భూములు పాయె.. జాబ్స్​ రాకపాయె

ఓసీపీలు, ఎస్టీపీపీలో మెజారిటీ జాబ్స్ నాన్ లోకల్స్ కే..

ఇతర రాష్ట్రాల నుంచి లేబర్ ను తెచ్చుకుంటున్న కాంట్రాక్టర్లు
అమలు కాని ఆఫీసర్ల హామీలు

మంచిర్యాల, వెలుగు: ఓసీపీలు, పవర్ ప్లాంట్​ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తాయని, ఇక బతుకులు బాగుపడతాయని ఆశపడ్డ భూనిర్వాసితులు, ప్రభావిత గ్రామాల ప్రజలకు నిరాశే మిగిలింది. పచ్చని పంటలు పండే వేలాది ఎకరాల భూములు, ఇళ్లు వాకిళ్లను సింగరేణికి అప్పగిస్తే ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఆఫీసర్లు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, కల్యాణిఖని, ఇందారం ఓపెన్​కాస్ట్​ప్రాజెక్ట్(​ఓసీపీ)లతో పాటు జైపూర్​లో సింగరేణి థర్మల్​పవర్ ప్లాంట్​(ఎస్టీపీపీ)లను ఏర్పాటు చేశారు. వీటికోసం పదేండ్ల క్రితం సుమారు ఆరువేల ఎకరాల భూములను సేకరించారు. ఓసీపీలు, పవర్​ప్లాంట్​ ఏర్పాటుతో ఊళ్లు బొందలగడ్డలుగా మారతాయని, వాతావరణ కాలుష్యం పెరిగి పంటల సాగు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని ప్రజలంతా వ్యతిరేకించారు. తరతరాల నుంచి జీవనాధారమైన భూములను కోల్పోయి ఎట్లా బతకాలని ఎదురుతిరిగారు. దీంతో సింగరేణి ఆఫీసర్లు భూములు కోల్పోతున్న కుటుంబాలతో పాటు ప్రభావిత గ్రామాల్లోని యువతకు ఓసీపీలు, ఎస్టీపీపీలో కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్​ జాబ్స్​ కల్పిస్తామని హామీలిచ్చారు. ఉద్యోగాలు వస్తే పిల్లల బతుకులు బాగుపడుతాయని భావించిన ప్రజలు విలువైన భూములను సింగరేణికి అప్పగించారు. 2011లో ఎస్టీపీసీ నిర్మాణం ప్రారంభించారు. 2016 డిసెంబర్​లో ఉత్పత్తి స్టార్ట్​ చేశారు.

రూలింగ్​ పార్టీ లీడర్ల పైరవీలు

జాబ్స్​కోసం ల్యాండ్​లూజర్స్, లోకల్స్​ సంబంధిత ప్రాజెక్టు ఆఫీసులో అప్లికేషన్​ పెట్టుకుంటే ఎడ్యుకేషన్​ క్వాలిఫికేషన్స్, ఎక్స్​పీరియన్స్​ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయాలి. కానీ సింగరేణి ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో చాలామందిని కాంట్రాక్టర్లే నేరుగా నియమించుకుంటున్నారు. అప్లికేషన్లు పెట్టుకున్నవారు నెలలు, సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు లోకల్ రూలింగ్​ పార్టీ లీడర్ల జోక్యం ఎక్కువైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభావిత గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ లీడర్లు ఒక్కొక్కరి దగ్గర రూ. 50 వేల వరకు వసూలు చేసి ఉద్యోగాలు పెట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి రెండు నెలల క్రితం సింగరేణి ఆఫీసర్లు, కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులతో మీటింగ్ పెట్టి తమ సిఫార్సు లేకుండా ఎవరినీ నియమించుకోవద్దని పేర్కొన్నారు. లీడర్ల మాట వినకుంటే ప్రజలను, వర్కర్లను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తారని ఆఫీసర్లు అంటున్నారు. ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇస్తామన్న హామీలు తప్ప జీవోలు లేకపోవడంతో ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు, లీడర్లు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా మారింది.

ఆందోళనలు చేసినా స్పందన లేదు

ఓసీపీలు, ఎస్టీపీపీలో ఉద్యోగాలు ఇవ్వాలని స్థానికులు పలుసార్లు ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇందారం ఓసీపీ భూ నిర్వాసితుల కుటుంబాలకు, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఇటీవల ఓబీ కాంట్రాక్టర్ కంపెనీ క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. సింగరేణి మేనేజ్​మెంట్​ఓసీపీ ఏర్పాటు కోసం అనేక హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఓసీపీలో స్థానికులకు 80 శాతం జాబ్స్​ ఇస్తామని చెప్పి 70 శాతం స్థానికేతరులకు ఇస్తున్నారని నిరసన తెలిపారు. శ్రీరాంపూర్ సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సై రామకృష్ణ వచ్చి ఓసీపీలో పనిచేస్తున్న నాన్​లోకల్స్ ను తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే కల్యాణిఖని ఓసీపీ భూనిర్వాసితులు, ప్రభావిత గ్రామాల ప్రజలు బుధవారం ఓబీ పనులను అడ్డుకున్నారు. పీవో పద్మనాభరెడ్డి వచ్చి నాలుగు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని, 70 శాతం జాబ్స్​ లోకల్స్​కే కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన
విరమించారు.

