తెలంగాణకు నరసింహన్ పదేళ్లపాటు తండ్రిలా తోడున్నారు : KTR

రాష్ట్ర గవర్నర్ గా సుదీర్ఘకాలం పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ సేవలను సోషల్ మీడియాలో గుర్తుచేసుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు. ట్విట్టర్ లో ఆయనకు వీడ్కోలు సందేశం ఇచ్చారు. ఎన్నోసార్లు, విభిన్న అంశాలపై ESL నరసింహన్ తో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు కేటీఆర్.

తెలంగాణ ఆవిర్భావానికి ముందు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. మొత్తంగా రాష్ట్రానికి పదేళ్లపాటు సుదీర్ఘ కాలం పాటు గవర్నర్ గా నరసింహన్ సేవలందించారని అన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వానికి నరసింహన్ విలువైన మార్గనిర్దేశం చేశారని అన్నారు. పదేళ్ల పాటు.. తెలంగాణకు తండ్రిలాంటివాడుగా, సంరక్షకుడిగా ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నరసింహన్ కు మంచి ఆరోగ్యం, ప్రశాంతత లభించాలని ఆకాంక్షించారు కేటీఆర్.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త పదవిలో అద్భుతమైన కెరీర్ ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు కేటీఆర్.

Latest Updates