లక్ష బతుకులు ఆగమైనయ్..

విద్యాశాఖలో గెస్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది కష్టాలు

స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే 90 వేల మందికి కొలువు కోత

మార్చి నుంచి జీతాలు బంద్..

కొందరికి జనవరి నుంచి లేవు

అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్న పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: ‘‘ప్రైవేటు సెక్టార్లో ఒక్కరిని కూడా ఉద్యోగంలో నుంచి తీసెయ్యొద్దు. అందరికీ జీతాలివ్వాలి’’.. రాష్ట్రంలో కరోనా ఎంటరైన కొత్తలో సర్కారు ఇచ్చిన ఆర్డర్స్ ఇవి. కానీ తానిచ్చిన ఆదేశాలను తానే పాటించలేదు. ప్రభుత్వ పరిధిలో పనిచేసే వారిని పట్టించుకోలేదు. దీంతో విద్యా శాఖలో పని చేసే గెస్ట్ టీచర్లు, లెక్చరర్లు, విద్యా వాలంటీర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, కార్మికులు కలిపి లక్ష మందికిపైగా రోడ్డునపడ్డారు. వీరికి ఐదారు నెలలుగా జీతాల్లేవు. భవిష్యత్లో కొలువులు ఉంటాయనే భరోసా లేదు. ఇటు కరోనా, అటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర సర్కారే తమను ఆదుకోవాలని, జాబ్స్ రెన్యూవల్ చేయాలని, వేతన బకాయిలు చెల్లించాలని వేడుకుంటున్నారు.

రాష్ర్టంలో కరోనా తీవ్రతతో మార్చి16 నుంచి విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా స్కూళ్లు, కాలేజీలు నడవడం లేదు. హాస్టళ్లు మూతపడ్డాయి. దీంతో వాటిలో పని చేసే ఔట్ సోర్సింగ్, హవర్లీ బేస్డ్, గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు పోయాయి. మోడల్ స్కూల్ హాస్టల్స్లో పని చేసే హెడ్ కుక్, ఏఎన్ఎం, కేర్ టేకర్ తదితర కొలువులు బంద్ అయ్యాయి. ఏండ్ల నుంచి స్కూళ్లలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను రెన్యూవల్ చేయలేదు. ఇలా మొత్తం లక్ష మందికిపైగా ఉద్యోగులు కొలువులకు కోత పడింది. కొలువులు పోయిన వారిలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే 90 వేల మందికిపైగా ఎంప్లాయీస్ ఉండట్లేదు.

విద్యా వాలంటీర్లను తీసుకోలే

రాష్ర్టంలోని సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల స్థానంలో విద్యా వాలంటీర్లు పని చేస్తున్నారు. ప్రస్తుతం 12 వేల మంది వరకు వాలంటీర్లు ఉన్నారు. ప్రభుత్వం వీరికి నెలకు రూ.12 వేల చొప్పున వేతనం ఇస్తోంది. మార్చి నుంచి వీరికి జీతాలు ఇవ్వలేదు. ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైనా వారిని  రెన్యూవల్ చేయలేదు. చాలా జిల్లాల్లో జనవరి నుంచి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. మరోపక్క సర్కారు బడుల్లో 2,500 మంది దాకా పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు ఉన్నారు. వీరికి నెలకు రూ.9 వేలు వచ్చేవి. స్కూళ్ల మూతతో జీతం రాలేదు.

మిడ్ డే మీల్స్ కార్మికుల కష్టాలు

స్టేట్లో 28,620 సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లలో మిడ్ డే మీల్స్ స్కీమ్ అమలవుతోంది. స్కూళ్లలో పిల్లలకు వండి పెట్టేందుకు 55 వేల మంది వర్కర్స్ పని చేస్తున్నారు. కూరగాయలు, పప్పులు, ఇతర సామగ్రిని వారే ముందు అప్పులు చేసి కొనాలి. తర్వాత సర్కారు బిల్లులు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఏండ్ల నుంచి పని చేస్తున్నా.. వారికి నెలకు కేవలం రూ.వెయ్యి మాత్రమే గౌరవ వేతనం. ప్రస్తుతం బడులన్నీ మూతపడటంతో మార్చి నుంచి పని లేకుండా పోయింది. దీంతో అప్పులు చేసి, కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.

గెస్ట్, హవర్లీ టీచర్లు, లెక్చరర్ల తిప్పలు

జూనియర్ కాలేజీల్లో 1,300 మంది, డిగ్రీ కాలేజీల్లో 1,900 మంది, మోడల్ స్కూళ్లలో 1,100 మంది, సొసైటీ గురుకులాల్లో 500 మంది గెస్ట్, హవర్లీ బేస్డ్ టీచర్లు, లెక్చరర్లు పని చేస్తున్నారు.  చెప్పిన క్లాసులను బట్టి నెలకు రూ.18 వేల నుంచి రూ.21 వేల జీతం అందుతోంది. ఇప్పుడు డిజిటల్ తరగతులు ప్రారంభమైనా వీరిని మాత్రం డ్యూటీలోకి తీసుకోలేదు. బయట వెళ్లలేక, ఖాళీగా ఉండలేక ఇబ్బంది పడుతున్నారు.

