పాక్ తప్పును ICJ లో నిలదీసిన ఇండియా

కుల్ భూషణ్ జాదవ్ కేసుపై నెదర్లాండ్స్ లోని హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరిగింది. జాదవ్ ను అరెస్ట్ చేయడం దగ్గర్నుంచి, ఎఫ్ఐఆర్ నమోదు, విచారణ, శిక్ష విధింపు వరకు పాకిస్తాన్ ఎలా తప్పులు చేసిందో హేగ్ ఇంటర్నేషనల్ కోర్టులో సీనియర్ లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. 4 రోజుల పాటు జరిగే విచారణలో తొలి రోజు భారత్ వాదనలు వినిపించింది. పాకిస్తాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడం, దౌత్య సహాయం అందకుండా చేయడంపై హరీష్ సాల్వే వాదించారు.

కుల్ భూషణ్ జాదవ్ ను ఎప్పుడు అరెస్ట్ చేశారన్న విషయంపై పాకిస్తాన్ క్లారిటీ ఇవ్వలేదన్నారు సాల్వే. FIR కూడా ఆలస్యంగా దాఖలు చేశారన్నారు. జాదవ్ పై మోపిన అభియోగాలకు ఆధారాలు కూడా పాకిస్తాన్ చూపడం లేదన్నారు. ఇతరుల పేరుపై ఉన్న పాస్ పోర్టుతో పాకిస్తాన్ వచ్చినందుకే అరెస్ట్ చేశామని చెప్పడం తప్ప.. ఉగ్రవాద కార్యక్రమాలు చేస్తున్నారనడానికి ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు.

జాదవ్ కు భారత దౌత్య సహాయం అందించాలని 13 సార్లు పాకిస్తాన్ ను కోరినా పట్టించుకోలేదన్నారు హరీష్ సాల్వే. బెలూచిస్తాన్ లో అరెస్ట్ చేశామని పాక్ చెప్పడం కరెక్ట్ కాదని, ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. వియన్నా ఒప్పందం ఆర్టికల్ 36 ప్రకారం ఇతర దేశస్తుల్ని అరెస్ట్ చేస్తే ఆ దేశానికి సమాచారం ఇవ్వాలని పాకిస్తాన్ మాత్రం ఆ పని చేయలేదని వాదనలు వినిపించారు.

జాదవ్ కు పాకిస్తాన్ సరైన న్యాయ సహాయం కూడా అందించలేకపోయిందని, దౌత్య సహాయం అందించాలని భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ఉన్నా దాన్ని కూడా పాకిస్తాన్ పట్టించుకోలేదని వాదించారు సాల్వే. జాదవ్ పై ఎలాంటి దర్యాప్తు జరిగిందో పాక్ చెప్పలేదని, మిలటరీ కోర్టు ఏకంగా మరణ శిక్ష విధించడం ఎంత వరకు కరెక్ట్ అని వాదించారు సాల్వే. మార్చి 3, 2016లో జాదవ్ ను పాక్ అదుపులోకి తీసుకుంది. 2016 ఏప్రిల్ లో FIR నమోదు చేసింది పాక్. ఈ కేసులో మంగళవారం పాకిస్తాన్ తన వాదనలు వినిపిస్తుంది. మళ్లీ 20న భారత్, 21న పాక్ తుది వాదనలు వినిపిస్తాయి. జాదవ్ కేసుపై మే నాటికి తుది తీర్పు వచ్చే అవకాశముంది.

జాదవ్ కేసు విచారణకు ముందు హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ అధికారులు పాకిస్తాన్ కు షాక్ ఇచ్చారు.  పాకిస్తాన్ అడ్వొకేట్ జనరల్ అన్వర్ మన్సూర్ ఖాన్ , భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రెటరీ దీపక్ మిట్టల్ కు షేక్ హ్యాండ్ ఇవ్వబోగా… మిట్టల్ కేవలం నమస్కారం మాత్రమే పెట్టారు. పుల్వామా దాడి నేపథ్యంలో ఈ విధంగా భారత్ నిరసన తెలిపింది.

Latest Updates