ సమస్యను మాత్రం కేంద్రానికి నివేదించి తన బాధ్యతల నుంచి తప్పుకుంది. రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో చర్చించి ఏదో ఒక అంగీకారానికి వచ్చే అవకాశమున్నా ఆ ప్రయత్నం చేయలేదు. గతంలో నిర్వహించిన త్రీమెన్‌ కమిటీ మీటింగ్‌లో క్యారీ ఓవర్‌ నీటిని ఆగస్టు వరకు తెలంగాణ వినియోగించుకునేందుకు మౌఖికంగా అంగీకారం తెలిపారు. తర్వాత ఏపీ మాట తప్పడంతో బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది. దానిని పరిష్కరించే అవకాశమున్నా ఇంటర్‌ స్టేట్‌ హైడ్రాలజీ ఇష్యూ అంటూ కేంద్రానికి లేఖ రాసి కేఆర్ఎంబీ చేతులు దులుపుకుంది

Latest Updates