స్వచ్ఛ కార్మికుల వెట్టిచాకిరీ

రాష్ట్రంలోని 25,131 సర్కారు స్కూళ్లలో 28,200 మంది స్వచ్ఛ కార్మికులు (స్కావెంజర్లు) పని చేస్తున్నారు. 40 మంది లోపు స్టూడెంట్లు ఉంటే రూ.2 వేలు, ఆపైన స్టూడెంట్లు ఉన్న స్కూళ్లలో రూ.2,500 చొప్పున వీరికి వేతనం ఇస్తున్నారు. సర్కారు బడిలో కొలువు కాబట్టి జీతం పెరుగుతుందని పని చేస్తున్నారు. వీరికీ మార్చి నుంచి జీతాల్లేవు. తాజాగా వీరందరినీ కాదని బడులను క్లీన్ చేసే బాధ్యతను పంచాయతీ వర్కర్లకు సర్కారు అప్పగించింది. దీంతో తమను కొనసాగిస్తారా లేదా అనే ఆందోళనలో వారంతా ఉన్నారు. ప్రస్తుతం కూలీ పనులకు వెళ్తున్నారు.

మోడల్ స్కూల్స్‌‌లో ఇట్ల..

రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ ఉంటే 170 బడుల్లో అమ్మాయిలకు హాస్టల్స్ ఉన్నాయి. వాటిలో హెడ్ కుక్, ఏఎన్ఎం, వాచ్ ఉమెన్, కేర్ టేకర్, అసిస్టెంట్ కుక్స్ పని చేస్తుంటారు. హాస్టల్స్ బంద్ కావడంతో వారికి పని లేకుండా పోయింది. వీరి జీతాలు పది వేల లోపే. అది కూడా ఇప్పుడు రాకపోవడంతో వారంతా అవస్థలు పడుతున్నారు. వాచ్ ఉమెన్స్ హాస్టళ్ల వద్దే ఉంటున్నా జీతాలు రావట్లేదు.  కరోనా కారణంగా 492 ఐఈఆర్సీ సెంటర్లు మూతపడటంతో, వాటిలో పనిచేసే సుమారు 800 మంది ఆయాలు, ఫిజియోథెరపిస్టులకు పని లేకుండా పోయింది.

పై ఫొటోలో ఉన్న వ్యక్తి పెద్దపల్లి తిరుపతి. భూపాలపల్లి జూనియర్ కాలేజీలో ఆరేండ్లుగా గెస్ట్ లెక్చరర్ గా పని చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల మార్చి నుంచి కాలేజీలు బందయ్యాయి. అప్పటి నుంచి జీతాలు రాలేదు. ఇప్పటికీ వారిని రెన్యూవల్ చేయలేదు. దీంతో కుటుంబాన్ని సాకేందుకు ఆయన రోజువారి కూలీ పనులకు పోతున్నారు. ఇంటర్ లో అందరినీ రెన్యువల్ చేసినట్టే తమనూ చేసి లాక్‌డౌన్‌ కాలానికీ జీతంఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

ఈమె మిడ్ డే మీల్స్ కార్మికురాలు జయమ్మ. నిజామాబాద్ జిల్లా శాటాపూర్ యూపీఎస్ స్కూల్లో 15 ఏండ్ల నుంచి పని చేస్తోంది. గతంలో బీడీలు చేసేది. ఎక్కువగా స్కూల్లోనే ఉండటంతో బీడీల కార్డు తీసేశారు. వితంతు పింఛన్ కూడా ఆగిపోయింది.  జీతం పెరగకపోతుందా అని రూ.వెయ్యితోనే జీవనం సాగిస్తోంది.  ఫిబ్రవరి, మార్చి జీతం రాలేదు.  చేతిలో పైసలు లేక అప్పులు చేసి కుటుంబాన్ని నడుపుతోంది. ప్రస్తుతం బీడీలు చేస్తున్నది.

వాలంటీర్లను రెన్యువల్ చేయాలె
మార్చి నుంచి మాకు జీతాలు లేవు. కొన్ని జిల్లాల్లో జనవరి నుంచీ పెండింగ్ లో ఉన్నాయి. ఈనెల 17 నుంచి టీచర్లు బడులకు రావాలని ప్రభుత్వం సూచించింది. మేం కూడా బడుల్లోకి వచ్చేలా రెన్యువల్ ఆర్డర్స్ ఇవ్వాలి. నిన్నటి దాకా బడులకు పోయిన టీచర్లంతా, ప్రస్తు తం కూలీపనులకు పోతున్నారు. -శివానందస్వామి, వీవీల వ్యవస్థాపక అధ్యక్షుడు.

అప్పులు చేసి బతుకుతున్నం
మోడల్ స్కూళ్లలో అవర్లీ బెస్డ్ టీచర్లను రెన్యూవల్ చేయలేదు. కొన్ని స్కూళ్లలో ఏప్రిల్ లో సగం రోజుల జీతం ఇచ్చారు. గత నెల 27 నుంచి స్కూళ్లకు టీచర్లు పోతున్నారు. కానీ మేం రావాలని ఆర్డర్స్ ఇవ్వలేదు. 3, 4 నెలల నుంచి జీతాల్లేక ఇబ్బంది పడుతున్నాం. చాలా మంది కూలి పనులకు పోతున్నారు. అప్పలు చేసి కుటుంబాలను కాపాడుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే రెన్యూవల్ చేయాలి.
-బొమ్మన ప్రశాంత్, మోడల్ స్కూల్స్ అవర్లీ బెస్డ్ టీచర్స్ అసోసియేషన్ లీడర్.

Latest Updates