బీహార్ బిడ్డని..గుర్గావ్ కోడల్ని: లాలూ కూతురు ప్రచారం

గుర్గావ్: లాలూ ప్రసాద్ యాదవ్. రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారుండరు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్. ప్రస్తుతం ఎన్నికలకు దూరంగా ఉన్నా.. తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. ఈయన కుటుంబంలో భార్య, కొడుకులు, పెద్ద కూతురు రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు చిన్న కూతురు అనుష్కా రావ్ కూడా పాలిటిక్స్ లోకి దిగారు. అయితే లాలూ కూతురిగా కాకుండా గుర్గావ్ కోడలిగా ప్రచారం చేస్తున్నారు.

మైగ్రెంట్ వర్కర్లే లక్ష్యం

లాలూ, రబ్రీ దంపతుల ఆరో కూతురు అనుష్కా రావ్. హర్యానా కాంగ్రెస్ మాజీ మంత్రి అజయ్ యాదవ్ కొడుకు చిరంజీవ్ రావ్​ను పెళ్లి చేసుకున్నారు. అజయ్ యాదవ్ గుర్గావ్ లోక్​సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మామ తరఫున అనుష్క ప్రచారం చేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్​నుంచి వలస వచ్చిన వారిని కలుస్తున్నారు. ఇప్పటికే 7–8 గ్రామాల్లో పర్యటించి, దాదాపు లక్ష మందితో మాట్లాడారు. ఎంప్లాయ్​మెంట్, ఇళ్లు తదితర అంశాలపై హామీ ఇచ్చారు. ‘‘బీహార్ నా పుట్టినిల్లు. గుర్గావ్ మా మామగారిల్లు. మీ ఓటు మాకు వేయమని గుర్గావ్ కోడలిగా అడుగుతున్నాను” అని మైగ్రెంట్ వర్కర్లను ఉద్దేశిస్తూ ప్రచారం చేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్​కు చెందిన వర్కర్ల వల్లే గుర్గావ్ క్లీన్ సిటీగా అభివృద్ధి చెందిందని చెబుతున్నారు. ‘‘బీహార్, హర్యానా మధ్య గట్టి బంధం ఉంది. హర్యానా ఎకానమీ, అర్బనైజేషన్ విషయంలో బీహార్ ప్రజలు ఎంతో సాయం చేశారు. ఇక్కడి మైగ్రెంట్ ప్రజల కోసం ఒక కొత్త పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉంది” అని వివరిస్తున్నారు. హర్యానా ప్రజల కోసం తన మామ ఎంతో కమిట్​మెంట్​తో పని చేస్తున్నారని
అంటున్నారు.

ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు

పూర్వాంచల్ రీజియన్​పైనే అనుష్క ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు ఎక్కువ ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. వలస ప్రజలు ఇక్కడ ప్లంబర్లు, కార్పెంటర్లు, పెయింటర్లు, కన్​స్ట్రక్షన్ సైట్ లేబరర్లుగా పని చేస్తున్నారు.

Latest Updates