రోడ్లేసినం.. ఫ్లైఓవర్లు కట్టినం

ఆరేండ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని పార్టీ క్యాండిడేట్లకు సూచించారు. హైదరాబాద్ లో అభివృద్ధి కావాలా? అశాంతి కావాలా? అని ఓటర్లను అడగాలన్నారు. జీహెచ్ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రగతి నివేదికను శుక్రవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ రిలీజ్ చేశారు. ఆరేండ్లలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.67,149.23 కోట్లు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.  తర్వాత అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. టికెట్ రాని ఇతర నేతలకు ఇండ్లకు వెళ్లి, వారి సహకారం తీసుకోవాలని సూచించారు. గర్వం, అహంకారంతో వ్యవహరించొద్దన్నారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడని, ఆయన నేతృత్వంలో హైదరాబాద్ సురక్షితంగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా సిటీకి తాగునీటి సమస్య రాకూడదని కేశవాపురం రిజర్వాయర్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థులకు బీ ఫామ్స్ అందించారు. శనివారం ఉదయమే అందరూ ఎన్నికల అధికారులకు అందించాలని ఆదేశించారు.

హైదరాబాద్ ఆర్థిక ఇంజన్

రాష్ట్రానికి హైదరాబాద్ నగరం ఆర్థిక ఇంజన్ లాంటిదని కేటీఆర్ అన్నారు. ‘‘హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే రైతు బంధు వస్తది. హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటది. నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి’’ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం పైసా కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర విధానాల వల్ల రైల్వే శాఖ దివాళా తీస్తోందని, దీన్ని రైల్వే ఎంప్లాయిస్ ఉండే ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు.

సంజయ్ మాటలకు నవ్వుకుంటున్నారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ‘‘జీహెచ్ఎంసీలో గెలిస్తే ఇంటికి రూ.25 వేల వరద సాయం చేస్తామని చెబుతున్న బీజేపీ.. నయా పైసా సాయం చేయలేదు. కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయి తీస్తడా? ట్రాఫిక్ చలాన్లు ఎత్తేస్తామని చెబుతున్నరు. కేంద్రం తెచ్చిన చట్టాన్ని ఉల్లంఘిస్తరా? గుజరాత్, కర్నాటకలో మీరే చలాన్లు కడ్తున్నారా?’’ అని ప్రశ్నించారు. సంజయ్ కు ధర్నా చేయడానికి భాగ్యలక్ష్మి గుడే దొరికిందా? అని ప్రశ్నించారు. బీజేపీకి దమ్ముంటే హైదరాబాద్ అభివృద్ధి కోసం లక్ష కోట్ల ప్యాకేజీ తేవాలన్నారు.

కూకట్ పల్లి నుంచి షురూ

కేటీఆర్ ఎన్నికల ప్రచారం శనివారం నుంచి స్టార్ట్​ కానుంది. కూకట్ పల్లిలో సాయంత్రం ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తా, చిత్తారమ్మ తల్లి చౌరస్తా, మూసాపేట్ లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. తర్వాత కుత్బుల్లాపూర్ సెగ్మెంట్​లోని ఐడీపీఎల్ చౌరస్తా, సాగర్ హోటల్ జంక్షన్ లో రోడ్ షో
నిర్వహిస్తారు.

జాబితాలో ఒకరు..బీ ఫామ్ మరొకరికి..

టీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్స్ ఇచ్చే సమయంలో గందరగోళం ఏర్పడింది. జాబితాలో ఒక పేరు ప్రకటించి, బీ ఫామ్స్ మరొకరికి ఇచ్చారు. ఘంసీబజార్ టికెట్ ను ముందు ఇషితకు ప్రకటించి.. బీ ఫామ్ మాత్రం గోపి గౌడ్ కు ఇచ్చారు. అహ్మద్ నగర్ టికెట్ ను సారికకు ప్రకటించి బీ ఫామ్​ను ఎస్.మమతకు ఇచ్చారు. లంగర్ హౌజ్ డివిజన్​లో ముందు పార్వతమ్మ యాదవ్ పేరు ప్రకటించారు. కానీ బీ ఫామ్ మాత్రం భాగ్యలక్ష్మికి ఇచ్చారు. ‘‘ముందు నా పేరు ప్రకటించారు. తెలంగాణ భవన్​కు వచ్చాక మాత్రం భాగ్యలక్ష్మికి బీ ఫామ్ ఇచ్చారు. 5 లక్షలు తీసుకుని లోకల్ లీడర్ జీవన్ సింగ్ టికెట్ ఇవ్వలేదు’’ అని పార్వతమ్మ వాపోయారు. బేగం పేట సిట్టింగ్ కార్పొరేటర్ ఉప్పల తరుణికి టికెట్ ఇవ్వలేదు. అభ్యర్థులతో పాటే హాల్ లో కూర్చుని కేటీఆర్ వచ్చాక ఆయన్ను కలవాలని ఆమె అనుకున్నారు. కాని టికెట్ రాని వారు హాల్ నుంచి వెళ్లిపోవాలని పదే పదే అనౌన్స్ చేయడంతో ఆమె బయటికి వెళ్లిపోయారు.

Latest Updates