లక్‌‌ అంటే లడఖ్‌‌దే..

శ్రీనగర్‌‌:  370 ఆర్టికల్‌‌ రద్దుతో జమ్మూకాశ్మీర్, లడఖ్.. రెండు యూనియన్ టెరిటరీలుగా మారాయి.  370 రద్దుపై కాశ్మీర్‌‌లో వ్యతిరేకత ఉన్నా  లడఖ్‌‌ వాసులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. యూటీ హోదాతో వారి జీవితాల్లో ఎట్టకేలకు కొత్త వెలుగులు సంతరించుకుంటున్నాయి. ఇక లడాయితో పని లేకుండా అభివృద్ధి వైపుగా దూసుకుపోనుంది లడఖ్. సింధు నదీ తీరాన ఉన్న అత్యంత అందమైన ప్రాంతం లడఖ్. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది నాణేనికి ఒకవైపు. పాకిస్తాన్, చైనా దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న అత్యంత వ్యూహాత్మకమైన ఏరియా. ఎప్పుడు, ఏ దేశం చొరబాటుకు ప్రయత్నిస్తుందో తెలియని పరిస్థితి. అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిపోయింది. లడఖ్​విషయంలో ‘మర్రి చెట్టు నీడలా’ మారింది జమ్మూకాశ్మీర్. ఆ రాష్ర్ట ప్రభుత్వం లడఖ్ ను  పెద్దగా గుర్తించలేదు. కాశ్మీర్ (విడదీయక ముందు) రాష్ర్టంలో 60 శాతం ప్రాంతం లడఖ్​లోనే ఉన్నా.. అందుకు సమానమైన నిధులు రాలేదు. రిమోట్ ఏరియా కావడం, తక్కువ జనాభా ఉండటంతో పట్టించుకోలేదు. కేంద్రంలోని ప్రభుత్వాలు కూడా కాశ్మీర్​విషయంలోనే ఎక్కువగా ఫోకస్ చేశాయి. కాశ్మీర్​వ్యాలీలో అభివృద్ధి గురించే ఆలోచించాయి. లడఖ్  సౌత్ ఆసియా, సెంట్రల్ ఆసియాతో టిబెట్​ను కనెక్ట్ చేసే ముఖ్యమైన ట్రేడ్ జంక్షన్. మెజారిటీ ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ట్రేడ్​మీద ఆధారపడి బతుకుతారు. రివర్ ఏరియాల్లో మాత్రమే వ్యవసాయం చేస్తారు.  లడఖ్​మీదుగానే కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లాలి. లేహ్​లో తొలి విమానం 1948 మే 24న ల్యాండ్ అయింది. సివిలియన్ విమానాలకు మాత్రం 1977 నుంచే అనుమతించారు.

శ్రీనగర్ ప్రభావం

జమ్మూకాశ్మీర్​బోర్డ్​కు చెందిన ప్రభుత్వ స్కూళ్లలో కాశ్మీర్​దృష్టి కోణంలోనే పాఠాలు చెప్పేవారు. పాఠాలు చెప్పే భాష కూడా లడఖ్ పిల్లలకు అర్థమయ్యేది కాదు. 1973లో అక్కడ తొలి ఇంగ్లిష్​మీడియం స్కూల్ ఏర్పాటైంది. తర్వాత చాలా ఏళ్లకు 1994లో కాలేజీ ఏర్పాటు చేశారు. 1995లో లడఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్​ఏర్పాటయ్యే వరకు.. అక్కడ హెల్త్, ఎడ్యుకేషన్ సౌకర్యాలు ఘోరంగా ఉండేవి. ఆర్టికల్ 370 వల్ల ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు బయటి వ్యక్తులు వచ్చేవారు కాదు. దీంతో కాశ్మీర్​లోయలోని షాపుయజమానులే ఇక్కడా షాపులు పెట్టేవారు.

కొత్త ఆశలు..

యూనియన్ టెరిటరీ కావడంతో  ఇక్కడ కొత్త ఆఫీసులు, కొత్త రాజధాని ఏర్పాటు కావాల్సి ఉంది. దీంతో ఇక్కడ భారీ స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. లేహ్, కార్గిల్ ఏరియాల్లో అర్బన్  సెంటర్లు ఏర్పాటు కావాల్సి ఉంది. కొత్త జాబులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు వస్తాయి. టూరిజం సెక్టార్​ఊపందుకుంటుంది. ఎత్తులో ఉండటంతో సోలార్ పవర్, విండ్ ఎనర్జీలో కూడా భారీగా పెట్టుబడులు వస్తాయి. ఫార్మాస్యూటికల్, ఫుడ్ ప్రాసెసింగ్, హైడ్రో పవర్ ఇండస్ట్రీలు కూడా తరలివచ్చే అవకాశం ఉంది. కూల్, డస్ట్ ఫ్రీ ఎన్విరాన్​మెంట్ ఉండటంతో టెక్నాలజీ ఇండస్ట్రీ కూడా వృద్ధి చెందనుంది.

యుద్ధ సమయాల్లో ఆర్మీకి అండగా..

1948 లో ట్రైబల్ రైడర్ల పేరుతో పాకిస్తాన్ సోల్జర్లు మారువేషాల్లో లడఖ్​లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. 17 ఏళ్ల చెవాంగ్ రించెన్  నాయకత్వంలోని  ప్రజలు లోపలికి రాకుండా వారిని అడ్డుకున్నారు. సోనమ్ నోర్బు అనే ఇంజనీర్ ఎలాంటి ఎక్వీప్​మెంట్​లేకున్నా, స్థానికుల సాయంతోనే చాలా తక్కువ సమయంలో అక్కడ ఓ ఎయిర్​ఫీల్డ్​ఏర్పాటు చేశారు. అది ఎయిర్​బేస్​గా మారింది. ఇండియన్ ఆర్మీ అక్కడికి చేరుకుని, పాక్ సైనికులను తరిమికొట్టింది. శ్రీనగర్–లేహ్ ను కనెక్ట్ చేసే దారిని శత్రువులు ఆక్రమించుకోకుండా చేయగలిగింది.

  • 1971లో మేజర్ చెవాంగ్ రించెన్ (17 ఏళ్ల వయసులో పాక్ సైనికులను అడ్డుకున్న ఆ యువకుడే తర్వాత ఆర్మీ మేజర్​అయ్యాడు) ఆధ్వర్యంలోని లడఖ్ స్కౌట్లు.. బల్టిస్తాన్​లోని 800 చదరపు కిలోమీటర్ల భూమిని పాకిస్తాన్ చెర నుంచి విడిపించారు.
  • 1962లో జరిగిన ఇండియా–చైనా యుద్ధంలో, 1965లో ఇండియా–పాకిస్తాన్ యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధంలో.. ఇలా ప్రతి సారి ఇండియా బలగాలకు లడఖ్​ప్రజలు అడుగడుగునా అండగా నిలిచారు.
  •  ‘సియాచిన్ గ్లేసియర్’​పై ఇండియా తన పట్టు నిలుపుకునేందుకు ఎంతో సాయపడ్డారు. ఆ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పాక్ సోల్జర్లు ప్రయత్నించిన ప్రతిసారి వారిని అడ్డుకునేందుకు మన ఫోర్సెస్​కు సహకారాలు అందించారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates