లాస్ట్ ఇయర్ మార్చి బిల్లే.. ఈ నెల కరెంటు బిల్లు

హైదరాబాద్‌‌, వెలుగు: లాస్ట్ ఇయర్ మార్చి బిల్లే.. ఈ నెల కరెంటు బిల్లు. కరోనా వ్యాప్తి చెందుతుందనే కారణంగా ఈ నెల మీటర్ల రీడింగ్ తీయడానికి సిబ్బంది వెనుకాడుతుండటంతో డిస్కంలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మొదట్లో గత ఫిబ్రవరి నెల బిల్లునే పంపాలని భావించినా.. ఆ నెలలో కరెంటు వాడకం తక్కువగా ఉంటుందని గత ఏడాది మార్చి బిల్లును పంపాలని డిసైడ్ చేశాయి. ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారులకు బిల్లులు పంపేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఈఆర్ సీకి లెటర్లు కూడా రాశాయి. రెండ్రోజుల్లో దీనిపై ఈఆర్సీ డిసిషన్ చెప్పే అవకాశం ఉంది.

శ్లాబ్ మారిపోతుందని ..

వాస్తవానికి ప్రతి నెల 3వ తేదీ నుంచి మీటర్‌‌ రీడర్లతో బిల్లింగ్‌‌ తీస్తారు. ఇంటింటికి తిరిగి మీటర్ రీడింగ్ తీయడం వల్ల కరోనా వ్యాపిస్తుందని శుక్రవారం ప్రారంభం కావాల్సిన మీటర్‌‌ రీడింగ్‌‌ స్టార్ట్ కాలేదు. దీంతో డిస్కంలు లాస్ట్ ఇయర్ మార్చి బిల్లునే ఈ సారి పంపనున్నాయి. వచ్చే నెల రీడింగ్ తీసి బిల్లులను అడ్జస్ట్ చేసే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఏటా మార్చి, ఏప్రిల్‌‌, మే నెలల్లోనే కరెంటు వాడకం ఎక్కువగా ఉంటుందని, రీడింగ్‌‌ తీయక పోతే శ్లాబ్ లు మారిపోయి బిల్లుల గందరగోళం ఏర్పడుతుందని వినియోగదారులు అంటున్నారు.

మొత్తం 1.54 కోట్ల మీటర్లు

రాష్ట్రంలో గృహ, వాణిజ్య, వ్యాపార, పరిశ్రమలతో కలిపి 1.54 కోట్ల కరెంటు కనెక్షన్లున్నాయి. వీటిలో గృహ వినియోగదారులకు సంబంధించి 1.13 కోట్ల మీటర్లు ఉన్నాయి. కమర్షియల్‌‌ మీటర్లు 13.98 లక్షలు ఉండగా.. పరిశ్రమలకు సంబంధించిన హైటెన్షన్‌‌ విద్యుత్‌‌ మీటర్లు 12,610 వరకు ఉన్నాయి.  ప్రతి నెల రూ.600 కోట్లకు పైగా కరెంటు బిల్లులు ఉంటాయి. గత ఫిబ్రవరిలో విద్యుత్‌‌ బిల్లులు రూ.625 కోట్లు వచ్చాయి.  మార్చిలో  రూ.800 కోట్లు, ఏప్రిల్‌‌ లో రూ.900 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్ల వరకు వస్తుందని అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు మూత పడటంతో వాటికి మినిమమ్‌‌ బిల్లు మాత్రమే వేయాల్సి ఉంటుంది. గృహ వినియోగదారుల వినియోగంపైనే డిస్కంల ఆదాయం ఆధారపడి ఉంటుంది. అయితే లౌక్ డౌన్ కారణంగా పట్టణాల్లో ఉన్నవారంతా పల్లె బాట పట్టడం, కరోనా భయానికి
ఏసీల వాడకం తగ్గడంతో బిల్లులు తగ్గే అవకాశం ఉంది.

సింగరేణి కార్మికుల జీతంలో కోత

Latest Updates