కరోనా టైమ్‌లో కుంభమేళా అవసరమా?

కరోనా టైమ్‌లో కుంభమేళా అవసరమా?

ముంబై: దేశంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌లో రూపం మార్చుకున్న వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత కొన్ని రోజులగా ప్రతిరోజు రెండున్నర లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో లక్షల మంది పాల్గొనే కుంభమేళా నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే 20 లక్షల మంది పుణ్యస్నానాల కోసం హరిద్వారాకు వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. కుంభమేళాలో పాల్గొన్న పలువురు సాధువులకు, సామాన్యులకు పాజిటివ్‌‌గా తేలిన నేపథ్యంలో దీని ప్రభావం ఇంకెంత ఉంటుందోననే భయాలు నెలకొన్నాయి. వీటిపై ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖాన్ స్పందించింది. కరోనా టైమ్‌‌లో లక్షల మంది కుంభమేళాకు తరలివెళ్లడం తనను షాక్‌‌కు గురి చేసిందని మలైకా తెలిపింది. 

‘కుంభమేళా ఫొటోలు, వీడియోలు చూసి ఆశ్చర్యానికి గురయ్యా. వీటిని చూసి బాధకు లోనయ్యా. కరోనా విజృంభిస్తున్న ఈ టైమ్‌లో చేసే పనులు, చర్యల విషయంలో అందరమూ జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే మొత్తం దేశం సమస్యను ఎదుర్కోవాల్సి రావొచ్చు. కుంభమేళా ఫొటోలను ప్రపంచ మీడియా కవర్ చేసింది. వీటిని చూసి వరల్డ్‌‌వైడ్‌గా ఎంతో మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళానే కాదు ఎన్నికల ప్రచార ర్యాలీల్లోనూ జనాలు ఒకేచోట గుమిగూడటాన్ని చూస్తున్నాం. ఇది నిజంగా అంత అవసరమా? ఇలాంటి వాటికి వెళ్లకుండానూ ఉండొచ్చు. ఈ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉంటూ సేఫ్‌గా ఉండటమే ముఖ్యం. అందరమూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే’ అని మలైక పేర్కొంది.