వరల్డ్ కప్ లో కీపర్ గా కేఎల్ రాహుల్ సరిపోతాడు

సీనియర్ క్రికెటర్ పార్థివ్ పటేల్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ వేదికగా గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత నుంచి సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. ధోని స్థానంలో కీపర్ అండ్ బ్యాట్స్ మన్ గా యంగ్ గన్ రిషభ్ పంత్ కు టీమ్ మేనేజ్ మెంట్ చాలా అవకాశాలు ఇచ్చింది. అయితే కొన్ని మెరుపు ఇన్నింగ్స్ లను పక్కనబెడితే వచ్చిన చాన్సెస్ ను సద్వినియోగం చేసుకోవడంలో పంత్ విఫలమయ్యాడు. కీపింగ్ లో పెద్దగా సత్తా చాటలేకపోయాడు. క్యాచ్ లను మిస్ చేయడం, స్టంప్స్ చేయడంలో తడబడటం లాంటివి అతడి అవకాశాలను దెబ్బతీశాయి. దీంతో బ్యాటింగ్ లో నిలకడగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ ను కోహ్లీ కీపర్ గా ప్రయోగించాడు. డొమెస్టిక్ తో పాటు ఐపీఎల్ లోనూ కీపింగ్ చేసిన అనుభవం ఉన్న రాహుల్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. బ్యాటింగ్ తో పాటు కీపింగ్ లోనూ సక్సెస్ అయ్యాడు. ఈ ఏడాది చివర్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్నందున రాహుల్, పంత్ ల్లో ఎవరు కీపర్ గా ప్లేస్ ను ఖాయం చేసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. దీనిపై సీనియర్ ఇండియా కీపర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ పార్థివ్ పటేల్ తన అభిప్రాయాలు షేర్ చేశాడు.

‘ఈ టైమ్ లో ఆలోచిస్తే వైట్ బాల్ క్రికెట్ లో కేఎల్ రాహుల్ కీపర్ గా సరిపోతాడనిపిస్తోంది. వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే రాహుల్ ను షార్ట్ టైమ్ ప్లాన్ లా చెప్పొచ్చు. ప్రపంచకప్ లో అతడు కచ్చితంగా తనకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. రిషభ్ పంత్ లోనూ చాలా టాలెంట్ ఉంది. 17–18 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు నాకూ మంచి సిరీస్ లు లేవు. దీంతో కొన్నేళ్లు డొమెస్టిక్ సీజన్ లో ఆడాను. అది నాకు చాలా హెల్ప్ అయింది. రిషభ్ ను కలిసిన ప్రతిసారి నేనో విషయం చెప్తా. నీలో టాలెంట్ ఉంది. అందుకే అందరూ నీ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ నీలో ప్రతిభ లేకుంటే ఎవ్వరూ నీ గురించి మాట్లాడరు. ఈ విషయాన్ని గుర్తుంచుకో అని చెప్తుంటా. కోల్పోయిన ఫామ్ ను డొమెస్టిక్ క్రికెట్ ఆడి తిరిగి పొందొచ్చు. ఇకపోతే, జస్ప్రీత్ బుమ్రా తొలిసారి ఐపీఎల్ ఆక్షన్ లోకి వచ్చినప్పుడు అతణ్ని తీసుకోవాల్సిందిగా కోహ్లీని కోరాను. కానీ మేం ప్రయత్నించినప్పటికీ ముంబై అతణ్ని ఎగరేసుకుపోయింది’ అని పార్థివ్ చెప్పాడు.

Latest Updates