వెలుగులోకి 1500 కోట్ల వడ్ల స్కామ్

హైదరాబాద్, వెలుగు:

వడ్ల కొనుగోళ్లలో భారీ స్కాం బయటపడింది. రైస్ మిల్లర్లు, సివిల్​ సప్లైస్​ అధికారులు కలిసి సర్కారు ఖజానాకు గండికొట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,500 కోట్ల మేర దోచుకున్నారు. గతేడాది ఖరీఫ్​లో ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకే వడ్లను కొని తెచ్చి, ఇక్కడ మద్దతు ధరకు సర్కారుకు విక్రయించారు. ఇందుకోసం ఇక్కడి చిన్న రైతులు, ఐకేపీ సెంటర్ల నిర్వాహకులను మచ్చిక చేసుకుని వ్యవహారం నడిపించారు. ఇలా దోచుకున్న సొమ్ములో సివిల్​ సప్లైస్​లోని పెద్దాఫీసర్ల నుంచి మండల స్థాయి అధికారుల దాకా వాటాలు వెళ్లాయని, రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఇదంతా జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వడ్ల కొనుగోళ్ల కుంభకోణంలో ఎక్కడా రైతు కనిపించడు. వరి ధాన్యమూ ఉండదు. కానీ రైతు పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ నంబర్  సహా అన్ని వివరాలు ఆన్​లైన్లో పక్కగా ఉంటాయి. రైస్ మిల్లర్లు పొరుగు రాష్ట్రాల నుంచి ముందే కొని తెచ్చిన వడ్లను తమ గోదాంలో నిల్వ చేస్తారు. అర ఎకరం నుంచి ఏడెనిమిది ఎకరాల భూమి ఉన్న రైతులతో ఒప్పందాలు చేసుకుంటారు. వారి ఆధార్ నంబర్, పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుంటారు. ముందే ఐకేపీ సెంటర్, సివిల్  సప్లై అధికారులతో మాట్లాడుకుని.. ఏ ఐకేపీ సెంటర్​కు ఏ రైతు వివరాలో పంపాలో ప్లాన్​ చేసుకుంటారు. తాము ఒప్పందాలు చేసుకున్న రైతుల వివరాలను సదరు ఐకేపీ సెంటర్​కు పంపుతారు. ఆ ఐకేపీ సెంటర్  వాళ్లు ఆ వివరాలను అప్ లోడ్  చేస్తారు. సివిల్ సప్లైస్​ అధికారులు ముందుగా అనుకున్న మేరకు అదే రైస్ మిల్​కు వివరాలు పంపుతారు. ధాన్యం వచ్చేసిందని మిల్లర్లు ఆన్ లైన్లో కన్ఫామ్​ చేస్తారు. కొద్దిరోజుల్లో సర్కారు నుంచి రైతుఖాతాలో సొమ్ము జమవుతుంది. మిల్లర్లు ఆ సొమ్ము తీసేసుకుని.. ముందు చేసుకున్న ఒప్పందం మేరకు రైతులకు ఎంతో కొంత డబ్బు ఇస్తారు.

2017–18 ఖరీఫ్​లో 10.47 లక్షల హెక్టార్లలో వరి సాగు జరిగింది. 18,24,802 టన్నుల ధాన్యం సేకరించారు. 2018–19 ఖరీఫ్ లో 11.89 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. అంటే సుమారు లక్షన్నర హెక్టార్లలో అదనంగా సాగు చేశారు. కానీ సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో జరిగిన వడ్ల కొనుగోళ్లు రెండింతలు దాటిపోయాయి. ఏకంగా 40,41,429 టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఒక్కసారి ఇంతగా పెరిగిపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.  దీంతో సర్కారు అసలు ఎంత విస్తీర్ణంలో వరి సాగైంది, గత నాలుగేళ్లలో ఏ మేరకు వరి దిగుబడి జరిగింది, ఏ ఐకేపీ సెంటర్లో ఏ మేరకు ధాన్యం సేకరణ జరిగిందన్న వివరాలను ఆరా తీసే పనిలో పడింది. కొందరు మిల్లర్లు, సివిల్​ సప్లై శాఖ అధికారులు కుమ్మక్కై ఈ స్కామ్​కు తెరలేపారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం వెనుక ఎవరెవరున్నారు, ఏ స్థాయి అధికారులు, రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నదన్న దానిపై రహస్యంగా విచారణ జరుగుతోంది. ఇప్పటికే ప్రాథమిక విచారణలో పలు కీలక అంశాలు బయటికి వచ్చినట్టు తెలిసింది. విచారణ పూర్తయితే కథ మొత్తం బహిర్గతం అవుతుందని, అక్రమార్కులపై వేటు పడుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి.

