6 నెలల్లో 29 వేల డ్రంకెన్ డ్రైవ్ కేసులు

  • 3 కమిషనరేట్ల పరిధిలో రూ.4.61 కోట్ల ఫైన్
  • 7,379 మందికి శిక్షలు
  • 1,099 డ్రైవిం గ్ లైసెన్సుల సస్పెన్షన్

హైదరాబాద్,వెలుగు:  రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను మందుబాబులు ఖాతర్ చేయడం లేదు. మద్యం మత్తులో వెహికల్స్ నడుపుతూ ప్రమాదాలకు కారణమౌతున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ తో కేసులు బుక్ చేస్తున్నా..మందుబాబులకు అది కామన్ గా మారింది. పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.  సిటీ పోలీస్ కమిషనరేట్ తో పాటు  రాచకొండ,సైబరాబాద్ కమిషనరేట్లలో నిర్వహిస్తున్న డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రతి ఏటా వేల సంఖ్యలో తాగి వెహికల్స్ నడిపి మందుబాబులు పట్టుబడుతున్నారు. ఇందులో గతేడాది కేసులతో పోల్చితే ఈ ఏడాది 6 నెలల్లోనే భారీగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 3  కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 30 వరకు 29,181 కేసులను ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు. బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్) లెవల్స్ 30శాతం దాటితే కేసులు బుక్ చేసి వెహికల్, డ్రైవింగ్ లైసెన్స్ లను సీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత పట్టుబడ్డ వాహనదారులను కోర్టుల్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు పోలీసులు.

సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో..

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 6 నెలల్లో15,133 కేసులను ట్రాఫిక్ పోలీసులు బుక్ చేశారు. సిటీ కమిషరేట్ పరిధిలో గతేడాది నమోదైన డ్రంకన్ డ్రైవ్ కేసుల సంఖ్య 29,485 కాగా ఈ ఏడాది ఆరు నెల్లలోనే  15,133కి చేరింది. ఈ కేసుల్లో 14,161 ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. ఇందులో 2,864 మందికి కోర్టులు జైలు శిక్ష విధించాయి. శిక్షలతో పాటు 929 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ అయ్యాయి. ఈ మొత్తం కేసుల్లో బీఏసీ లెవల్స్ ను బట్టి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ మందుబాబులకు రూ.3కోట్ల6లక్షల81,700 ఫైన్ ను స్పెషల్ కోర్టులు విధించాయి. ఇందులో బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్,అమీర్ పేట, హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో  యువకులతో పాటు యువతులు పోలీసులకు చిక్కుతున్నారు. వీకెండ్ పార్టీల పేరుతో తప్పతాగి ట్రాఫిక్ పోలీసుల బ్రీత్ ఎనలైజర్లకు అడ్డంగా బుక్కౌతున్నారు.

 సైబరాబాద్ లో..

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోనూ డ్రంకెన్ డ్రైవ్ కేసులు వేల సంఖ్యలో నమోదౌతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మొత్తం10,750 కేసులను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు. ఇందులో 4,018 మంది డ్రంకెన్ డ్రైవర్లకు కోర్టులు శిక్ష విధించాయి. వీటితో పాటు బీఏసీ లెవల్స్ ను బట్టి కౌన్సిలింగ్స్,ఫైన్ విధిస్తూ కోర్టులు తీర్పు చెప్పాయి. ఈ 6 నెలల కాలంలో నమోదైన కేసుల్లో మొత్తం రూ.కోటి5లక్షల26,763 ఫైన్ ను  వసూలు చేశారు. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే సైబరాబాద్ కమిషనరేట్ లో శని,ఆదివారాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గచ్చిబౌలి,మాదాపూర్,మియాపూర్ తో పాటు ముంబయి హైవే పై డ్రంకెన్ డ్రైవర్లు పట్టుబడుతున్నారు.

రాచకొండ పరిధిలో..

గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో ఈ కేసులు  తక్కువగానే  నమోదయ్యాయి. మొదటి 6 నెలల్లో మొత్తం 3,298 డ్రంకెన్ డ్రైవ్ కేసులను ట్రాఫిక్ పోలీసులు బుక్ చేశారు. వీటిలో 2,953 కేసుల్లో  రూ.48లక్షల98,007 ఫైన్ లను కోర్టులు విధించాయి. ఇందులో 2,452 కేసుల్లో ఫైన్ తో పాటు మరో 24 కేసుల్లో శిక్షలు విధిస్తూ కోర్టులు తీర్పునిచ్చాయి. 258 కేసుల్లో ఫైన్ తో పాటు శిక్షలు విధిస్తూ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవే కాకుండా165  మందికి ఫైన్ తో పాటు కోర్టు పనిగంటలు ముగిసే వరకు ఓపెన్ కోర్టులో నిల్చోబెట్టింది. మరో 50 మందికి ఫైన్ కట్టి, సోషల్ సర్వీస్ చేసేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ 6  నెల్లలో 345 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఓఆర్ఆర్ తో పాటు శివారు ప్రాంతాల్లోని చౌటుప్పల్,యాదాద్రి భువనగిరి, కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో రాచకొండ పోలీసులు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పోలీస్ వెహికల్స్ నడిపే డ్రైవర్లకు రోజుకు రెండు సార్లు బ్రీత్ ఎనలైజర్ తో చెక్ చేస్తున్నారు.

పోలీసులకు డ్రంకెన్ డ్రైవ్

ఎల్ బీ నగర్ : ఇప్పటి వరకు పబ్లిక్ కు డ్రంకెన్డ్రైవ్ టెస్ట్ లు చేసిన ట్రాఫిక్ పోలీసులు…ఇప్పడు పోలీసులకు కూడా చేస్తున్నారు. కొంత కాలంగా డ్యూటీలో ఉండి మద్యం మత్తు లో వెహికల్స్ నడిపిన ఘటనలు బయటపడటంతో పోలీస్ సిబ్బందిపై డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మంగళవారం ఉదయం డ్యూటీ ముగించుకొని వెళ్తున్న పోలీసులకు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంతో పాటు చౌరస్తాలో ట్రాఫిక్ అడిషనల్ ఇన్ స్పెక్టర్ నాగమల్లు ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిచెక్ చేశారు. ఈ సందర్భంగా సీఐ నాగమల్లు మాట్లాడుతూ.. పోలీసులపై నమ్మకం, వారిలోజవాబుదారితనాన్ని పెంచడానికి వారికి సైతం డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించామన్నారు.గవర్నమెంట్ వెహికల్స్ నడిపేవారందరికీ ఈ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Latest Updates