గూగుల్​ లింక్​తో లక్షలు దోచిన్రు

జార్ఖండ్​ సైబర్​ ముఠాను అరెస్ట్​ చేసిన హైదరాబాద్​ పోలీసులు
ప్రధాన నిందితుడు పరార్​.. అదుపులో ఐదుగురు
హైదరాబాద్​ డాక్టర్​ ఖాతా నుంచి ₹5 లక్షలు కొట్టేసిన ముఠా
ఆమె ఫిర్యాదుతో జార్ఖండ్​లో 20 రోజులపాటు పోలీసుల మకాం

హైదరాబాద్​, వెలుగు: గూగుల్​తో ఏం చేయొచ్చు?… ఏదైనా చేయొచ్చు. ఏమైనా తెలుసుకోవచ్చు. నాలెడ్జ్​ పెంచుకోవచ్చు. కానీ, జార్ఖండ్​కు చెందిన ఓ గ్యాంగ్​ మాత్రం జనాల డబ్బులను కొట్టేసేందుకు ‘గూగుల్​’ను వాడుకుంది. గూగుల్​ పేరిట ‘ఫిషింగ్​(ఎర వేయడం లాంటిది)’ లింకులు పంపి అందిన కాడికి డబ్బులు కాజేసింది. పోలీసులకు దొరికిపోయింది. ఆరుగురు సభ్యుల ముఠాలోని ఐదుగురిని జార్ఖండ్​లో హైదరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆ వివరాలను డీసీపీ క్రైమ్స్​ ప్రియదర్శిని, సైబర్​క్రైమ్​ ఏసీపీ సీహెచ్​వై శ్రీనివాస్​కుమార్​లతో కలిసి సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ వెల్లడించారు. బ్యాంక్​ అకౌంట్​ బ్లాక్​ అయిందన్న పేరుతో అన్ని వివరాలనూ తెలుసుకుని డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. నిందితుల దగ్గర్నుంచి రూ.2.66 లక్షలు, బంగారు గొలుసు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

డాక్టర్​ ఫిర్యాదుతో

అక్టోబర్​ 21న హైదరాబాద్​లోని ఓ డాక్టర్​కు QP–SBINBS పేరిట ఓ మెసేజ్​ వచ్చింది. ఆమె ఆ మెసేజ్​ ఓపెన్​ చేసింది. ‘‘డియర్​ కస్టమర్​.. మీ సేవింగ్స్​ అకౌంట్​, డెబిట్​ కార్డు సర్వీసు బ్లాక్​ అయింది. మార్చి నెల బ్యాంక్​ స్టేట్​మెంట్​, కేవైసీ వెరిఫికేషన్​ ముంబై ఆర్బీఐకి సబ్​మిట్​ చేయలేదు. అకౌంట్​ తిరిగి పనిచేయాలంటే లింక్​ను క్లిక్​ చేయండి. బ్యాంక్​ అకౌంట్​ నంబర్​, కేవైసీతో పాటు పూర్తి వివరాలు పంపండి” అంటూ ఆ మెసేజ్​లో ఉంది. దీంతో ఆమె ఆ లింక్​ను క్లిక్​ చేసింది. అన్ని నంబర్లతో పాటు డెబిట్​కార్డ్​ పిన్​, పాస్​వర్డ్​లనూ పంపింది. అంతే, ఆ తర్వాతి రోజు ఆమె అకౌంట్​ నుంచి వివిధ ఈ–వాలెట్​లకు ₹5.29 లక్షలు ట్రాన్స్​ఫర్​ అయ్యాయి. మోసపోయానని గుర్తించిన ఆమె సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన ఏసీపీ శ్రీనివాస్​ ఆధ్వర్యంలోని సైబర్​ క్రైమ్​టీమ్, ఈ–వాలెట్​ నంబర్ల ఆధారంగా జార్ఖండ్​లోని జాంతార్​కు చెందిన సైబర్​ దొంగల ముఠా పనిగా గుర్తించింది. కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్​కుమార్​ మండల్​ అలియాస్​ బబ్లూ గ్యాంగ్​, దోచేసిన సొమ్ముతో ప్రముఖ నగల దుకాణాలు, ఇతర షాపింగ్​మాల్స్​ నుంచి ఈ–వోచర్లు కొన్నారని సైబర్​క్రైమ్​ పోలీసులు గుర్తించారు. ఆ వోచర్లతో వివిధ రాష్ట్రాల్లో బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్​ వస్తువులు, ఏసీలు కొనుగోలు చేసినట్టు తేల్చారు. డాక్టర్​ నుంచి కొట్టేసిన డబ్బుతో అక్టోబర్​ 22, 23 తేదీల్లో జార్ఖండ్​లోని ధన్బాద్​, బొకిరోలోని తనిష్క్​ జువెలర్స్​లో నగలు కొన్నట్టు పోలీసులు గుర్తించారు. 20 రోజుల పాటు జాంతార్​లో మకాం వేసి ఆ గ్యాంగ్​ సభ్యులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

చదివింది ఏడే..

ఈ గ్యాంగ్​లోని సభ్యులంతా జార్ఖండ్​లోని నారాయణపూర్​, జాంతార్​, కర్మటర్​ పోలీస్​స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందినోళ్లు. అక్కడ చదువుకున్నోళ్లు చాలా తక్కువ. ఇందులో ఏడు నుంచి పది వరకు చదివినోళ్లే ఆన్​లైన్​ మోసాల బాట పడుతున్నారు. ఓటీపీ, ఫిషింగ్​ కాల్స్​తో  కొల్లగొడుతున్నారు. అయితే, వాటి వల్ల పోలీసులకు వెంటనే దొరికిపోతుండడంతో 2016 నుంచి రూట్​ మార్చారు. ఈ–వాలెట్​ రూటుతో గూగుల్​ లింకులు పంపి డబ్బు దోచేయడానికి ప్లాన్​ వేశారు. అందుకు కొన్ని కుటుంబాలు గ్యాంగ్​గా ఏర్పడ్డాయి. జాంతార్​కు చెందిన సంజయ్​ కుమార్​ మండల్ మరో ఐదుగురితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఇందులో కర్మటర్​ కు చెందిన రామ్​ కుమార్​ మండల్​తో పాటు ధర్మాపూర్​కు చెందిన జమ్రూద్దీన్ అన్సారీ, చుగ్లోకు చెందిన బిరేంద్ర కుమార్​ మండల్​, బీహార్​ కరుణ్​భాగ్​కు చెందిన రోహిత్​రాజ్​లున్నారు. ఇందులో జమ్రుద్దీన్​ అన్సారీ బ్యాంక్​ అకౌంట్లను సేకరించేవాడు. అతడు మోస్ట్​ వాంటెడ్​ క్రిమినల్​ లిస్టులో ఉన్నాడు. ఆ డేటా ఆధారంగా నకిలీ లింకులను తయారు చేసి జనాన్ని ట్రాప్​లో పడేసేవాడు సంజయ్​. కాగా, సైబర్​ నేరాల్లో సంజయ్​ గ్యాంగ్​ నైజీరియన్లను మించిపోయిందని, సరిగ్గా ఇళ్లు కూడా లేని ఆ గ్యాంగ్​ ఇప్పుడు విలాసవంతమైన బంగళాల్లో ఉంటోందని సైబర్​ క్రైమ్​ ఏసీపీ సీహెచ్​వై శ్రీనివాస్​కుమార్​ తెలిపారు. పోలీసులు పట్టుకున్నా డబ్బు దొరక్కుండా ఉండేందుకు భూములు, ఇళ్లు కొనేస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates