ప్రమోషన్ల కోసం పండిట్ లు,పీఈటీల ఎదురుచూపులు

  •    తెలుగు మహాసభల్లో సీఎం ఇచ్చిన హామీ నెరవేరలె
  •     అప్‌‌గ్రేడేషన్‌‌కు ఇబ్బందిగా ఉన్న జీవో 11,12
  •     వాటిని సవరించకుండానే కొత్త జీవోలిచ్చిన సర్కార్‌‌
  •     సమస్య పరిష్కారానికి పోరుబాట పట్టిన పండిట్‌‌, పీఈటీలు

హైదరాబాద్‌‌, వెలుగు: తమ పోస్టులను ఎప్పుడు అప్​గ్రేడ్​ చేస్తరో అని రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో పనిచేస్తున్న దాదాపు 12 వేల మంది గ్రేడ్​2 భాషా పండిట్​లు, పీఈటీలు రెండేండ్లుగా ఎదురుచూస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ సమస్య పరిష్కరిస్తామని చెప్పినా, ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. ఆయా పోస్టులను అప్‌‌గ్రేడ్‌‌ చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చినా.. దానికి అడ్డంకిగా ఉన్న ఇతర జీవోలను సవరించకపోవడంతో ఏ ఫలితమూ లేకుండాపోయింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో భాషా పండిట్​లు, పీఈటీలు ఇప్పుడు పోరుబాట పట్టారు.

ఎస్​జీటీ క్యాడర్​గానే పండిట్​లు

రాష్ట్రంలోని గవర్నమెంట్‌‌, జిల్లా పరిషత్‌‌ స్కూళ్లలో పనిచేస్తున్న భాషా పండిట్​లు, పీఈటీలను డీఎస్సీ ద్వారా ప్రభుత్వం రిక్రూట్‌‌ చేస్తున్నది. భాషా పండిట్​లు ఏ భాషలో శిక్షణ పూర్తిచేస్తే ఆ భాషలో వారితో పాఠాలు చెప్పిస్తున్నారు. భాషా పండిట్​లంతా హైస్కూల్‌‌ స్టూడెంట్లకు పాఠాలు చెపుతున్నా.. ఎస్‌‌జీటీ క్యాడర్‌‌గానే కొనసాగుతున్నారు. స్కూల్‌‌ అసిస్టెంట్‌‌ ప్రమోషన్లను ఎస్‌‌జీటీలతో కలిపి ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రేడ్‌‌ -2 పండిట్​లు, పీఈటీలకు ఎస్‌‌జీటీలతో కలిపి 2009లో కంబైన్డ్‌‌ ప్రమోషన్లు ఇచ్చారు. దీనిపై కొందరు పండిట్​లు ట్రిబ్యూనల్‌‌ను ఆశ్రయించగా, భవిష్యత్‌‌ పదోన్నతుల్లో నేరుగా నియామకాలైన గ్రేడ్‌‌ -2 పండిట్​లకే ప్రమోషన్లు ఇవ్వాలని సూచించినట్టు పండిత పరిషత్‌‌ నేతలు చెప్తున్నారు. ఆ తర్వాత ప్రమోషన్లు లేకపోవడంతో పెద్దగా సమస్య రాలేదు.

అప్​గ్రేడ్​ చేస్తూ జీవోలిచ్చిన సర్కారు

2017లో టీచర్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 2,487 గ్రేడ్‌‌ 2 భాషా పండిట్​లు, 1,047 పీఈటీలకు స్కూల్‌‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్​ కల్పిస్తూ జీవో నంబర్‌‌ 17,18ని విడుదల చేసింది. దీనిపై ఎస్‌‌జీటీలు కోర్టుకెళ్లారు. 2017 డిసెంబర్‌‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం కేసీఆర్‌‌ భాషాపండిట్​లకు పదోన్నతులు ఇస్తామని హామీనిచ్చారు. దీనికి అనుగుణంగా 2019 ఫిబ్రవరి16న మరో 7,154 పండిట్,1,218 పీఈటీ పోస్టులను అప్‌‌గ్రేడ్‌‌ చేస్తున్నట్టు జీవో నంబర్‌‌15ను విడుదల చేసింది. దీనిపైనా ఎస్‌‌జీటీలు కోర్టుకు వెళ్లడంతో పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది.

జీవోల సవరణలో జాప్యం

డిగ్రీలో సంబంధిత భాషను ప్రధాన సబ్జెక్టుగా చదివి టీచర్‌‌గా నియామకమైన వారికి భాషా పండిట్​లుగా పదోన్నతి ఇవ్వాలని జీవో 11,12లో ఉన్నది. ఈ జీవోలు పదోన్నతులకు అడ్డంకిగా మారాయి. వాటిని సవరించకుండానే ప్రభుత్వం జీవోలు17,18, జీవో15ను విడుదల చేసింది. జీవో 11,12లను సవరించుకుని, పోస్టులు అప్‌‌గ్రేడ్‌‌ చేసుకోవచ్చని గతంలోనే హైకోర్టు చెప్పిందని పండిట్‌‌, పీఈటీ నేతలు అంటున్నారు. ప్రభుత్వం మాత్రం సవరణ చేయకుండానే ఉత్తర్వులివ్వడంపై విమర్శలొస్తున్నాయి.

పోరుబాటలో పండిట్‌‌లు, పీఈటీలు

ఏండ్ల నుంచి నాన్చుడు ధోరణిలోనే ప్రభుత్వం ఉండటంతో గత్యంతరం లేక పండిట్‌‌లు, పీఈటీలు పోరుబాట పట్టారు. ఐదు రోజుల క్రితం ఆర్‌‌యూపీపీ, ఎస్‌‌ఎల్‌‌టీఏ సంఘాల ఆధ్వర్యంలో యాదాద్రి నుంచి హైదరాబాద్‌‌ వరకూ 67 కిలోమీటర్ల వరకూ రెండు రోజుల పాదయాత్ర నిర్వహించారు. మరోవైపు ఆర్‌‌యూపీపీటీ, పీఈటీఏ సంఘాలు శనివారం నుంచి ఇందిరాపార్క్‌‌ వద్ద ఆమరణ నిరాహార దీక్షలు మొదలుపెట్టాయి.

ఆ జీవోలను సవరించాలి

జీవో15 ప్రకారం 12 వేల మంది పండిట్‌‌లు, పీఈటీలకు ప్రమోషన్లు వచ్చే అవకాశముంది. పండిట్​ల్లో చాలామంది ప్రమోషన్లు పొందకుండానే రిటైర్​ అవుతున్నారు. సీఎం కేసీఆర్‌‌ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. అప్‌‌గ్రేడేషన్​కు అడ్డుగా ఉన్న జీవోలు 11,12లను వెంటనే సవరించాలి. లేకపోతే సెప్టెంబర్‌‌లో మా భవిష్యత్‌‌ పోరాట కార్యాచరణ ప్రకటిస్తాం.

– జగదీశ్‌‌, ఆర్‌‌యూపీపీ రాష్ట్ర అధ్యక్షుడు

Latest Updates