మోడీ పైసా ఇయ్యలె.. బీజేపీనేమో మస్తు జేసినమంటోంది

  • సిరిసిల్ల, వేములవాడ రోడ్ షోల్లో మంత్రి కేటీఆర్
  • రెబల్స్‌‌ను నమ్మొద్దు.. టీఆర్‌‌ఎస్సోళ్లమంటరు
  • గెలిచాక మళ్లీ పార్టీలోకి వస్తమంటే తీసుకోమని స్పష్టం

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ర్టానికి నీతి ఆయోగ్ ద్వారా రూ.19 వేల కోట్లు ఇవ్వాలని, కానీ ప్రధాని మోడీ 19 పైసలు కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్‌‌ విమర్శించారు. బీజేపీ మాత్రం తెలంగాణకు ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్యాండిడేట్లను చూసి కాకుండా పార్టీని చూసి ఓటేయాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలకు మద్దతు పలకాలన్నారు. శనివారం సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్‌‌ఎస్‌‌ నుంచి బయటకెళ్లి రెబల్స్‌‌గా పోటీ చేస్తున్న క్యాండిడేట్లు పార్టీ వాళ్లమని చెప్పుకుంటరని, వాళ్లను నమ్మొద్దని ప్రజలకు కేటీఆర్‌‌ విజ్ఞప్తి చేశారు. రెబల్స్‌‌గా గెలిచి మళ్లీ పార్టీలోకి వస్తామంటే తీసుకోమని స్పష్టం చేశారు.

రెండేండ్లల్లో సిరిసిల్లకు రైలు

‘‘మేం చాలా అభివృద్ధి పనులు చేశాం. వేరే వాళ్లకు ఓటేయొద్దు. ఏ పార్టీకి కూడా సిరిసిల్లలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. టీఆర్ఎస్ పార్టీకే ఉంది” అని కేటీఆర్‌‌ అన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకుంటానన్నారు. వచ్చే రెండేళ్లలో సిరిసిల్లకు రైలు మార్గాన్ని తెచ్చే బాధ్యత తనదని చెప్పారు. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రాష్ర్టంలోని అన్ని మున్సిపాలిటీలకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చేలా పురపాలన.. పరిపాలన చేస్తామన్నారు. అవినీతి లేని పాలన సాగిస్తామని, తప్పు చేస్తే టీఆర్ఎస్ కౌన్సిలర్లపైనే ముందుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, రాయిని చెరువులో 3 వేల ఇండ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్​బాబు, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

KTR Road Show was conducted in Sircilla and Vemulawada municipalities

Latest Updates