మోతె ప్రాంతానికి సాగునీరు అందిస్తాo

కరీంనగర్: నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆనాడు దాశరథి అంటే.. ఇప్పుడు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కావాలని కేసీఆర్ కలలు కంటున్నారన్నారు మంత్రి కేటీఆర్. బుధ‌వారం ఆయ‌న చొప్పదండి మండలం వెదురుగట్టలోని హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడారు. ‌వెదురుగట్ట గ్రామంలోని 200 ఎకరాల్లో 69 వేల మొక్కలు నాటే హరితహార కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమ‌న్నారు. మొక్కల ప్రాధాన్యతను సీఎం కేసీఆర్ గుర్తించినంతగా మరెవరూ గుర్తించలేదన్నారు. నీళ్లు కొనుక్కునే తాగే రోజులొస్తాయని ఆనాడు బ్రహ్మంగారు చెప్పిన మాటలు నిజమవుతాయని ఎవరూ అనుకోలేదన్నారు. చెట్లు సంరక్షించకపోతే భవిష్యత్తులో గాలి కూడా కొనుక్కునే రోజులు వస్తాయని.. మొక్కలు నాటకపోతే భవిష్యత్తులో తీవ్ర విపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

పుట్టినప్పుడు ఊగే ఊయల నుంచి చనిపోయినప్పుడు కాల్చే కట్టె వరకు చెట్లు మనిషికి ఎంతో అవసరమ‌ని చెప్పారు కేటీఆర్. తెలంగాణలోని ఫారెస్టు కవరేజ్ ఏరియాను 33 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో హరితహారం సాగుతోందన్నారు. 180 కోట్లకు పైగా మొక్కలు ఇప్పటి వరకు నాటామ‌ని.. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గ్రామాల్లో పెట్టిన మొక్కల్లో 85 శాతం బతకపోతే సర్పంచి పదవి పోయేలా పంచాయితీ రాజ్ చట్టం తెచ్చారని గుర్తు చేశారు. అన్ని రకాల రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. మియావాకీ టెక్నాలజీతో కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారని తెలిపారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఆయ‌న‌.. కరోనా వల్ల ప్రపంచమంతా ఆందోళనతో ఉన్నా.. మనం దానితో సహజీవనం సాగిస్తూనే మిగతా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నామ‌న్నారు.

ఇంతటి కష్టకాలంలో కూడా పేదలు, రైతులకు సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నామ‌న్నారు. వేల కోట్ల రూపాయలతో వడ్ల కొనుగోళ్లు పూర్తి చేశామ‌ని.. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవని.. రాబోయే నాలుగేళ్లు పూర్తి స్థాయిలో అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామ‌న్నారు. రాజకీయాలకు అతీతంగా హరితహారంలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 12750 గ్రామాలకు మొక్కల సంరక్షకు కావాల్సిన ట్యాంకర్లు ఇతర వసతులు సమకూర్చామ‌ని చెప్పారు. 338 కోట్లు ప్రతి నెల అన్ని గ్రామ పంచాయితీల అభివృద్ధి కోసం కేటాయిస్తున్నామ‌ని.. చొప్పదండి నియోజకవర్గంలోని మోతె ప్రాంతానికి సాగునీరు అందిస్తామ‌న్నారు మంత్రి కేటీఆర్.

Latest Updates