నేతలకు కేటీఆర్ క్లాస్ : పదవులు రాంగనే పెద్ద మాటలు!

హైదరాబాద్, వెలుగు: పార్టీ కంటే ఎవరూ గొప్పోళ్లు కాదని, కొందరు పదవులు రాంగనె పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్​ అన్నారు. వారు అనుభవిస్తున్న పదవులన్నీ పార్టీ వల్లే వచ్చాయని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్​లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల పేరు ప్రస్తావించకుండా కొన్ని కామెంట్లు చేసినట్టు తెలిసింది.

‘‘ఈ మధ్య కొందరు నేతలు పార్టీ కంటే తమే గొప్పవాళ్లమనే ఫీలింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం అనుభవిస్తున్న పదవి పార్టీ వల్లే వచ్చిందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. మనం ఇలా ఉన్నామంటే పార్టీ కారణం. వ్యక్తులం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని కేటీఆర్​ అన్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇటీవల మంత్రి ఈటల ‘గులాబీ జెండా ఓనర్లం మేమే…’ అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్​ కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి.

నేతలకు క్లాస్..

మీటింగ్​లో పలువురు నేతలకు కేటీఆర్​ క్లాస్​ తీసుకున్నట్టు తెలిసింది. మీటింగ్​ ఉందని తెలిసీ కొందరు రాలేదని, వారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ జనరల్​ సెక్రెటరీ పల్లా రాజేశ్వర్​రెడ్డికి సూచించినట్టు సమాచారం. మీటింగ్​కు రాజేంద్రనగర్, అంబర్​పేట ఎమ్మెల్యేలతోపాటు డిప్యూటీ స్పీకర్​ పద్మారావు హాజరుకాలేదు. పార్టీ సభ్యత్వ నమోదును సీరియస్​గా తీసుకోలేదని కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

Latest Updates