లక్షల కుటుంబాలకు అందని ఆరోగ్య శ్రీ

లక్షల కుటుంబాలకు అందని ఆరోగ్య శ్రీ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో దాదాపు 3 లక్షల పేద కుటుంబాలకు రేషన్ కార్డు ఉన్నప్పటికీ, ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ ట్రీట్మెంట్ అందడం లేదు. సివిల్ సప్లయ్స్ డిపార్ట్ మెంట్ తమ దగ్గరున్న రేషన్ కార్డుల వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అందజేయకపోవడంతో పేదలు ఫ్రీ ట్రీట్మెంట్ కు దూరమవుతున్నారు. సివిల్ సప్లయ్స్ డిపార్ట్​మెంట్ ​లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 90.49 లక్షల రేషన్​ కార్డులు ఉండగా, ఆరోగ్యశ్రీ ట్రస్టులో 87.60 లక్షలే నమోదైనట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. సివిల్ సప్లయ్స్ శాఖ 2014లో రేషన్ కార్డుల డేటాను ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అందజేయగా, ఆ తర్వాత ఒక్కసారి మాత్రమే అప్ డేట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 

ట్రీట్మెంట్ కోసం అప్పులు... 
ఆరోగ్యశ్రీ కార్డులు లేకపోవడంతో అర్హులైన పేదలు కొంతమంది అప్పులు చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మరికొందరు కార్డుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకుంటలేరు. ఎమర్జెన్సీ టైమ్ లో స్పెషల్‌‌ పర్మిషన్‌‌‌‌తో కొందరికి ట్రీట్మెంట్ అందుతున్నా, ఆ ప్రాసెస్‌‌కు చాలా టైమ్ పడుతోంది. అసలు చాలామందికి ఆ విషయం కూడా తెలియకపోవడంతో డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. పేదలు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు ట్రీట్మెంట్ కోసం వెళ్లినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు లేకుంటే రేషన్ కార్డు ద్వారానూ ట్రీట్మెంట్ పొందొచ్చు. సిబ్బంది ఆ కార్డు నెంబర్ ఆధారంగా ఆరోగ్యశ్రీ అప్రూవల్ కోసం పంపిస్తారు. అయితే ఆ రేషన్ కార్డు.. ఆరోగ్యశ్రీ ట్రస్టు లిస్టులో ఉంటేనే ఇది వీలవుతుంది. లేదంటే బాధితులు ఎమ్మార్వో నుంచి లెటర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎమర్జెన్సీ టైమ్ లో ఇదంతా చేయడం కుదరక, అప్పులు చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నామని బాధితులు వాపోతున్నారు.  

5 లక్షలకు పెరిగిన కవరేజీ... 
ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.2 లక్షల కవరేజీ లభిస్తుంది. అయితే కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ను ఆరోగ్యశ్రీలో విలీనం చేస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. దీంతో కవరేజీ రూ.5 లక్షలకు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 412 ఆస్పత్రుల్లో 1,672 రకాల సేవలు అందుబాటులో వచ్చాయి. వీటిలో 246 ప్రైవేట్ హాస్పిటళ్లు ఉన్నాయి

84 వేలు ఖర్చు పెట్టుకున్నం: మాకు రేషన్ కార్డ్ ఉన్నా, ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వలేదు. కొన్ని నెలల కింద యాక్సిడెంట్ లో నా చెయ్యి విరిగింది. హైదరాబాద్ సూరారంలోని నారాయణ హాస్పిటల్ లో ఆపరేషన్ కోసం రూ.84 వేలు ఖర్చయ్యింది. ఆరోగ్యశ్రీ కార్డ్ ఉంటే, ఫ్రీగా ట్రీట్మెంట్ అయ్యేది. ‑ శ్యామ్ సుందర్, ఉసిరికపల్లి, మెదక్ జిల్లా

అప్లికేషన్లు పెట్టుకున్నా ఇయ్యలే.. 
మాకు తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ, ఆరోగ్యశ్రీ కార్డు లేదు. గతంలో చాలాసార్లు ఎమ్మార్వోకు అప్లికేషన్ పెట్టుకున్న. కానీ ఇప్పటి వరకు ఇయ్యలేదు. ఇటీవల మా తమ్ముడి ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్​కు పోతే, ఆరోగ్యశ్రీ లేక మస్తు తిప్పలైంది. తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ మూడ్రోజులు తిరిగినా పని కాలేదు. ‑ మల్లేశం, పాపన్నపేట, మెదక్ జిల్లా 

9 ఏండ్లయినా రాలే.. 
నాకు 2012లో కొత్త రేషన్‍ కార్డు వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వలేదు. చాలాసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. కార్డు లేకుంటే ఎమర్జెన్సీ టైమ్ లో ఎమ్మార్వో దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెబుతున్నరు. కానీ అన్ని సమయాల్లో ఎమ్మార్వో అందుబాటులో ఉండరు కదా? ‑ ఎస్కే అఖిల్, ఖానాపూర్