ఎట్లున్నవ్​ అన్నరు..పొయి కనబడొచ్చిన: కేటీఆర్​

  • ఇందులో విశేషమేమీ లేదు.. గవర్నర్​తో భేటీపై కేటీఆర్​
  • ప్రతిపక్షాలకు విమర్శిద్దా మంటే ఇష్యూస్‌ లేవు
  • నెల రోజుల్లో నే 50 లక్షల సభ్యత్వాలు
  • టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ బీమా.. నేటి నుంచే వర్తింపు

 

గవర్నర్​ పెద్దవారు.. తండ్రిలాంటి వారు.. ఆయనను రెగ్యులర్​గా కలుస్తుంటా. ఈ మధ్య ఒకటి రెండు నెలలు గ్యాపొచ్చింది. ఎక్కడున్నవ్.. ఎట్లున్నవ్​ అని గవర్నర్​ అడిగిండ్రు. అందుకే మర్యాద పూర్వకంగ పొయి కలిసొచ్చిన. విశేషమేం లేదు’’ – టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్

హైదరాబాద్‌‌, వెలుగు: గవర్నర్​ నరసింహన్​ను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని, ఇందులో పెద్ద విశేషమేమీ లేదని టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ‘‘గవర్నర్‌‌ మాకు తండ్రిలాంటి వారు.. ఆయనను నేను రెగ్యులర్‌‌గా కలుస్తుంటా. ఈ మధ్యన కొద్దిగా ఒక నెల రెండు నెలలు గ్యాపొచ్చింది. ఎక్కడున్నావ్‌‌.. ఎట్లా ఉన్నావ్‌‌ అని ఆయన అడిగారు. మర్యాదపూర్వకంగా పొయి కనబడొచ్చిన” అని తెలిపారు.  బుధవారం తెలంగాణ భవన్‌‌లో యునైటెడ్‌‌ ఇండియా ఇన్సూరెన్స్‌‌ కంపెనీ ప్రతినిధులకు పార్టీ కార్యకర్తల ప్రమాద బీమా ప్రీమియం రూ. 11.21 కోట్ల చెక్కును కేటీఆర్‌‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెల రోజుల్లో 50 లక్షల సభ్యత్వాలు చేయించిన పార్టీ టీఆర్‌‌ఎస్‌‌ ఒక్కటేనని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు ఏ పని అప్పగించినా విజయవంతం చేస్తున్నారని తెలిపారు. పార్టీ క్రియాశీల, సాధారణ సభ్యత్వం తీసుకున్న 50 లక్షల మందికి బీమా ప్రీమియం చెల్లించామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌‌లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, కొత్తగా సభ్యత్వం తీసుకునే వారికి బీమా ప్రీమియం మళ్లీ చెల్లిస్తామన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి కార్యకర్తలకు బీమా సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. ఇప్పుడు చెల్లిస్తున్నది ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రీమియమేనని, వచ్చే యేడాది మళ్లీ ప్రీమియం కట్టి రెన్యూవల్‌‌ చేస్తామని వివరించారు.

విమర్శలు, ప్రతివిమర్శలు సహజం

రాజకీయాల్లో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయని, తమ పని తాము చేసుకుపోతామని కేటీఆర్​ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు చాలా మంది చాలా మాట్లాడారని, అంతకుముందు కొందరు శపథాలు చేసి గడ్డాలు కూడా పెంచారని విమర్శించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అత్యంత సహజమన్నారు. డే టుడే ఇష్యూస్‌‌పై స్పందించాలనే ఆసక్తి తమకు లేదని, విమర్శలను పట్టించుకోబోమని చెప్పారు. ప్రతిపక్షాలకు విమర్శిద్దామంటే ఇష్యూస్‌‌ దొరకడం లేదని, అందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని అన్నారు. ‘‘థూ కిత్తా అంటే.. మై కిత్తా అనాలనే ఆసక్తి లేదు. అల్టిమేట్‌‌గా నిర్ణయించేది ప్రజలే. వాళ్ల సంగతి వాళ్లు చెప్పుకుంటారు.. మా సంగతి మేము చెప్పుకుంటాం.. మా ఇద్దరి సంగతి ప్రజలు చెప్తారు’’ కేటీఆర్​ పేర్కొన్నారు.  జిల్లా పరిషత్‌‌ ఎన్నికలప్పుడు ఇట్లానే మాట్లాడరని, అయినా 32 జడ్పీలు టీఆర్‌‌ఎస్సే గెలిచిందని తెలిపారు. మున్సిపల్‌‌ ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాలే సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

దసరా తర్వాత పార్టీ కార్యకర్తలకు శిక్షణ

గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ట పరచాలని తమ అధ్యక్షుడు ఆదేశించారని కేటీఆర్ అన్నా రు. మున్సిపల్‌‌ ఎన్నికల నేపథ్యంలో బూత్‌‌ స్థాయి కమిటీలు వేస్తున్నామన్నారు. గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాలకు కార్యకర్గాల నియామకం తర్వాత మండల కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. దసరా నాటికి అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసులు సిద్ధమవుతాయని, ఆ వెంటనే పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సుశిక్షితులైన పార్టీ సైనికులను తయారు చేసే బాధ్యత తనపై ఉందని కేటీఆర్​ అన్నారు. ముఖ్య కార్యకర్తలకు హైదరాబాద్‌‌, మిగతా వారికి జిల్లా ఆఫీసుల్లో ట్రైనింగ్‌‌ ఇప్పిస్తామని వివరించారు. రాబోయే నాలుగేళ్ల దాకా ఏ ఎన్నికలు లేవని, ఈ సమయమంతా పార్టీ నిర్మాణం, శిక్షణకే ఉపయోగిస్తామన్నారు. ప్రజలు తమ పార్టీకి హండ్రెడ్‌‌ పర్సెంట్‌‌ మ్యాండేట్‌‌ ఇచ్చారని, సీఎం కేసీఆర్‌‌ అద్భుతంగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు సమర్థవంతంగా చేరవేస్తామన్నారు. దేశంలోనే క్రమశిక్షణ గల పార్టీగా టీఆర్‌‌ఎస్‌‌ను తీర్చిదిద్దుతామని కేటీఆర్​  చెప్పారు.

గవర్నర్‌తో కేటీఆర్‌ భేటీ

గవర్నర్‌ నరసింహన్‌తో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌తో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. మున్సిపల్​ చట్టానికి గవర్నర్‌ సవరణలు కోరిన తర్వాత అధికార పార్టీ నేతలెవరూ గవర్నర్‌ను కలువలేదు. మున్సిపల్​ బిల్లుపై జులై 18న సీఎం కేసీఆర్‌ గవర్నర్‌తో భేటీ అయ్యారు.

కేబినెట్​ విస్తరణ తెలియదు

కేబినెట్‌ విస్తరణ గురించి తనకేమి తెలియదని కేటీఆర్​ అన్నారు. అది తనను అడగాల్సిన ప్రశ్నే కాదంటూ మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. రాజ్యసభలో ఆర్టీఐ యాక్ట్​పై టీఆర్​ఎస్​ సపోర్టు చేసింది కదా, దీనిపై వస్తున్న విమర్శలపై మీడియా ప్రశ్నించగా.. అది ఏ అమైండ్​మెంటో, దేనికి సపోర్టు చేశామో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్​ బదులిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల తేదీని నిర్ధారించే అథారిటీ ఎన్నికల కమిషన్‌ది అని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ పరంగా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Updates