స్టోర్ సిబ్బందిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

హయత్ నగర్,వెలుగు: విదేశీయులనుకొని ఇద్దరు మణిపూర్‌ యువకులను సూపర్ మార్కెట్‌లోకి అనుమతించని సంఘటన వనస్థలిపురంలో జరిగింది. వనస్థలిపురం పనామా సమీపంలో ఉన్న స్టార్ సూపర్‌ మార్కెట్‌ కు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు సమీపంలోని హిల్స్ కాలనీలో ఉండే మణిపూర్ యువకులు వచ్చారు. అయితే సెక్యూరిటీ గార్డులు వారిని విదేశీయులనే అనుమానంతో లోపలికి రానివ్వలేదు. వారు ఆధారాలు పంపించినా లోపలికి వెళ్లనీయకుండా  అడ్డుకున్నారు. ఇదే విషయాన్ని జోనా అనే యువకుడు మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. స్పందించిన మంత్రి సూపర్‌ మార్కెట్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కమిషనర్లు, ఎస్పీలకు సూచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై వీపన్, థంకై హోయకిన్ అనే యువకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనస్థ లిపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో పాటు స్టోర్ మేనేజర్ వెంకట రమణను అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates