యూనివర్సిటీలకు పైసలిచ్చి ప్రాణం పొయ్యండి

  •          గత ఏడాది చాలా తక్కువ నిధులు..జీతాలకూ చాలని పరిస్థితి
  •                 ఇతర కాలేజీలు, బ్రాంచుల నుంచి కొన్ని వర్సిటీల అప్పులు
  •                 ఈసారి రూ.1,164 కోట్లకు ప్రతిపాదనలు
  •                 గతంకంటే 10 నుంచి 15% మాత్రమే పెంచుతామంటున్న సర్కార్​!

రాష్ట్రంలోని యూనివర్సిటీలు నిధుల్లేక అల్లాడుతున్నాయి. బడ్జెట్​లో కేటాయించిన మేర సర్కారు నిధులు ఇవ్వట్లేదు. ఎంతో కొంత ఇచ్చేసి చేతులు దులుపుకుంటోంది. వచ్చిన నిధులు కూడా ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది జీతాలకే చాలక అధికారులు తల పట్టుకుంటున్నారు. వర్సిటీలకు నిధులు పెంచాలని, సక్రమంగా విడుదల చేయాలని సర్కారును కోరుతున్నారు. ఈమధ్య యూనివర్సిటీల అధికారులతో ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రూ.1,164.55 కోట్లు కావాల్సిందిగా 8 వర్సిటీల అధికారులు ప్రతిపాదించారు. అయితే గతేడాది ఇచ్చిన దాని కన్నా 10 నుంచి 15 శాతం మాత్రమే ఎక్కువ ఇవ్వాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది.

కేటాయింపుల్లో కోతలు

2018–19లో వర్సిటీలు రూ.వెయ్యి కోట్లు అడగ్గా.. కేవలం రూ.625.55 కోట్లు మాత్రమే బడ్జెట్​లో కేటాయించారు. అందులోనూ కోత పెట్టి రూ.546.51 కోట్లు మాత్రమే రిలీజ్​ చేసింది. అందులో ఎక్కువగా ఉస్మానియా యూనివర్సిటీకి రూ.369.54 కోట్లు ఇవ్వగా, కాకతీయ వర్సిటీకి రూ.112.41 కోట్లు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి రూ.39.51 కోట్లు ఇచ్చింది. మిగిలిన వాటికి నామమాత్రంగానే నిధులిచ్చారు. పాలమూరు యూనివర్సిటీకి బడ్జెట్​లో రూ.26.63 కోట్లు కేటాయించిన సర్కార్​.. కేవలం రూ.6.63 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ వర్సిటీకి రూ.43.77 కోట్లను శాంక్షన్​ చేసి రూ.26.77 కోట్లు, శాతవాహన వర్సిటీకి రూ.44.49 కోట్లు శాంక్షన్​ చేసి, రూ.19.45 కోట్లు, అంబేద్కర్​ ఓపెన్​ వర్సిటీకి రూ.30.45 కోట్లు మంజూరు చేసి.. రూ.10.45 కోట్లు మాత్రమే రిలీజ్‌‌‌‌ చేసింది. ఆ నిధులు ఎటూ సరిపోకపోవడంతో ఇతర కాలేజీలు, ఇతర బ్రాంచుల నుంచి కొన్ని వర్సిటీలు అప్పులు కూడా తీసుకున్నట్టు సమాచారం.

ఈసారైనా ఇస్తారా?

గతేడాది పరిస్థితుల నేపథ్యంలో 2019–20 సంవత్సరానికైనా ఎక్కువ నిధులు కేటాయించాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి. ఈ ఏడాదికి రూ.1,164.55 కోట్లు ఇవ్వాలని కోరాయి. గత ఏడాది సర్కారు ఇచ్చిన దానితో పోలిస్తే వర్సిటీలు ప్రతిపాదించిన మొత్తం రెండింతలు ఎక్కువ. ఓయూ రూ.599.99 కోట్లు, కాకతీయ రూ.246.99 కోట్లు, తెలంగాణ రూ.47.32 కోట్లు, మహాత్మాగాంధీ రూ.60 కోట్లు, శాతవాహన రూ.95.27 కోట్లు, పాలమూరు రూ.115 కోట్లు, అంబేద్కర్​ ఓపెన్​ యూనివర్సిటీ రూ.78.22 కోట్లు, పొట్టి శ్రీరాములు రూ.24.22 కోట్లు కావాలని ప్రతిపాదించాయి. ఒక్క తెలుగు యూనివర్సిటీ మినహా అన్ని వర్సిటీలూ గతేడాది కన్నా ఎక్కువ నిధులు అడిగాయి. కానీ ఈ ప్రతిపాదనలకు సర్కారు పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. 10 నుంచి 15 శాతం మాత్రమే పెంచుతామని సూచనప్రాయంగా చెప్పినట్టు సమాచారం.

అభివృద్ధికి దెబ్బ పడుతుంది

గతంలో ఇచ్చినట్టే ఈసారి కూడా నిధులిస్తే ఏమాత్రం సరిపోదని, వర్సిటీల్లో అభివృద్ధి కుంటపడుతుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని యూనివర్సిటీలకు కొత్త భవనాలు అవసరం. నిధుల్లేక ఆ పనులు ముందుకు సాగట్లేదు. సర్కారు ఈ సారి కూడా నిధులు తక్కువగా ఇస్తే రాష్ర్టంలోని యూనివర్సిటీల నిర్వహణ కష్టంగా మారే అవకాశముంది. వర్సిటీలు బతకాలంటే, వాటి పరిధిలో చదివే విద్యార్థుల మీద ఫీజుల భారం మోపే అవకాశముంది. అయితే ఇప్పటికే రాష్ర్టంలో ప్రైవేటు యూనివర్సిటీలకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో, నిధులు తగ్గించే అవకాశముందని విద్యావేత్తలు చెప్తున్నారు.

Latest Updates