90 ఏళ్ల నాటి లక్ష్మణ్​ జులా వంతెన క్లోజ్

డెహ్రడూన్: రిషికేష్​వెళ్లే పర్యాటకులకు అదో ప్రత్యేక ఆకర్షణ.. కొంతమంది ప్రత్యేకంగా దానిని చూడడానికే వెళ్తారనడంలో సందేహంలేదు. అదే తెహ్రీ జిల్లా తపోవన్​గ్రామంలో గంగానదిపై కట్టిన ‘లక్ష్మణ్​జూలా’ వంతెన. తొంభై ఏళ్ల క్రితం.. బ్రిటిష్​పాలన కాలంలో ఈ వేలాడే వంతెనను నిర్మించారు. రామాయణంలో లక్ష్మణుడు గంగానదిని దాటిన చోట కట్టడంతో ఈ వంతెనను లక్ష్మణ్​జులా అని పిలుస్తారు. స్థానికులకు ఉపయోగపడుతూ, టూరిస్టులను ఆకర్షిస్తూ గ్రామానికే ప్రత్యేకంగా నిలిచిన ఈ వంతెన ఇకపై మూతపడనుంది. తొంభై ఏళ్లలో తొలిసారిగా అధికారులు శుక్రవారం దీనిని మూసేశారు. రాకపోకలను నిషేధించారు.

ఇన్ని రోజులు రిపేర్లతో నెట్టుకొచ్చిన ఈ బ్రిడ్జి ఇకపై ఎంతమాత్రమూ ఉపయోగకరం కాదని దీనిని పరిశీలించిన ఎక్స్​పర్ట్​కమిటీ తేల్చింది. వెంటనే బ్రిడ్జిని మూసేయాలంటూ ప్రభుత్వానికి సూచించింది. ఈ బ్రిడ్జి రిపేర్ల స్థాయిని దాటిపోయిందని, ఇంకా కొనసాగిస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం ఈ వంతెనను తాత్కాలికంగా మూసేసింది. శాశ్వతంగా మూసేసే ప్రతిపాదనపై చర్చ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. దీనికి బదులుగా దగ్గర్లోనే కట్టిన రామ్​జూలా ను ఉపయోగించుకోవాలని సూచించింది.

Latest Updates