లక్ష్మీస్ NTR : రివ్యూ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’​ రివ్యూ

నటీనటులు: విజయ్ కుమార్, యజ్ఞ శెట్టి, శ్రీతేజ్ తదితరులు
సంగీతం: కళ్యాణి మాలిక్
రచన : రామ్ గోపాల్ వర్మ , నరేంద్ర చారి
సినిమాటోగ్రఫీ : రామీ
నిర్మాతలు: రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు

ఒకప్పుడు శివ, సర్కార్ లాంటి సంచలన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. కానీ గత కొంతకాలంగా ప్రేక్షకులను ఆయన తీవ్రంగా నిరాశ పరచాడు. దీంతో వర్మ సినిమాలను ప్రేక్షకులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అలా కాదు. ఒకప్పటి ముఖ్యమంత్రి జీవితంలోని కీలక ఘట్టమే ఈ సినిమా కథ కావడం మరో ముఖ్యమంత్రిని నెగటివ్ రోల్ లో చూపించడం సినిమాపై ఆసక్తి రేపింది. తెలంగాణ హైకోర్టు కేసు కొట్టేస్తే.. ఏపీ హైకోర్టు విడుదలపై స్టే ఇవ్వడం. ఇంతలా ఆపడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇందులో ఏదో ఉందని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో అంచనాలూ పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకోగలిగిందా..?
కథగా…
1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ (విజయ్ కుమార్) ఓడిపోయిన తర్వాత ఒంటరితనం అనుభవిస్తున్న రోజులవి. ఆయన జీవిత కథ రాస్తానంటూ లక్ష్మీ పార్వతి (యజ్ఞ శెట్టి) వస్తుంది. ఆమె వ్యక్తితం, తనపై అభిమానం, జీవితంపై ఆమెకున్న లోతైన అవగాహన నచ్చి ఎన్టీఆర్ అందుకు అంగీకరిస్తారు. పుస్తకం రాసే క్రమంలో మానసికంగా ఆయనకు దగ్గరవుతుంది. తనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో ఆ విషయం చెపుతాడు. సి.బి.నాయుడు (శ్రీతేజ్​)తో సహా కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయినాసరే ఆమెను పెళ్లాడబోతున్న విషయం పబ్లిక్ గా ప్రకటిస్తాడు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఎన్టీఆర్ అఖండ విజయం సాధిస్తాడు. లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాడని భావించిన సి.బి.నాయుడు.. తన అనుకూల పత్రికల ద్వారా పార్టీలో, ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి పెత్తనం ఎక్కువైందనే వార్తలు రాయిస్తాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి దించుతాడు కూడా. ఇందుకు సి.బి.నాయుడు అవలంభించిన వ్యూహాలేంటి, ఎన్టీఆర్ కు ఎలా వెన్నుపోటు పొడిచాడు, ఎన్టీఆర్ మరణానికి దారితీసిన పరిస్థితులు ఏమిటనేది మిగతా కథ.
ఎవరెలా…
ఎన్టీఆర్ గా పి.విజయ్ కుమార్ పాత్రోచితంగా నటించాడు. గెటప్ ఎలా ఉన్నా వ్యక్తిగత జీవితంలో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ను, హావభావాలను పలికించిన విధానం ఆకట్టుకుంది. . విశ్వ చెప్పిన డబ్బింగ్ కూడా ఇందుకు ప్లస్ అయింది. కొన్ని చోట్ల ఎన్టీఆర్ పాత్ర డ్రామాలా అనిపించినా ఒకప్పటి ఎన్టీఆర్ వీడియోలు చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞశెట్టిని తప్ప మరొకరిని ఊహించలేం. అంతలా జీవించేసింది. సి.బి నాయుడు పాత్రకు శ్రీతేజ్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ఆహార్యం, కంటిచూపుతో ముమ్మూర్తులా బాబును గుర్తుచేశాడు శ్రీతేజ్. ఈ మూడు పాత్రలే సినిమాలో ప్రధానమైనవి. మిగిలిన వాళ్లంతా పాత్రల పరిదిమేరకు నటించారు. పాటలతో పాటు నేపథ్య సంగీతంతో మెప్పించాడు కళ్యాణ్ కోడూరి. వర్మతో కలసి నరేంద్ర చారి అందించిన డైలాగ్స్ సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. వర్మ మార్క్ కెమెరా యాంగిల్స్ తో సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మాణ విలువలు కూడా సోసోగానే ఉన్నాయి.
సమీక్ష…
ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య పరిచయం, వారిద్దరి పెళ్లికి దారితీసిన పరిస్థితులు మాత్రమే హైలెట్ చేయడంతో కథనం నెమ్మదించింది. సెకండాఫ్ మొత్తం రాజకీయాల చుట్టూ తిరగడం, ముఖ్యంగా బాబు కుట్ర రాజకీయాలను చూపడంతో కథనం ఆసక్తికరంగా మారింది. బాబు పాత్రలో ఓ ఇంటెన్సిటీ క్రియేట్ చేయడంలో వర్మ టేకింగ్, శ్రీతేజ్ యాక్టింగ్, కళ్యాణ్ కోడూరి నేపథ్య సంగీతం కీలకపాత్ర పోషించాయి. ఈ సినిమాలో చంద్రబాబు పాత్ర ఎలా ఉండబోతుందని ప్రేక్షకులు భావించారో.. అలాగే చూపించడంతో ప్రేక్షకులను అంచనాలను ఈ సినిమా అందుకున్నట్టైంది. అయితే చంద్రబాబును అభిమానించే వారికి నచ్చనిది కూడా ఇదే. ఇక ఎన్టీఆర్ జీవితంలో కీలకమైన వైస్రాయ్ ఎపిసోడ్ సినిమాకు మేజర్ హైలెట్. ఆ తర్వాత కథ కొంత నెమ్మదించి ఎన్టీఆర్ మరణంతో సినిమా ముగుస్తుంది. స్లో నరేషన్ ఈ సినిమాకు కొంత మైనస్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఇద్దరి నడుమే ఎక్కువ కథ నడవడం, కుటుంబ సభ్యులతో వచ్చే సీన్స్ టీవీ సీరియల్స్ తరహాలో ఉండటం ఇబ్బంది పెడుతుంది. అదే సమయంలో లక్ష్మీపార్వతి అమాయకురాలు అనేలా సీన్స్ డిజైన్ చేయడంతో వర్మ ఏకపక్షంగా తీశాడనిపిస్తుంది. అయితే ఈ సినిమాకు ప్రధాన బలం కథ. ఎన్టీఆర్ జీవితంలోని కీలక మలుపులు, ఉత్కంఠ రేపే అంశాలు ఈ కథలోనే ఉండటం సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. ప్రజలకు తెలిసి తెలియనట్టుగా తెలిసిన కథను, తాను నమ్మింది నమ్మినట్టుగా వర్మ ధైర్యంగాతీయడం కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని మెప్పించగలిగింది. అయితే చంద్రబాబు మద్దతుదారులకు ఎలాగూ నచ్చదని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మొత్తానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్​’ అనే టైటిల్ కు పూర్తి న్యాయం చేశాడు రామ్ గోపాల్ వర్మ.

Latest Updates