ఫీజుల కట్టడికి చట్టం తేండి : ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్‌‌, వెలుగు: ఫీజుల నియంత్రణకు చట్టం తెచ్చి కార్పొరేట్‌‌ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌‌రెడ్డిని ఆయన గురువారం కలిశారు. కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లలో అడ్డగోలుగా ఫీజులు పెంచారని, వాటిని నియంత్రించేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో కలిసి 10 లక్షల మంది ఇంటర్‌‌ స్టూడెంట్స్‌‌ ఉంటే నాలుగున్నర లక్షల మంది శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లోనే ఉన్నారన్నారు.

బోగస్ పేర్లమీద వందలాది కాలేజీలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారని కార్యదర్శికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఒక యాజమాన్యం ఒక్క విద్యా సంస్థనే నిర్వహించాలని, కానీ వందల సంఖ్యలో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఆయా కాలేజీల్లో బట్టీ చదువుల విధానంతో స్టూడెంట్స్‌‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.

Latest Updates