
బెంగళూరు/న్యూఢిల్లీ:కర్నాటకలో వారం రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న పొలిటికల్ డ్రామా ప్రీక్లైమాక్స్‌కు చేరింది. తాను బలపరీక్షకు నిలబడతానని ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించడం సంచలనంగా మారింది. ఆయన భావిస్తున్నట్లు ఈ నెల 17నే(బుధవారం) బలపరీక్ష జరిగితే క్రైసిస్‌కు ఎండ్‌కార్డ్ పడ్డట్టే! కాగా, ఇప్పటి వరకు కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణించిన జేడీఎస్.. తాజాగా బీజేపీతో జట్టుకట్టబోతున్నదనే అనూహ్య చర్చ రాజకీయ వర్గాల్లో
నడుస్తోంది. జేడీఎస్‌కు బీజేపీ డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసిందన్న ప్రచారం కన్నడనాట జోరుగా సాగుతోంది. వీటిని ఏ పార్టీకూడా నిర్ధారించలేదు. బీజేపీతో సహా అన్ని పార్టీలూ ముందుజాగ్రత్త చర్యగా తమ ఎమ్మెల్యేల్ని రిసార్ట్స్‌కు తరలించాయి. 17వ తేదీనే బలపరీక్ష నిర్వహించాలని బీఏసీ మీటింగ్‌లో స్పీకర్‌ను సీఎం కోరారు. అయితే, ప్రతిపక్ష బీజేపీ సమావేశానికి రానందున, సోమవారం జరిగే బీఏసీలో బలపరీక్ష డేట్, టైమ్ ఫిక్స్ చేద్దామని స్పీకర్ సూచించారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేల కేసులో కర్నాటక స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఈ నెల 18 వరకు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని సీజేఐ బెంచ్ ఆదేశించింది. వీళ్లు కాకుండా మరో ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేల్ని తన ముందు హాజరు కావాలంటూ స్పీకర్ తాజాగా నోటీసులు జారీచేశారు.
అవకాశాన్ని వదులుకోను: సీఎం కుమార
అసెంబ్లీ సమావేశాల తొలిరోజైన శుక్రవారం సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సీఎం కుమారస్వామి మాట్లాడారు. కొంత మంది ఎమ్మెల్యేల అనుచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడిందని, అది తొలగిపోవాలంటే తాను బలపరీక్షకు నిలబడకతప్పదని ఆయన అన్నారు. ‘‘అందరి కన్ఫ్యూజన్ను తొలగించడానికి నాకో అవకాశం వచ్చింది. దీన్ని వదులుకోను. పర్మనెంట్‌గా పవర్లో ఉండిపోదామన్న ఉద్దేశంతో నేనీ పదవిలో కూర్చోలేదు. బలపరీక్షలో నెగ్గితేనే సీఎంగా కొనసాగుతా. నాకు నేనుగా స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమిది’’అని సీఎం వెల్లడించారు.
స్పీకర్‌పై సుప్రీం ఆంక్షలు
ఈ నెల 18 వరకు రెబల్ గ్రూప్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపైగానీ, వాళ్లపై అనర్హత వేటు వేసే విషయంలోగానీ కర్నాటక స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని, యధాతథ స్థితిని కొనసాగించాలని సీజేఐ బెంచ్ శుక్రవారం ఆదేశాలిచ్చింది.తదుపరి విచారణ ఈ నెల 16 వరకు వాయిదా వేసింది. రాజ్యాంగంలోని 190, 361 అధికరణలతో ఈ కేసు ముడిపడి ఉన్నందున స్పీకర్.. ఎమ్మెల్యేల రాజీనామాల్ని ఆమోదించే ముందు వాళ్లపై అనర్హతవేటు వేయొచ్చా లేదా అన్నది నిర్ణయించాల్సిఉందని బెంచ్ పేర్కొంది. రెబల్స్ తరఫున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ, స్పీకర్ రమేశ్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.