మేం బూతు పురాణం మొదలు పెడితే ఎవర్నీవదలం

  • ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలంటూ బీజేపీ నేతలకు వార్నింగ్
  • దుబ్బాకలో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు
  • బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ.. సొసైటీలో తక్కువ
  • కాంగ్రెస్ లీడర్లు టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ గా ఉన్నరు
  • రేవంత్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది
  • మీడియా చిట్ చాట్​లో కామెంట్స్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం చైర్ కు విలువ ఇవ్వకుండా కేసీఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘బీజేపీ సంస్కారం లేని పార్టీ. సీఎం చైర్ ను గౌరవించే సంస్కారం లేదు. సీఎంను కొందరు లీడర్లు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. మేం బూతు పురాణం మొదలు పెడితే ఎవర్నీ వదలం. కేంద్ర మంత్రులు, ప్రధానిని కూడా తిడ్తం. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడండి’’ అని వార్నింగ్ ఇచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికపై కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. బీజేపీ లీడర్లు వాట్సాప్ యూనివర్సిటీ పెట్టుకున్నారని, అందులోనే మునిగి తేలుతున్నారని ఎగతాళి చేశారు.

‘‘పెన్షన్​లో తమ డబ్బులు ఉన్నాయని. కేసీఆర్ కిట్ లో తమ డబ్బులు ఉన్నాయని అంటారు. కానీ మామ ఇంట్లో దొరికిన డబ్బులు మాత్రం తనవి కావని బీజేపీ అభ్యర్థి అంటున్నారు” అని విమర్శించారు. కిషన్ రెడ్డి మాత్రం హుందాతనంగా మాట్లాడుతున్నారని చెప్పారు.

మా సీటు మేం సంపాదించుకుంటం

దుబ్బాక బై ఎలక్షన్​లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుపై వీసమెత్తు అనుమానం లేదని, గతంలో కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసలు తమకు ప్రత్యర్థులే లేరని అన్నారు. ‘‘దుబ్బాక సీటు మాది. మాది మేం సంపాదించుకుంటాం. మా అభ్యర్థిపై ఎలాంటి  మచ్చ లేదు. ఎలాంటి కేసులు లేవు” అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు ఒకేతీరుగా అభివృద్ధి జరగవని, స్థానికంగా ఉన్న వనరుల మేరకు డెవలప్​మెంట్ జరుగుతోందని కేటీఆర్ అన్నారు. 60 ఏళ్లలో రాష్ట్రం ఒకేలా ఉందా అని ప్రశ్నించారు. ‘‘సిద్దిపేట, గజ్వేల్ లో మాదిరిగా దుబ్బాకలో అభివృద్ధి జరగాలనేం లేదు. దుబ్బాక అభివృద్ధిపై ఓటర్లు తీర్పు ఇస్తారు’’ అని చెప్పారు. దుబ్బాకలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఉంటుందా? లేదా? అనేది క్లారిటీ రాలేదని తెలిపారు.

రేవంత్ బీజేపీలో చేరొచ్చు

కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు తమతో టచ్ లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఆ పార్టీకి మిగిలేది గుండు సున్న అని ఎగతాళి చేశారు. ‘‘ఆ పార్టీ లీడర్లు తలో దిక్కు చూస్తున్నారు. కొందరు మా పార్టీలోకి వచ్చేందుకు.. మరికొందరు బీజేపీ వైపు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సమర్థులైన నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం తప్పేమి కాదు” అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోందని కేటీఆర్ అన్నారు. మొదట్నించి వివిధ పార్టీలు మారిన చరిత్ర రేవంత్ కు ఉందని గుర్తుచేశారు. ‘‘ఆయనో లీడరా.. పొలిటికల్ కామెంటేటర్​గా మారాడు కదా. అడ్డిమారు గుడ్డి దెబ్బతో ఎంపీగా గెలిచారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పని ఖతమ్’’ అని విమర్శించారు.

సంజయ్ కి సీఎం స్థాయి ఉందా

‘‘బీజేపీ సొసైటీలో తక్కువ.. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటుంది. ఆ పార్టీ నేతలు గోబెల్ కే పాఠాలు నేర్పే స్థాయికి వెళ్లారు. నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు’’ అని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కి సీఎం స్థాయి ఉందా అని ప్రశ్నించారు. తమ మంత్రి హరీశ్ చర్చకు రమ్మంటే రాలేదన్నారు. దుబ్బాక కోసం బీజేపీ ఏం చేసిందో వైట్ పేపర్ రిలీజ్ చేయాలని సవాల్ చేశారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా… అదనంగా నిధులేం రాలేదని విమర్శించారు. హైదరాబాద్ కు వరదలు వస్తే ఇంతవరకు ఒక్క పైసా సాయం చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని అడిగినా పట్టించుకోవడం లేదని చెప్పారు.

వరద సహాయక చర్యల్లో స్పీడ్ పెంచండి

భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం చేపట్టిన సహాయక చర్యల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ మాసబ్‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌లోని తన ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, జలమండలి, విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు ఇస్తున్న రూ.10 వేల సాయం పంపిణీ గురువారంతో పూర్తవుతుందని అధికారులు మంత్రికి వివరించారు. సిటీలో శానిటేషన్‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ చేపట్టామని తెలిపారు. వరద ప్రభావ ప్రాంతాల్లో డిస్‌‌‌‌‌‌‌‌ ఇన్ఫెక్టర్స్‌‌‌‌‌‌‌‌ చల్లుతున్నామని, బురద తొలగించడం, చెత్త తరలించడం కోసం అదనపు సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. 18 వేల టన్నుల చెత్తను తరలించామని, ఎక్కడైనా చెత్త ఉన్నట్టుగా జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీకి ఫోన్‌‌‌‌‌‌‌‌ చేస్తే దానిని తరలించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రోడ్ల రిపేర్ల పనుల్లో వేగం పెంచాలని, సర్కిళ్ల వారీగా ఇందుకు ప్లాన్ రూపొందించుకోవాలని మంత్రి సూచించారు.

సిద్దిపేట, గజ్వేల్ లో మాదిరిగా దుబ్బాకలో అభివృద్ధి జరగాలనేం లేదు. దుబ్బాక అభివృద్ధిపై ఓటర్లు తీర్పిస్తరు. ఈ సీటు మాది. మాది మేం సంపాదించుకుంటాం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో  ఒకేతీరుగా అభివృద్ధి జరగదు. స్థానిక  వనరుల మేరకు డెవలప్​మెంట్ జరుగుతుంది. 60 ఏండ్లలో రాష్ట్రం ఒకేలా ఉందా?  దుబ్బాకలో కేసీఆర్ ప్రచారంపై ఇంకా క్లారిటీ రాలేదు.

– మంత్రి కేటీఆర్

కేసీఆర్ నాయకత్వంలోనే

హరీశ్, తాను, పార్టీ లీడర్లందరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ‘‘ఏ ఎన్నికల్లో ఎవరికి బాధ్యతలు ఇవ్వాలో కేసీఆర్ నిర్ణయిస్తారు. హుజూర్ నగర్ లో ఒకరికి, జీహెచ్ఎంసీలో మరొకరికి బాధ్యతలు ఇచ్చారు. దుబ్బాకలో హరీశ్ కు ఇచ్చారు’’ అని అన్నారు. రైతుల కోసం రాష్ట్రం చేస్తున్న ఖర్చుల వివరాలు చూసి ఆర్బీఐ మెచ్చుకుందని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ, రైతుబంధు కోసం ఆరేళ్లలో రూ.56 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

Latest Updates