సగం శాలరీ చార్జీలకే..సిటీ బస్సుల్లేక చిరుద్యోగుల అవస్థలు

లంగర్​హౌస్​లో ఉండే మహేశ్ పంజాగుట్టలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఎంప్లాయ్. నెలకు రూ.10వేల శాలరీ. బైక్ లేకపోవడంతో లాక్​డౌన్​కు ముందు వరకూ మంత్లీ పాస్ తీసుకుని సిటీ బస్సుల్లో డ్యూటీకి వెళ్లేవాడు.15 రోజుల కిందట ఆఫీస్ రీ ఓపెన్ అవడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేకపోవడంతో ఆటోలో వెళ్లి వచ్చేందుకు డైలీ 200 రూపాయలు అవుతున్నాయి. క్యాబ్​లో వెళ్లాలంటే ఇంతకంటే ఎక్కువే అవుతుంది. దాంతో మహేశ్ ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయటకొచ్చి ‘లిఫ్ట్ ప్లీజ్’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. కరోనా భయంతో చాలామంది బైక్ కూడా ఆపడం లేదని మహేశ్ వాపోతున్నాడు. వేల మంది చిరుద్యోగులు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్, వెలుగు:కరోనా ఎఫెక్ట్​తో సిటీలో పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్​కు బ్రేకులు పడ్డాయి. మెట్రో సర్వీసులు, ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ఓన్ వెహికల్ లేని చిరుద్యోగులు ఆఫీసుకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు, ట్యాక్సీల్లో వెళ్లాలంటే రూ.10వేల లోపు జీతం ఉన్నవాళ్లు సగానికిపైగా ట్రాన్స్ పోర్ట్ కే ఖర్చయిపోతుందని ఆవేదన చెందుతున్నారు. లాక్ డౌన్​తో 3 నెలలు జీతం లేక ఇబ్బంది పడ్డామని, ఇప్పుడేమో చార్జీలకే సగం శాలరీ అవుతోందని వాపోతున్నారు. కుటుంబం గడవాలంటే జాబ్ చేయక తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. కొందరు ఎంప్లాయీస్ ట్రాన్స్​పోర్ట్ ఖర్చు తగ్గించుకునేందుకు ఆఫీస్ టైమ్​కు రెండు, మూడు గంటల ముందే రోడ్డు మీదికి వచ్చి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంచెం దూరమైనా కాలినడక వెళ్లే పరిస్థితి ఉన్నవాళ్లు నడుస్తున్నారు. మరీ దూరంగా ఉంటే చార్జీలు భరించలేక ఉద్యోగం మానేస్తున్న వాళ్లూ ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ సర్వీసులు నడుస్తుండగా, జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండడంతో ఇప్పట్లో బస్సులు నడిపే పరిస్థితులు కనిపించడం లేదు.

షేర్ ఆటోలు లేని చోట..

లాక్​డౌన్ రిలాక్సేషన్స్​తో నెల రోజులుగా ఆటోలు, ట్యాక్సీలు తిరుగుతున్నాయి. క్యాబుల్లో ఆన్​లైన్​చూపిన చార్జీ మాత్రమే ఉండగా.. ఆటోల్లో ఇష్టమొచ్చినట్లు వసూలు చేస్తున్నట్టు చిరుద్యోగులు చెప్తున్నారు. మినిమమ్ చార్జీ రూ.20 తీసుకుంటున్నారని, మీటర్ వెయ్యడం లేదని వాపోతున్నారు. షేర్ ఆటోలు లేని ఏరియాల్లో నేరుగా మాట్లాడుకొని వెళ్లాల్సి వస్తోంది. అలాంటి చోట్ల ఆఫీసుకు వెళ్లి రావడానికి రూ.200 దాకా ఖర్చవుతున్నాయని పలువురు ఎంప్లాయీస్ తెలిపారు.

సేఫ్టీ ప్రికాషన్స్​తో బస్సులు నడపాలె

జిల్లా సర్వీసులు నడుపుతున్న మాదిరిగానే సిటీ బస్సులు నడపాలని ఎంప్లాయీస్ కోరుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ తక్కువ సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవాలంటున్నారు. లేకపోతే ట్రాన్స్​పోర్ట్ భారంతో తాము ఆర్థిక ఇబ్బందుల్లో పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Latest Updates