భూడ్రామాలో మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్.. అసలు ఏం జరిగింది..

ఐటీ దాడుల నాటకంతో కిడ్నాప్

కొద్ది గంటల్లోనే రిలీజ్.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్

ఆమె భర్త భార్గవరామ్, ఏవీ సుబ్బారెడ్డిపైనా కేసు

బాధితులు, నిందితులు.. అంతా పలుకుబడి ఉన్నవాళ్లే

హఫీజ్​పేటలోని 25 ఎకరాల భూముల వివాదమే కారణం

హైదరాబాద్‌‌, వెలుగు: మాజీ బ్యాడ్మింటన్‌‌ ప్లేయర్‌‌ ప్రవీణ్ రావు (51)ను, ఆయన అన్నదమ్ముల  కిడ్నాప్​ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను హైదరాబాద్​లోఅరెస్టు చేశారు. కొందరు ఐటీ ఆఫీసర్లమంటూ ఇంట్లో చొరబడి.. సెర్చింగ్​ పేరుతో ఇంట్లోని ల్యాండ్​ డాక్యుమెంట్లు, ల్యాప్​టాప్​లు తీసేసుకున్నారు. విచారించాల్సి ఉందంటూ తీసుకెళ్లి కిడ్నాప్​ చేశారు. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఈ కిడ్నాప్​ చేయించారని ప్రవీణ్​ఫ్యామిలీ మెంబర్లు చెప్తున్నారు. హఫీజ్​పేటలోని 25 ఎకరాల భూముల ఇష్యూనే దీనికి కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో బాధితులు, నిందితులు అంతా హైప్రొఫైల్​ వ్యక్తులే కావడం సంచలనంగా మారింది. పోలీసులు అఖిలప్రియను అరెస్ట్‌‌ చేశారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్, కర్నూల్​ జిల్లాకు చెందిన ఏవీ సుబ్బారెడ్డి, గుంటూరుకు చెందిన శ్రీనివాస్ చౌదరి, కర్నూల్‌‌ కు చెందిన సాయి, చంటి, ప్రకాశ్‌‌, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఘటన వివరాలను హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ అంజనీ కుమార్​ వెల్లడించారు.

ఐటీ ఆఫీసర్లమంటూ వచ్చి..

ప్రవీణ్​రావు ఆయన సోదరులు సునీల్‌‌‌‌రావు(49), నవీన్‌‌‌‌రావు (47), ప్రతాప్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ లతో కలిసి‌‌‌‌ బోయినపల్లి మనోవికాస్‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌లోని కృష్ణా రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఐటీ ఆఫీసర్లమంటూ 15 మంది ప్రవీణ్‌‌‌‌రావు ఇంట్లోకి దూసుకువచ్చారు. అందులో ఒకరు పోలీస్‌‌‌‌ యూనిఫాంలో ఉన్నారు. ఫేక్ ఐడీ కార్డులను, ప్రవీణ్‌‌‌‌, సునీల్‌‌‌‌, నవీన్‌‌‌‌ల ఇండ్లలో సెర్చ్​ వారెంట్​ అంటూ ఫేక్​ పేపర్లను చూపించారు. ఇంట్లో ఉన్న అందరిదగ్గర ఫోన్లు లాక్కున్నారు. ప్రవీణ్‌‌‌‌, సునీల్‌‌‌‌, నవీన్‌‌‌‌లను హాల్​లో కూర్చోబెట్టి.. మిగతా వారందరినీ బెడ్రూంలో పెట్టి లాక్​ చేశారు. సెర్చింగ్​ పేరుతో ఇంట్లోని ల్యాండ్‌‌‌‌ డాక్యుమెంట్లు,ల్యాప్‌‌‌‌ టాప్స్‌‌‌‌ తీసుకున్నారు. అయితే రాత్రి 8.20 గంటల టైంలో సునీల్ భార్య సరిత ప్రవీణ్‌‌‌‌రావు‌‌‌‌ ఇంటికి వచ్చింది. బయటి డోర్​కు లాక్​ ఎందుకు వేశారని, అంతా ఎవరని నిలదీసింది. దీంతో ఐటీ ఆఫీసర్లమంటూ వచ్చిన వాళ్లు.. విచారించాలంటూ ప్రవీణ్, సునీల్, నవీన్​లను తీసుకుని మూడు కార్లలో పారిపోయారు. అక్కడే ఉన్న ప్రతాప్​కుమార్​ దీనిపై లోకల్​ పోలీసులకు, ఐటీ డిపార్ట్​మెంట్​కు ఇన్ఫర్మేషన్​ ఇచ్చారు.

మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌, ఎంపీ కవిత వచ్చి..

కిడ్నాప్​ విషయం తెలుసుకున్న పోలీస్​ కమిషనర్​ అంజనీకుమార్, మంత్రి శ్రీనివాస్​గౌడ్, ఎంపీ కవిత.. ప్రవీణ్​రావు ఇంటికి వచ్చారు. అప్పటికే ఐటీ దాడులేమీ జరగలేదన్న ఇన్ఫర్మేషన్​ రావడంతో.. ప్రవీణ్‌‌‌‌, నవీన్‌‌‌‌, సునీల్‌‌‌‌ను కిడ్నాప్‌‌‌‌ చేసినట్టు గుర్తించారు. ప్రతాప్‌‌‌‌ కొడుకు మనీష్‌‌‌‌ దీనిపై కంప్లైంట్‌‌‌‌ చేశారు. ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌‌‌‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, వారి అనుచరులే ఈ కిడ్నాప్​ చేయించారని చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. సెర్చింగ్​ మొదలుపెట్టారు.

