షాపులు నడుస్తలేవ్.. కిరాయిలు ఎల్తలేవ్!

  • షాపులు తెరిచినా రాని గిరాకీ.. పడిపోయిన వ్యాపారం
  •  తెరవకున్నా రెంట్​ చెల్లించాలని ఓనర్ల ఒత్తిడి
  • కరెంట్​ బిల్లులు, జీతాలూ చెల్లించలేని పరిస్థితి
  • హైదరాబాద్​లో 20 శాతం షాపుల మూత
  • బట్టలు, ఎలక్ట్రానిక్స్​ షాపులు, హాస్టళ్లు, హోటళ్లు, జిమ్స్​పై ఎక్కువ ఎఫెక్ట్​

హైదరాబాద్, వెలుగువ్యాపారులను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. లాక్​డౌన్​ పోయి అంతా అన్​లాక్​ అవుతున్నా గిరాకీల్లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రజలూ కరోనా భయంతో రోజూ అవసరమయ్యే సరుకులు తప్ప వేరే వాటి జోలికి పోకపోతుండడంతో బిజినెస్​లు డల్​ అయిపోయాయి. దీంతో ఉన్న షాపులకు కిరాయిలు కట్టలేక.. కరెంట్​ బిల్లులు చెల్లించలేక.. దాంట్లో పనిచేసేవాళ్లకు జీతాలివ్వలేక సతమతమవుతున్నారు. హాస్టళ్లు, బట్టలు, ఎలక్ట్రానిక్స్​, ఫర్నిచర్, జిమ్స్​, కోచింగ్​ సెంటర్ల బిజినెస్​ చాలా వరకు పడిపోయింది. ఒక్క హోటళ్లలోనే టేక్​అవే నడుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో వ్యాపారుల్లోనూ భయం నెలకొంది. దీంతో హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని కొన్ని సిటీల్లో కొందరు వ్యాపారులు సొంతంగా లాక్​డౌన్​ పెట్టేసుకున్నారు. షాపులు తెరిచినా గిరాకీ అంతంతే ఉండడం, మెయింటెనెన్స్​ ఖర్చులూ రాకపోవడంతో షాపులు తీసేందుకు వ్యాపారులు ముందుకు రావట్లేదు. ఇప్పటికే హైదరాబాద్​లో 20 శాతం షాపులు మూతపడినట్టు అంచనా. హైదరాబాద్​లోని అనేక ప్రాంతాల్లో చాలా వరకు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. లాక్​డౌన్​కు ముందు రోజూ రూ.5 వేల నుంచి రూ.-10 వేల వ్యాపారం జరిగేదని, ఇప్పుడు కరోనా భయంతో కస్టమర్లు రాక గిరాకీ రూ.వెయ్యి కూడా దాటడం లేదని ఎల్బీనగర్​కు చెందిన దినేశ్​ అనే ఓ బట్టల వ్యాపారి వాపోయారు. నెలనెలా రూ.10 వేలు కిరాయి కట్టలేక ఇద్దరు సేల్స్​బాయ్స్​ను తీసేశాని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 30 వేల బట్టల దుకాణాలున్నాయి. కస్టమర్లు రాక కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఆషాఢం ఆఫర్స్​లో భారీ డిస్కౌంట్​ పెట్టినా బిజినెస్​ జరగట్లేదు. పెండ్లిండ్ల సీజన్​లో రూ.5 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల బిజినెస్​ నడిచేదని, ఇప్పుడు రాష్ట్రం మొత్తంగా రూ.500 కోట్ల బిజినెస్​ కూడా జరగలేదని కమర్షియల్​ ట్యాక్స్​ ఆఫీసర్​ ఒకరు వెల్లడించారు. లాక్​డౌన్​ టైంలో షాపులు తీయక  బట్టలను ఎలుకలు కొరికేశాయడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.

హాస్టళ్లకు అద్దె కష్టాలు

హైదరాబాద్​తోపాటు వరంగల్​, కరీంనగర్​, ఖమ్మం, నిజామాబాద్​ లాంటి ప్రధాన నగరాల్లో స్టూడెంట్లు, ఉద్యోగులపై ఆధారపడి చాలా మంది ప్రైవేట్​ హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. ఒక్క హైదరాబాద్​లోనే సుమారు 10 వేలకుపైగా హాస్టళ్లు ఉంటాయని అంచనా. లాక్​డౌన్​తో అవన్నీ మూత పడిపోయాయి. మార్చి నుంచి ప్రారంభం కావాల్సిన సివిల్స్​ కోచింగ్​ బ్యాచ్​లకు స్టడీ రూమ్​లు, హాస్టళ్ల కోసం గాంధీ నగర్​లోని 50 మంది బిల్డింగ్​ ఓనర్లకు రూ.లక్ష చొప్పున రూ.50 లక్షల వరకు ఇచ్చి అగ్రిమెంట్​ చేసుకున్నారు కొందరు. కానీ, లాక్​డౌన్​తో అవేవీ తెరుచుకోక డబ్బు నష్టపోయినట్టు చిత్తూరుకు చెందిన సంజీవరెడ్డి అన్నారు. ఎవరూ లేకున్నా నిర్వాహకులకు మాత్రం కిరాయి బాధ తప్పట్లేదు. ఒక్కో హాస్టల్​కు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు కిరాయిలే చెల్లించాల్సి ఉంటుందని, మరో 2, 3 నెలలు ఇలాంటి పరిస్థితులే ఉంటే బెడ్లు, వంట సామాన్లతో సహా పూర్తిగా అమ్మేసుకుని వెళ్లాల్సి వస్తుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లదీ అదే పరిస్థితి. గతంలో రోజూ రూ. 10 వేల బిజినెస్​ నడిచే హోటళ్లలో ఇప్పుడు రూ. వెయ్యి కూడా మించట్లేదని సికింద్రాబాద్ కు చెందిన ఓ హోటల్​ ఓనర్​ సత్యం చెప్పారు.

రూ.10 వేల కోట్ల నష్టం

ఒక్క హైదరాబాద్​లోనే ట్రేడ్​ లైసెన్స్​ ఉన్న వ్యాపారులు సుమారు 2 లక్షల మంది దాకా ఉంటారు. అనధికారికంగా మరో లక్ష మంది వ్యాపారులు ఉంటారని అంచనా. కరోనా కాలంలో కిరాణా, నిత్యావసర సరుకుల వ్యాపారం తప్ప ఇతర వ్యాపారాలు నడిచింది అంతంతే. రాష్ట్రంలోని బట్టల షాపులు, ఎలక్ర్టానిక్స్​, ఫర్నిచర్​, హోటళ్లు, కర్రీ పాయింట్స్, హాస్టళ్లు, కోచింగ్​ సెంటర్లు. పెట్రోల్​బంకులు, జిమ్స్, జ్యుయెల్లరీ ఇలా రకరకాల వ్యాపారాలు కలిపి  రూ.10 వేల కోట్లకుపైగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

హోటల్​ ఉందని చెప్పేందుకే తీస్తున్నం

లాక్​డౌన్​కు ముందు మా హోటల్​ రోజుకు రూ.లక్షన్నరకుపైగా నడిచేది. ఇప్పుడు 20 నుంచి 30 శాతం ఆర్డర్స్​ కూడా రావట్లేదు. స్టాఫ్​కు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మొత్తం బంద్​ పెట్టలేక.. మా హోటల్​ ఉంది అని చెప్పేందుకే తెరిచి పెడుతున్నాం. ఓనర్స్​ కిరాయి తగ్గించట్లేదు.

– మెహిదీ పటేల్​,రెస్టారెంట్​ మేనేజర్​, ఆర్టీసీ క్రాస్​రోడ్స్​

కిరాయి కోసం ఒత్తిడి

మార్చి 20 నుంచి జిమ్​ బంద్​ ఉన్నది. ఏప్రిల్​ నుంచి ఇప్పటిదాకా రెంట్​ పెండింగ్​లో ఉంది. మా ఓనర్​ కిరాయి కోసం ఒత్తిడి చేస్తున్నడు. మూడున్నర నెలల నుంచి బంద్​ ఉందని, ప్రస్తుతం రెంట్​ కట్టలేనని చెప్పినా వినిపించుకోట్లేదు. తనకూ పేమెంట్లు ఉంటయి కదా అంటున్నడు. గవర్నమెంట్​ జిమ్​లకు ఎప్పుడూ పర్మిషన్​ ఇస్తదో తెలుస్తలేదు. ఐదు, పది వేలంటే రెంట్​ కట్టొచ్చు. నెలకు రూ.55 వేలు కట్టాలంటేనే ఏం చేయాలో అర్థం కావట్లేదు.

– విష్ణుకుమార్​, డేజ్​ ఫిట్​నెస్​ జోన్​, విద్యానగర్

కరోనాపై సర్కార్ కాడేత్తేసింది..

 

Latest Updates