మొత్తం కొనాలన్న లక్ష్యమే ఆసరాగా..

రాష్ట్రంలో పండిన వరి చివరి గింజ వరకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని మిల్లర్లు, అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, చత్తీస్ గడ్, మహారాష్ట్ర, కర్నాటకలో రేషన్  బియ్యానికి సరిపడా మాత్రమే అక్కడి ప్రభుత్వాలు కొంటున్నాయి. రైతులు మిగతా వడ్లను తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఇక్కడి మిల్లర్లు ఆ వరిని తక్కువ ధరకు కొని రాష్ట్రానికి తెస్తున్నారు. సొంత గోడౌన్లలో దాచుకుని కొనుగోళ్ల గోల్​మాల్​కు తెరతీస్తున్నారు.

కొనుగోళ్ల ప్రక్రియ ఎలా ఉంటుంది?

సర్కారు రైతుల సౌకర్యం కోసం ప్రతి గ్రామంలో వరి కొనుగోళ్లకు ఐకేపీ సెంటర్  ఏర్పాటు చేసింది. ఆ సెంటర్​ నిర్వాహకులు ధాన్యం వివరాలు, రైతు ఆధార్ నంబర్, పట్టాదారు పాస్​బుక్, బ్యాంకు అకౌంట్ నంబర్ తీసుకుని.. వారికి ఇచ్చిన ట్యాబ్  ద్వారా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తారు. జిల్లా సివిల్​ సప్లైస్​ అధికారులు ఇలా ఐకేపీ సెంటర్ల నుంచి వచ్చిన వివరాలను చూసుకొని.. ఆ ధాన్యాన్ని ఎక్కడికి ట్రాన్స్​పోర్ట్​ చేయాలో చెప్తారు. ఐకేపీ సెంటర్ నుంచి లోడ్  తీసుకొచ్చే లారీ నంబర్, ఏ రైతుల పేరుతో ఎన్ని బస్తాల  ధాన్యం వస్తుందన్న వివరాలన్నీ తీసుకుని.. వాటిని రైస్ మిల్లర్లకు పంపుతారు. మిల్లర్లు వివరాలు సరిచూసుకుని, ధాన్యాన్ని తీసుకుంటారు. తర్వాత తమకు కేటాయించిన ఐడీ నంబర్ తో సివిల్ సప్లై వెబ్ సైట్లోకి వెళ్లి.. అన్నీ సరిగా ఉన్నట్టుగా అధికారులకు ఫార్వర్డ్ చేస్తారు. ఈ మేరకు అధికారులు ఆన్ లైన్​ ద్వారానే రైతుల అకౌంట్ లోకి డబ్బులు జమ చేస్తారు.

లారీ ఓనర్ల సహకారం కూడా..

రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కై సాగిన ఈ స్కామ్​లో లారీ ఓనర్ల ప్రమేయం కూడా ఉందని విచారణలో తేలినట్టు సమాచారం. ఐకేపీ సెంటర్ల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తీసుకెళ్లినట్టుగా లారీ నంబర్​తో సహా నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో లారీ ఓనర్ల సహకారం కూడా తీసుకున్నట్టు విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఓ లారీని ముందే అనుకున్న ఐకేపీ సెంటర్ కు పంపుతారు. ఆ తిరిగి ఖాళీగా వెళ్లిపోతుంది. కానీ ధాన్యం తీసుకెళ్లినట్టుగా రికార్డుల్లో నమోదు చేస్తారు. వడ్లు నింపేందుకు సర్కారు ఇచ్చే గోనె సంచులను లారీ ఓనర్లు తీసుకుంటారో, రైస్ మిల్లర్ తీసుకుంటారో, లేక సివిల్ సప్లై అధికారులు తీసుకున్నారో విచారణ లో తేలుతుందని ఓ అధికారి పేర్కొన్నారు.

40 కిలోమీటర్ల దూరం వెళ్లి అమ్మకాలు

ప్రతి రైతు పండించిన పంటను సొంత గ్రామంలోనే విక్రయించుకునేందుకు వీలుగా ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేశారు. కానీ వందలు, వేల క్వింటాళ్ల వరిని విక్రయించిన రైతుల వివరాలు మాత్రం చాలా ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది. దగ్గర్లోని ఐకేపీ సెంటర్ ను కాదని రైతులు 40, 50 కిలోమీటర్ల దూరం వెళ్లి ధన్యాన్ని విక్రయించారు. సివిల్ సప్లై అధికారులు సూచించిన ఐకేపీ సెంటర్లకే రైస్ మిల్లర్లు రైతుల వివరాలు పంపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కౌలు, పట్టాల్లేని రైతులతోనూ లెక్కల్లో తేడాలు!

ధాన్యం అమ్మకాలు భారీగా పెరగడం వెనుక కౌలు రైతులు, పట్టాల్లేని రైతులు కూడా కారణమా అన్న అంశాన్నీ పరిశీలిస్తున్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించాలంటే కచ్చితంగా పట్టా ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరున్నర లక్షల మందికి ఇంకా పట్టాదారు పాస్​బుక్కులు ఇవ్వలేదు. అలాంటి వారు తమ పంటను ఇతర రైతుల పేరుతో విక్రయించారా అన్నది పరిశీలిస్తున్నారు. ఇక కొందరు రైతులు వేరే వాళ్ల పొలాలను కూడా కౌలుకు తీసుకుని పండిస్తున్నారు. ధాన్యం విక్రయించే సమయంలో తమ సొంత పట్టాను నమోదు చేయిస్తున్నారు.

1,500 కోట్ల అక్రమాలు

2017–18లో మొత్తంగా 18,24,802 టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. 2018–19లో పదిశాతం అదనంగా ధాన్యం దిగుబడి పెరిగిందని వ్యవసాయాధికారులు నిర్ధారించారు. ఆ లెక్కన 20–22 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగి ఉండాల్సింది. కానీ పొరుగు రాష్ట్రాల నుంచి వరి రావడంతో ఇది రెట్టింపైంది. ఏకంగా 40,41,429 టన్నుల కొనుగోళ్లు జరిగాయి. సుమారు రూ.3,500 కోట్ల విలువైన ధాన్యం అదనంగా కొనుగోలు చేశారు. ఈ లెక్కన సుమారు రూ.1,500 కోట్ల మేర అవకతవకలు జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మిల్లర్లు ఎక్కువగా ఉండే ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఈ వ్యవహారం ఎక్కువగా జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం.

నిఘా పెంచిన సర్కారు

గత ఖరీఫ్ లో పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ మద్దతు ధరకు విక్రయించారన్న సమాచారంతో ఈసారి ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టామన్నారు. ఇక ప్రతి రైతు తను పండించిన పంటను సొంత గ్రామంలో మాత్రమే విక్రయించాలనే నిబంధన పెట్టారు. ఇప్పటివరకు సుమారు 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగినట్టు తెలిసింది.

Latest Updates