వర్మ వాస్తవాలే చూపించారు: V6తో ఫోన్ లైన్ లో లక్ష్మీపార్వతి

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ సినీ, రాజకీయ పరిశ్రమల్లో సంచలనం రేపుతోంది. దీనిపై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి వీ6 న్యూస్ తో ఫోన్ లైన్ లో మాట్లాడారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే చూద్దాం.

లక్ష్మీపార్వతి గారూ.. మీరు కేంద్రంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రాబోతోంది… రామ్ గోపాల్ వర్మ మిమ్మల్ని సంప్రదించారా..  ఆయనకు మీరేం విషయాలు చెప్పారు?

నేను RGVకి చెప్పింది తక్కువ. పిక్చర్ అంతా ముందే ఆయన ప్రిపేర్ చేసుకుని నన్ను కలిశారు. తిరుపతిలో కలిశాం. తర్వాత రెండుమూడు సార్లు కలిశాం. నేను చెప్పేది చెప్పినప్పటికీ.. ఆయన తీసుకున్న మెటీరియలే ఎక్కువ ఉంది. ఎక్కువగా ఎన్టీఆర్ దగ్గర పనిచేసినవాళ్లు.. ఇంట్లో వర్క్ చేసినవాళ్లు.. పోలీస్ ఆఫీసర్స్.. వీళ్లందరి స్టేట్ మెంట్స్ ఆయన తీసుకున్నారు. అనేక పేపర్ కటింగ్స్.. ఆ రోజుల్లో పేపర్లో వచ్చిన న్యూస్.. ఎన్టీఆర్ స్టేట్ మెంట్స్.. ఎన్టీఆర్ , అల్లుడితో గొడవలు.. ఎన్టీఆర్ ధర్మపీఠంలో చెప్పిన వెర్షన్ ను బేస్ చేసుకుని కథ తయారుచేశానని వర్మ చెప్పారు.

మీరు మొత్తం ట్రైలర్ చూశారా..

ఆ చూశాను… చూసినవరకు వాస్తవం.. చిన్న అతిశయోక్తి కూడా లేదు.. చిన్న అబద్ధం లేదు.. బయటకివాళ్లకు ఏం తెలుసు ఈ విషయాలు. ఎవరు ఆ సంఘటనలో ఉన్నారో వాళ్లకే తెలుస్తుంది. ఆ విషయంలో.. బయటివాళ్లు మాట్లాడుకునేవన్నీ అబద్దాలు అవుతాయి.. చాలా వాస్తవికంగా ఉంది ట్రైలర్. మూవీ కూడా నిజాయితీగా .. ఎన్టీఆర్ కు న్యాయం జరిగే పద్ధతిలో తీస్తున్నారని నాకు అనిపించింది.

ఎన్టీఆర్ మీ మీద చేయి చేసుకున్నట్టు ఓ సీన్ చూపించారు.. నిజంగా ఆయనకెప్పుడైనా మీ మీద అంత కోపం వచ్చిందా.. చేయి చేసుకుంటే ఏ పరిస్థితుల్లో అలా జరిగింది.

చేయి చేసుకున్నది నిజమే. ఎందుకో మాత్రం చెప్పను. దానిని డైరెక్టర్ సస్పెన్స్ లో పెట్టినప్పుడు నేను ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. అందువల్ల అది మూవీలోనే చూస్తే బాగుంటుంది. వర్మ వాస్తవమే చూపించారు.

ఈ మధ్యలో వచ్చిన ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్ లకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందంటారా…మీకలా అనిపిస్తోందా…

ఔను. బయోపిక్ అంటేనే జీవిత చరిత్ర. యాత్ర సినిమాలో అతిశయోక్తి లేదు. కథానాయకుడు సినిమాలో ఆయన కెరీర్ గురించి తీశారు. దానిపై ఏం అభ్యంతరాలు లేవు. మహానాయకుడులో ఏం చూపిస్తారన్నది చూడాలి. చంద్రబాబు మొదట ఈ పార్టీలో లేరు. కాంగ్రెస్ లో ఉన్నారు. మొదట్లో టీడీపీ మీద అనేక రకాలైన విమర్శలు చేశారు. ఎన్టీఆర్ గెలవడు.. ఓడించేస్తారు అని ప్రగల్బాలు పలికారు. ఇవి చూపిస్తేనే బయోపిక్ అవుతుంది. బాలకృష్ణ ఎలా తీస్తున్నాడన్నది నాకు తెలియదు.

ఎన్నికలకు ముందు రాబోతోంది కదా.. పొలిటికల్ గా ఎలాంటి ప్రభావం ఉండబోతోంది?

అది ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సినిమాతో జనం మారతారు.. మారకుండా ఉంటారన్నది మనం ఏమీ చెప్పలేం. కానీ నిజాలు చూపించాలన్న తపనతోనే ఆర్జీవీ ఈ సినిమా తీస్తున్నారు. సినిమాపై ప్రజల్లో విపరీతమైన సంచలనం ఉంది. గంటలోనే పదిలక్షల మంది చూశారంటే.. రెస్పాన్స్ ఎలా ఉందో అర్థమవుతుంది.

రాజకీయ ఉద్దేశంతో ఈ సినిమా తీశారన్న ఆరోపణలపై ఏమంటారు?

బయోపిక్ అంటేనే జీవిత చరిత్ర. ఇంకా పొలిటికల్ ఇంటెన్షన్ ఏముంటుంది. ఎన్నికల కోసం తీశారని మేం కానీ.. ఆర్జీవీ కానీ చెప్పలేదు. ఆర్జీవీకి ఏ పార్టీతో అయినా సంబంధం ఉందా.. లేదనే అనుకుంటున్నాను.

Latest Updates