లాలూకు కరోనా థ్రెట్ ఉంది పెరోల్ ఇవ్వండి

పాట్నా : ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు కరోనా థ్రెట్ ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమస్య తీరే వరకు లాలూకు పెరోల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ఆనారోగ్యం కారణంగా రెండేళ్లుగా జార్ఘండ్ లోని రాంచీలోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయనకు ట్రీట్ మెంట్ ఇస్తున్న డాక్టర్ ఉమేష్ ప్రసాద్ ఇటీవల కరోనా సోకిన ఓ పేషెంట్ కు కూడా ట్రీట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఆ హాస్పిటల్ లోని డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. లాలూ కు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ క్వారంటైన్ లోకి వెళ్లటంతో ఆర్జేడీ సహా లాలూ కుమారుడు తేజస్వియాదవ్ ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వృద్ధాప్యంలో ఉన్న లాలూ కు కరోనా సోకే ప్రమాదం ఉందని భయం వ్యక్తం చేశారు. వెంటనే లాలూ ప్రసాద్ యాదవ్ కు పెరోల్ ఇవ్వాలంటూ ఆర్జేడీ పార్టీ ట్విట్టర్ లో కోరింది. కరోనా కారణంగా 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడిన వారిని పెరోల్ పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లాలూ కూడా పెరోల్ ఇవ్వాలని ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. అటు జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా లాలూ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Latest Updates