తండ్రి అంత్యక్రియలు ఆపించి.. పరేడ్ నడిపించిన మహిళా ఇన్ స్పెక్టర్

దేశభక్తిని చాటుకున్న తమిళనాడు మహిళా ఇన్ స్పెక్టర్

తండ్రి మరణించాడని తెలిసినా.. పరేడ్ డ్యూటీ చేసిన మహేశ్వరి

తిరునల్వేలి: తమిళనాడు మహిళా ఇన్ స్పెక్టర్ దేశభక్తిని చాటుకుంది. తండ్రి మరణించాడని తెలిసినా, ఇండిపెండెన్స్ డే పరేడ్ లో పాల్గొంది . డ్యూటీ పూర్తయినంకనే తండ్రి అంత్యక్రియలకు హాజరైంది. కుటుం బసభ్యులకు చెప్పి, అప్పటి వరకు అంత్యక్రియలను ఆపించింది. ఎన్.మహేశ్వరి ఆర్ముడు రిజర్వు ఇన్ స్పెక్టర్. శనివారం తిరునల్వేలి జిల్లాలో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పరేడ్ కు ఆమె నాయకత్వం వహించింది. అయితే ఇండిపెండెన్స్ డే తెల్లారి అనగా, శుక్రవారం రాత్రి తండ్రి మరణించాడనే వార్త మహేశ్వరికి తెలిసింది. అయినప్పటికీ ఆమె వెంటనే వెళ్లలేదు. ఈ టైమ్ లో తాను వెళ్లిపోతే, ఇంత తక్కువ సమయంలో మరొకరు పరేడ్ బాధ్యతలు చూసుకోవడం కష్టమని డ్యూటీకే ప్రాధాన్యమిచ్చింది . తండ్రి చనిపోయిన బాధను దిగమింగి, శనివారం ఉదయం ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొని.. పరేడ్ ను ముందుండి నడిపించింది. పరేడ్ అయిపోయిన వెంటనే 200 కిలోమీటర్ల దూరంలోని దిండిగల్ జిల్లాకు వెళ్లి తండ్రి నారాయణసామి అంత్యక్రియల్లో పాల్గొంది . ఈ విషయంలో పోలీసాఫీసర్లు మహేశ్వరిని ప్రశంసించారు. ఆమెను చూస్తే గర్వంగా ఉందన్నారు. పర్సనల్ సెంటిమెంట్  పక్కనపెట్టి, ఆమె ఎంతో ప్రొఫెషనల్ గా పరేడ్ ను నిర్వహించారని కొనియాడారు.

Latest Updates