ఇప్పటి వరకు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశాం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేశామని, అవసరమైతే మరిన్ని ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని టీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రైవేటు రంగంలోనూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టీఎస్ ఐపాస్​ తెచ్చామని చెప్పారు. టీఎస్​ ఐపాస్​తో సుమారు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చామని,  దీంతో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పని చేయాలని టీఆర్ఎస్  కేడర్​కు ఆయన పిలుపునిచ్చారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల ఇన్​చార్జ్​లతో కేటీఆర్ గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీలే దివాలా తీశాయని, వారికి ప్రజల్లోకి పోయేందుకు ఎజెండా దొరకని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. గత 60 ఏండ్లలో తాగునీటి చుక్క కూడా అందని అనేక పల్లెలు.. ఈ రోజు జల సిరులతో కళకళలాడుతున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాలో అక్టోబర్ 1న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కేటీఆర్​ సూచించారు.

Latest Updates