నేతన్నే ఇక యజమాని.. రూ.380కోట్లతో కొత్త పథకం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టెక్స్ టైల్, హ్యాండ్లూం పరిశ్రమ అధికారులతో కేటీఆర్ సమీక్ష జరిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. గడిచిన మూడేళ్లలో బతుకమ్మ చీరల కోసం రూ.900 కోట్ల ఆర్డర్ ఇచ్చామన్నారు. నేతన్నలకు పని కల్పించడంతో పాటు రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలకు చిరుకానుక అందించేందుకే ఈ పథకం తెచ్చామన్నారు. బతుకమ్మ చీరల తయారీతో నేత కార్మికులకు 8  నెలల పాటు పని దొరుకుతోందన్నారు. చేనేత, మర మగ్గాలకు జియో ట్యాగింగ్ పూర్తి చేశామన్నారు.

కార్మికుడే యజమానిగా కొత్త స్కీమ్

పవర్ లూం నూలు మీద ఇస్తున్న 10 శాతం సబ్సిడీ కారణంగా.. ఖజనాపై రూ. 9 కోట్ల భారం పడుతోందన్నారు. కార్మికున్ని యజమానిగా చేయాలన్న లక్ష్యంతో  రూ.380 కోట్లతో సిరిసిల్లలో మరో కొత్త పథకం త్వరలోనే తేబోతున్నామని చెప్పారు కేటీఆర్. వేలాది మంది నేత కార్మికులను యజమానులుగా మారుస్తామన్నారు. సిరిసిల్లలో రూ.175 కోట్లతో 64 ఎకరాల్లో అప్పెరెల్ పార్కు నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడ 10 వేల మంది నేత కార్మిక కుటుంబాల్లోని మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు.

11వేల మరమగ్గాల ఆధునీకరణ కోసం 50 శాతం సబ్సిడీ ఇచ్చామనీ.. టెక్స్ టైల్ పార్కులో ఉన్న యజమానులంతా మరమగ్గాలను ఆధునికీకరించుకోవాలని కోరారు కేటీఆర్. అప్పుడే మిగతా పరిశ్రమలతో పోటీ పడి కొత్త రకం వస్త్రాలు తయాలు చేయగలుగుతారని చెప్పారు. 40 శాతం రాష్ట్రం, 10 శాతం కేంద్రం సహాయంతో నూలు, రసాయనాలపై సబ్సిడీ అందిస్తున్నామన్నారు. 11 వేల చేనేత కార్మికులకు రుణ మాఫీ చేశామనీ.. కొండా లక్ష్మన్ బాపూజీ పేరుతో జాతీయ చెనేత దినోత్సవం రోజున అవార్డులు ఇస్తున్నామని చెప్పారు.

వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న రంగం చేనేత, జౌళీ పరిశ్రమే అన్నారు కేటీఆర్. సెప్టెంబరు 15 నాటికి కోటి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకు అందించబోతున్నామనీ.. సిరిసిల్ల చీరలకు  కూడా బ్రాండింగ్ తీసుకురావాలని టెక్స్ టైల్ కమిషనర్ ను కోరామన్నారు. మన నేతన్నల నైపుణ్యానికి ప్రచారం కల్పించేలా మీడియా కృషి చేయాలని విజ్ఞప్తిచేశారు కేటీఆర్.

Latest Updates