‘నీళ్ల తరలింపు ఆపండి.. ఇప్పటికే ఎక్కువ వాడేశారు’

  • ఏపీ సర్కారుకు కృష్ణా బోర్డు లేఖ
  • ఇప్పటికే కేటాయింపులకు మించి తీసుకున్నరు
  • ఇంకా తరలించుకుంటూనే ఉన్నరు
  • నవంబర్ నాటికి ఇచ్చిన కోటాను అక్టోబర్లోనే వాడేశారు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీళ్లు తీసుకోవడం ఆపాలని, ఇప్పటికే కేటాయింపులకు మించి నీటిని తరలించుకుపోయారని ఏపీ జల వనరుల శాఖకు కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఏపీ ఈఎన్సీకి లేఖ రాశారు. తాము నవంబర్‌‌‌‌ నెలాఖరు వరకు వినియోగించుకునేలా వాటర్‌‌‌‌  రిలీజ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌  ఇస్తే.. అక్టోబర్‌‌‌‌  28వ తేదీ నాటికే వాడేశారని, ఇంకో రెండు టీఎంసీలను అదనంగానే తీసుకున్నారని అందులో వివరించారు. ఇప్పటికీ వివిధ పాయింట్ల నుంచి నీటిని తీసుకుంటూనే ఉన్నారని.. బోర్డు ఆదేశాలను గౌరవించి ఇకనైనా నీటిని తరలించుకుపోవడం ఆపాలని సూచించారు.

కేటాయింపుల్లో మనం సగం కూడా తీసుకోలే

కృష్ణా బోర్డు నవంబర్‌‌‌‌ నెలాఖరు వరకు వాడుకునేలా.. ఏపీకి 302 టీఎంసీలను, తెలంగాణకు 126 టీఎంసీలను కేటాయించింది. ఇందులో ఏపీ అక్టోబర్‌‌‌‌ 28 నాటికే 303.992 టీఎంసీల నీటిని తీసుకున్నట్టుగా బోర్డు పరిశీలనలో తేలింది. అంటే ఇంకా 33 రోజుల గడువు ఉండగానే.. కేటాయించిన మొత్తం నీటితోపాటు, మరో 1.992 టీఎంసీల నీటిని అదనంగా తరలించుకుపోయింది. దాంతోపాటు ఇంకా నీటిని తరలించుకుంటూనే ఉంది. దీనిని బోర్డు తప్పుబట్టింది. మరోవైపు తెలంగాణ తనకు కేటాయించిన 126.075 టీఎంసీల నీటిలో.. 66.116 టీఎంసీలను మాత్రమే వాడుకుంది. అంటే నవంబర్‌‌‌‌  నెలాఖరు నాటికి ఇంకా 60.261 టీఎంసీలు వాడుకోవచ్చు. ఈ మేరకు నీటిని వాడుకోగలమా, లేదా అన్నది సందేహంగానే ఉందని మన రాష్ట్ర ఇంజనీర్లు అంటున్నారు.

ఎక్కడి నుంచి ఎన్ని  నీళ్లు?

కృష్ణా బోర్డు పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ నుంచి 116 టీఎంసీ తరలింపునకు ఓకే చెప్పగా ఏపీ అంతకు 25 టీఎంసీలు అదనంగా 141.119 టీఎంసీలను తరలించుకుపోయింది. కృష్ణా డెల్టా సిస్టంకు 68 టీఎంసీలను కేటాయించగా 79.05 టీఎంసీలు, కేడీఎస్​ నుంచీ అదనంగా 11.05 టీఎంసీలను తీసుకుంది. సాగర్‌‌‌‌ కుడి కాల్వకు 83 టీఎంసీలు కేటాయించగా.. 59.234 టీఎంసీలు, ఎడమ కాల్వకు 15 టీఎంసీలకుగాను 10.27.. హంద్రీనీవా, ముచ్చుమర్రి లిఫ్ట్‌‌‌‌ లకు 20 టీఎంసీలకుగాను 14.313 టీఎంసీలను ఏపీ తరలించుకుంది. అదే మన రాష్ట్రం నాగార్జునసాగర్‌‌‌‌ ఎడమ కాల్వ కింద 63.217 టీఎంసీలు ఇవ్వగా 28.497 టీఎంసీలు,    కల్వకుర్తి లిఫ్ట్‌‌‌‌ స్కీంకు  27.717 టీఎంసీలకుగాను 16.374 టీఎంసీలు, ఏఎమ్మార్పీ, హైదరాబాద్‌‌‌‌ మెట్రో వాటర్‌‌‌‌ వర్క్స్‌‌‌‌, మిషన్‌‌‌‌ భగీరథకు 35.141 టీఎంసీలు ఇవ్వగా 20.943 టీఎంసీలే తీసుకుంది.

శ్రీశైలం, సాగర్‌‌‌‌లో ఇంకా 340 టీఎంసీల నీళ్లు

ప్రస్తుత ఫ్లడ్​సీజన్​లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌‌‌  ప్రాజెక్టుల్లో కలిపి ఏపీ, తెలంగాణ వాడిన నీళ్లు 370.10 టీఎంసీలుపోగా.. అక్టోబర్‌‌‌‌ 28 నాటికి 340.29 టీఎంసీల నికర జలాలు (డెడ్​ స్టోరేజీ పోగా) ఉన్నట్టు కృష్ణా బోర్డు లెక్క తేల్చింది.

వివరణ కోరే అవకాశం

కృష్ణా నీటి వినియోగంపై 5వ తేదీన బోర్డు రెండు రాష్ట్రాల అధికారులతో భేటీ కానుంది.వాటర్‌‌‌‌ యుటిలైజేషన్‌‌‌‌పై బోర్డు నిర్వహిస్తున్న రెండో సమావేశం ఇది. నవంబర్‌‌‌‌  ఒకటి నాటికి ఉపయోగించుకున్న నీటి లెక్కలతో రావాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు ఇప్పటికే ఆదేశించింది. ఏపీ ఇప్పటికే కోటాను దాటి నీళ్లను వాడటంపైబోర్డు వివరణ కోరే అవకాశముంది.

Krishna board letter to AP government on usage of water

Latest Updates