15 టీమ్స్‌‌‌‌ తో సెర్చింగ్..

సీపీ అంజనీకుమార్‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణలో 15 స్పెషల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ ఏర్పాటు చేసి కిడ్నాపర్ల కోసం సెర్చింగ్​ మొదలుపెట్టారు. హైదరాబాద్​ చుట్టూ ఉన్న పోలీస్​స్టేషన్లతోపాటు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌‌‌‌ను, కర్నూల్‌‌‌‌ పోలీసులను అలర్ట్ చేశారు. సిటీ నుంచి బయటికి వెళ్లే రోడ్లలో చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, సెల్‌‌‌‌ ఫోన్‌‌‌‌ సిగ్నల్స్‌‌‌‌ ఆధారంగా వెతికారు. అయితే కిడ్నాపర్లు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల టైంలో ప్రవీణ్‌‌‌‌, నవీన్‌‌‌‌, సునీల్‌‌‌‌లను నార్సింగి కోకాపేట ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు.

అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి అరెస్టు

కిడ్నాప్​ కేసులో ప్రధాన నిందితులైన అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పొద్దున 11 గంటల టైంలో కూకట్‌‌‌‌పల్లిలోని లోధా అపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో అఖిలప్రియను అదుపులోకి తీసుకుని.. బేగంపేట మహిళా పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఆమె స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకున్నారు. తర్వాత మెడికల్​ టెస్టుల కోసం గాంధీ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. అయితే ప్రస్తుత అఖిలప్రియ ప్రెగ్నెంట్‌‌‌‌గా ఉన్నట్టు తెలిసింది. దాంతో ఆమెకు గైనకాలజీ విభాగంలో పరీక్షలు చేయించినట్టు సమాచారం. టెస్టుల తర్వాత అఖిలప్రియను హాస్పిటల్‌‌‌‌ నుంచి షిఫ్ట్‌‌‌‌ చేసే టైంలో గాంధీ హాస్పిటల్లో 20 నిమిషాల పాటు కరెంట్‌‌‌‌ కట్‌‌‌‌ చేసినట్లు తెలిసింది. దీనిపై రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాపై తప్పుడు కేసులు పెట్టారు: ఏవీ సుబ్బారెడ్డి

ప్రవీణ్‌‌‌‌రావు కిడ్నాప్‌‌‌‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను కావాలనే కేసులో ఇరికించారని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. అఖిలప్రియ తనపై మర్డర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌ చేసిందని ఆరోపించారు. ఈ విషయంగా తాను గతంలోనే కడప ఎస్పీకి కంప్లైంట్‌‌‌‌ చేశానన్నారు. ప్రవీణ్‌‌‌‌రావుతో కొన్ని విభేదాలు ఉన్నది నిజమేనని చెప్పారు. కిడ్నాప్‌‌‌‌ కేసులో అఖిలప్రియతోపాటు ముందుగానే తనను కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని, ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. మీడియాతో సుబ్బారెడ్డి మాట్లాడిన తర్వాత ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

భూముల గొడవతోనే కిడ్నాప్

హఫీజ్‌‌‌‌పేటలో 25 ఎకరాల ల్యాండ్‌‌‌‌ను గతంలో ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ కొన్నారు. ఆ ల్యాండ్‌‌‌‌ ఇష్యూలో భూమా నాగిరెడ్డి ఫ్యామిలీకి ప్రవీణ్‌‌‌‌రావు ఫ్యామిలీకి మధ్య వివాదం నెలకొంది. దీంతో నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి మీడియేటర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించి.. సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌ చేశాడు. నాగిరెడ్డి చనిపోయాక ఈ ల్యాండ్‌‌‌‌లో తమకు వాటా రావాల్సి ఉందంటూ భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌ను కలిశారు. అయితే ఏవీ సుబ్బారెడ్డితో ఇష్యూ సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌ అయిందని, వెళ్లి ఆయన్నే కలవాలని ప్రవీణ్‌‌‌‌ చెప్పాడు. అయినా ప్రవీణ్‌‌‌‌రావును అఖిలప్రియ, మరికొందరు బెదిరిస్తూ వచ్చారు. దీనిపై గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ఏవీ సుబ్బారెడ్డి, మరికొందరిపై ప్రవీణ్‌‌‌‌రావు ఫిర్యాదు చేశాడు. తర్వాత కూడా ప్రవీణ్‌‌‌‌రావు ఫ్యామిలీని అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌‌‌‌ బెదిరించారు. ఇప్పుడు సుబ్బారెడ్డితో కలిసి ప్రవీణ్‌‌‌‌రావు కిడ్నాప్‌‌‌‌ కు ప్లాన్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏవీ  సుబ్బారావు అని గుర్తించాం.

– అంజనీకుమార్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్​ పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌

చంచల్​గూడ జైలుకు అఖిల

మెడికల్​ టెస్టుల తర్వాత పోలీసులు అఖిలప్రియను కోర్టులో హాజరుపర్చారు. జడ్జి ఆమెకు 14 రోజులు రిమాండ్​ విధించడంతో.. చంచల్​గూడ జైలుకు తరలించారు.

For More News..

లీకుల భగీరథ.. క్వాలిటీ లేక పగులుతున్న పైపులు

రాష్ట్రమంతా నేడు వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ డ్రై రన్‌‌‌‌‌‌‌‌

రెండు షిఫ్టుల్లో ఇంటర్ కాలేజీలు! కొంతమందికి ఉదయం.. మరికొంతమందికి మధ్యాహ్నం..

Latest Updates