కృష్ణా బోర్టు ఏపీ పక్షపాతి: తెలంగాణ

  •                పోతిరెడ్డిపాడులో లెక్కలకు ఏపీ అనుమతించకున్నా ఏం చేస్తున్నారు?
  •                 40రోజులుగా నీళ్లు విడుదలవుతున్నా స్పందనేది?
  •                 తెలంగాణ అంటే ఓ రకం.. ఏపీ అంటే మరో రకమా?
  •                 బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తీరును తెలంగాణ తప్పుబట్టింది. ఏపీ పక్షపాతిగా బోర్డు వ్యవహరిస్తోందని మండిపడింది. నాగార్జునసాగర్‌‌‌‌ కుడి కాలువ నుంచి తరలిస్తున్న నీటి లెక్కలు ఇప్పటివరకు తీయడానికి ప్రయత్నించలేదని ఆరోపించింది.  పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ నుంచి తరలిస్తున్న నీటిని లెక్కించడానికి జాయింట్‌‌‌‌ టీంను ఏపీ​ అనుమతించకున్నా బోర్డు ఏమీచేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు మెంబర్‌‌‌‌ సెక్రటరీ పరమేశానికి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌‌‌‌ మూడురోజుల క్రితం లేఖ రాశారు. జూరాల ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్‌‌‌‌ స్కీం, నాగార్జునసాగర్‌‌‌‌ ఎడమ కాలువపై అకౌస్టిక్‌‌‌‌ డాప్లర్‌‌‌‌ కరెంట్‌‌‌‌ ప్రొఫైల్స్‌‌‌‌ (ఏడీసీపీ) పరికరాలను ఉపయోగించి నీటి లెక్కలు తీసేందుకు తాము సహకరించామని తెలంగాణ ఈఎన్సీ గుర్తుచేశారు. ఇప్పటికి నాగార్జునసాగర్‌‌‌‌ కుడి కాలువ నుంచి ఎన్ని నీళ్లను తరలిస్తున్నారో ఏడీసీపీతో బోర్డు లెక్కించలేదని, కనీసం అందుకు ప్రయత్నించనూ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక్కడ లెక్కలు తీస్తారు.. మరి, ఏపీలో?

పోతిరెడ్డిపాడు నుంచి తరలిస్తున్న నీటిని లెక్కించేందుకు జాయింట్‌‌‌‌ టీంతోపాటు కృష్ణా బోర్డు ఇంజనీర్లు ప్రయత్నించినా ఏపీ అధికారులు అనుమతించడం లేదని, ఈ విషయంపై బోర్డే ఏపీకి లేఖ రాసిందని తెలంగాణ ఈఎన్సీ గుర్తుచేశారు. కృష్ణా బేసిన్‌‌‌‌లోని అన్ని ప్రాంతాల్లో నీటి లెక్కలు తీసిన తర్వాతే తమ దగ్గర ఏడీసీపీ ద్వారా డిశ్చార్జిని లెక్కించాలంటూ తెలుగు గంగ ప్రాజెక్టు నంద్యాల ఈఈ బోర్డుకు లేఖ రాసిన విషయాన్నీ ప్రస్తావించారు. నీటి లెక్కలు తీసేందుకు తెలంగాణ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని.. అదే ఏపీ విషయానికి వచ్చే సరికి లెక్కలు తీసేందుకు అనుమతించడం లేదని ఆయన మండిపడ్డారు. నాగార్జున సాగర్‌‌‌‌ కుడి కాలువ నుంచి విడుదల చేస్తున్నట్టుగా చెప్తున్న లెక్కలను ఏడీసీపీ పరికరాలను ఉపయోగించి విశ్లేషించాల్సిన బోర్డు ఇంతవరకు ఆ పని ఎందుకు చేయడం లేదని తెలంగాణ ఈఎన్సీ తన లేఖలో ప్రశ్నించారు. నాగార్జున సాగర్‌‌‌‌ కుడి కాలువ నుంచి 40 రోజులకుపైగా నీటిని విడుదల చేస్తున్నా ఎందుకు నీటిని లెక్కించలేదో చెప్పాలని డిమాండ్​ చేశారు. తక్కువ నీటిని తీసుకునే తమ రాష్ట్ర కాలువలు, ఎత్తిపోతల పథకాల నీటిని లెక్కించడానికి చూపిన శ్రద్ధ.. ఎక్కువ నీటిని తరలించే ఏపీ పథకాల విషయంలో ఎందుకు చూపడం లేదని ఆయన నిలదీశారు. కృష్ణా బోర్డు ఏపీకి పక్షపాతిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే నాగార్జునసాగర్‌‌‌‌ కుడి కాలువ నీటిని ఏడీసీపీ ద్వారా లెక్కించాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్​ డిమాండ్‌‌‌‌ చేశారు.

ఇదీ కృష్ణా బోర్డు తీరు..

ఈ ఏడాది ఫ్లడ్‌‌‌‌ సీజన్‌‌‌‌ ప్రారంభం నుంచి కృష్ణా బోర్డు ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూనే వస్తోందని తెలంగాణ అధికారులు అంటున్నారు. సెప్టెంబర్‌‌‌‌ నెలాఖరు వరకు 152 టీఎంసీల నీళ్లివ్వాలని ఏపీ కోరితే.. వెంటనే అందుకు బోర్డు ఆమోదం తెలుపుతూ వాటర్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ను ఇచ్చింది.

పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ నుంచి లెక్కలకు మించి ఏపీ నీటిని తరలిస్తున్న విషయం ఏడీసీపీ తనిఖీల్లో బయటపడ్డా.. బోర్డు లేఖ రాయడం మినహా ఏ చర్యలు చేపట్టలేదు.

వరద రోజుల్లో శ్రీశైలం, నాగార్జున సాగర్‌‌‌‌ ప్రాజెక్టుల గేట్లు ఎత్తినప్పుడు ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకున్న నీటిని కేటాయింపుల నుంచి ఏపీ కోరడమే తరువాయి.. మీ అభిప్రాయం చెప్పాలంటూ బోర్డు తెలంగాణకు లేఖ రాసింది.

ఎడమ కాలువ గేజ్‌‌‌‌ లెక్కలకు, ఏడీసీపీకి వెయ్యి క్యూసెక్కుల తేడా వస్తేనే ఏపీ అధికారులు గగ్గోలు పెట్టగా వివరణ కోరిన బోర్డు, పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పటికే వంద టీఎంసీలకు పైగా ఏపీ తరలించగా.. కేవలం ఒక్క లేఖ రాసి వదిలేసింది.

కృష్ణాలో మళ్లీ వరద వస్తున్న నేపథ్యంలో ఏపీకి మరిన్ని నీళ్లు ఇచ్చేలా త్వరలోనే ఈఎన్సీల సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 18నే సమావేశం జరగాల్సి ఉండగా.. వాయిదా పడింది. త్వరలోనే మళ్లీ సమావేశం నిర్వహించి, వరద నీటిని ఏపీకి కేటాయించే అవకాశముందని తెలంగాణ ఇరిగేషన్‌‌‌‌ ఇంజనీర్లు పేర్కొంటున్నారు.

Latest Updates