ఖాళీలుంటే తీసుకుంటున్నం

ల్యాండ్​ లూజర్స్​ ఫ్యామిలీస్​ నుంచి వచ్చిన అందరికీ జాబ్స్​ ఇస్తున్నం. ఖాళీలను బట్టి తీసుకుంటున్నం. ఇందారం, టేకుమట్ల గ్రామాల నుంచే 200 మందికిపైగా జాబ్స్​ ఇచ్చినం. కచ్చితంగా 80 శాతం జాబ్స్​లోకల్స్​కు ఇవ్వాలనే జీవోలు లేవు. కాంట్రాక్టర్​ అవసరాన్ని బట్టి లేబర్ నియామకాలు చేసుకుంటున్నరు. క్వాలిఫికేషన్​ ఉన్నవారికి తప్పకుండా అవకాశాలొస్తయి. పైరవీలకు తావు లేదు.– రాజేశ్వర్​రెడ్డి, పీవో, ఇందారం ఓసీపీ

బీటెక్​ చేసినా జాబ్​ లేదంటున్రు

ఇందారం ఓసీపీలో మాది ఎకరంన్నర భూమి పోయింది. నా కొడుకు వంశీకృష్ణ బీటెక్(మైనింగ్​) చేసిండు. జాబ్​ కోసం అప్లికేషన్​ పెట్టుకున్నా ఇస్తలేరు. సింగరేణి జీఎంను, పీవోను కలిస్తే సూటబుల్​ జాబ్స్​లేవంటున్రు. లారీ డ్రైవర్​ లేదా హెల్పర్​గా చేయమంటున్రు. కానీ కాంట్రాక్టర్​ వేరే రాష్ట్రాల నుంచి స్కిల్డ్​ లేబర్​ను తెచ్చుకుంటుండు. భూమి పోయినా కొడుకుకు ఉద్యోగం వస్తుందనుకున్నా. క్వాలిఫికేషన్​ ఉన్నా నిరాశే మిగిలింది. -ముదాం రమేష్​, ల్యాండ్​లూజర్, రామారావుపేట

నార్త్​ నుంచి నాన్​ లోకల్స్.. 

ఓసీపీలు, ఎస్టీపీపీలో కాంట్రాక్టర్లు నార్త్​కు చెందినవారు కావడంతో వారి రాష్ట్రాల నుంచే లేబర్​ను తెచ్చుకుంటున్నారు. సింగరేణికి ఇచ్చిన హామీ మేరకు 30 శాతం జాబ్స్​ లోకల్స్​కు ఇస్తున్నారు. స్కిల్డ్​ లేబర్​గా నార్త్​ వారిని పెట్టుకుని అన్​స్కిల్డ్​ లేబర్​గా స్థానికులకు అవకాశాలు ఇస్తున్నారు. ఎస్టీపీపీలో సుమారు 1,500 మంది కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ఎంప్లాయీస్​ఉంటే… అందులో స్థానికులు 500లోపే ఉన్నారు. ఒక్కో ఓసీపీలో డంపర్​ఆపరేటర్లు, వోల్వో, టిప్పర్​డ్రైవర్లు, హెల్పర్లు, అన్​స్కిల్డ్​ లేబర్​గా 500 మంది ఉంటే… స్థానికులు  200 మందికి మించి లేరు. ఎంప్లాయీస్​ వివరాలను వెల్లడించడానికి సైతం  ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు ఇష్టపడడం లేదు.

8 నెలలుగా ఎదురుచూస్తున్నం

మా గ్రామం పేరిట ఇందారం ఓసీపీని ఏర్పాటు చేసినా మాకు ఉద్యోగాలు ఇస్తలేరు. గతంలో టిప్పర్​ డ్రైవర్​గా పనిచేసిన. ఓసీపీలో జాబ్​ కోసం అప్లికేషన్​పెట్టి 8 నెలలు అయితుంది. ఇంతవరకు ఇంటర్వ్యూకు పిలవలేదు. కాంట్రాక్టర్​ఇతర రాష్ట్రాల నుంచి లేబర్​ను తెచ్చుకుంటుండు. లీడర్లు ఎక్కడెక్కడి వాళ్లనో తెచ్చి పెడుతున్నరు. ఇందారం, టేకుమట్ల గ్రామాల్లో వంద మందికిపైగా జాబ్స్​ కోసం ఎదురు చూస్తున్నం. – మల్లేష్​, ఇందారం గ్రామం

Latest Updates