
హైదరాబాద్, వెలుగు: ‘‘మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఇంత కాలం నడిచినట్టు ఇక నడవదు. గతంలో ఉన్న కల్చర్ పోవాలి. అవినీతికి దూరంగా ఉండాలి. తప్పుచేసి తలవంపులు తేకండి. తప్పులు చేస్తే పదవులు పోతయ్. ఈ విషయంలో కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారు. తప్పు చేసిన వారిని కాపాడాలని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినా నేను వినను”అని కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అవినీతి రహిత పాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. ‘‘అవినీతి విషయంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బాగా బద్నాం అయితున్నరు. ఎక్కడన్న కొత్తగా ఇల్లు కడుతున్నారంటే అక్కడ ఇసుక కుప్పనో, కంకర కుప్పనో పోయగానే ఆఫీసర్లు, కౌన్సిలర్లు వస్తరు. ఎందుకంటే, గింత పెద్ద బిల్డింగ్ కడుతున్నవ్.. మరి నా సంగతేంది అని అడుగుతరు. ఆ బద్నాం పోవాలి. అయిదేందో అయింది. ఇప్పుడు మారకపోతే సీఎం ఊరుకునే మూడ్ లో లేరు’అని స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ఏం చేయాలో, ఏం చేయకూడదో ఈ సందర్భంగా వారికి కేటీఆర్ వివరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ జస్టిస్
మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో సామాజిక సమతూల్యత పాటించామని కేటీఆర్ చెప్పారు. పదవులు దక్కని అనేక కులాలకు ఈ ఎన్నికల్లో అవకాశం ఇచ్చామని, మహిళలకు 50 % రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టంలో ఉంటే తాము 57 % పదవులను ఇచ్చామని అన్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి టీఆర్ఎస్ కు ప్రజలు వరస విజయాలు అందిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో 130 సీట్లుకు 122 సీట్లు సాధించి చరిత్రలో నిలిచేపోయే విజయాన్ని ప్రజలు అందించారని, వారికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నానని చెప్పారు.
ఉత్తమ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలి
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలను డబ్బులు తీసుకుని ఓటు వేశారంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవమానపరుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్ చేశారని అన్నాడు. ఇప్పుడు డబ్బులు పంచి గెలిచామని అంటుండు. ఉత్తమ్ కు అన్ని వ్యవస్థలపై నమ్మకం పోయింది. ఇక రాజకీయాలు చాలించి ఇంట్లో కూర్చో’’అని సూచించారు. కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికల్లో దిక్కు లేకుండా పోయిందని అన్నారు.
ఇద్దరు చైర్పర్సన్లకు కేటీఆర్ ప్రశంసలు
మున్సిపల్ చైర్పర్సన్లుగా ఎన్నికైన ఇద్దరు యువతులను కేటీఆర్ ప్రశంసించారు. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరవుతున్న జాహ్నవి కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైంది. లా డిగ్రీ పూర్తి చేసుకున్న 22 ఏండ్ల సింధూర కుమారి యంగెస్ట్ చైర్ పర్సన్‌గా మరిపెడలో గెలిచింది. వీరిద్దరిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ‘‘ఐఏఎస్ రాగానే రాజకీయాలు విడిచి వెళ్తావా ఏంది.. బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది”అని జాహ్నవిని ఉద్దేశించి కేటీఆర్ కామెంట్ చేశారు.