మా తాతగారి ఊరిదే.. నా సొంత ఖర్చుతో సేవ చేస్తా

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమంలో తన పూర్వీకుల మూలాలను గుర్తు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట తన తాత గారి ఊరని చెప్పారు. ఈ గ్రామానికి తన సొంత నిధులతో ఏదైనా సేవ చేస్తానన్నారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి కేటీఆర్ మోహినికుంట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పల్లెలు బాగుపడితేనే అభివృద్ధి సాధ్యమౌతుందన్న సీఎం మాటను నిజం చేయాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. తమ పూర్వీకుల మూలాలు మోహినికుంట గ్రామంలోనే ఉన్నాయని, తన తాతది ఈ ఊరేనని అన్నారు. గ్రామంలో తాత, నానమ్మల పేరుతో సొంతఖర్చులతో సకల సౌకర్యాలతో కూడిన ఫంక్షన్ హాల్ కట్టిస్తానని చెప్పారు. జనానికి తాగునీరు, 24 గంటల కరెంట్ ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ అని అన్నారు. మల్లన్నసాగర్‌కు వెళ్లే ప్రధాన కాలువ నుంచి ముస్తాబాద్ మండలంలోని ఏడు గ్రామాలకు నీరందిస్తాని చెప్పారు కేటీఆర్. ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామాల మంత్రి అని, తాను పట్టణాల మంత్రి కాబట్టి అభివృద్ధిలో తమ ఇద్దరికే పోటీ ఉందని అన్నారు.

కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండడం మా అదృష్టం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ కడుపులో రత్నం లాంటి సమర్ధుడైన కేటీఆర్ పుడితే.. చంద్రబాబు కడుపున పుట్టిన లోకేశ్‌ను చూస్తే నవ్వు వస్తోందన్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండటం తమ లాంటి సీనియర్ల అదృష్టమని చెప్పారు. మోహినికుంట గ్రామం రాష్ట్రానికి ఆదర్శంగా ఎదగాలని అన్నారు. తన సొంత నిధులతో ఫంక్షన్ హాల్ కట్టిస్తానని చెప్పిన కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పారాయన. గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డా ఊరికి ఏదో రకమైన సేవ చేయాలని, యువత, మహిళలు కమిటీలుగా ఏర్పడి ఊరి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్నీ కేసీఆరే, ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదన్నారు.

Latest Updates