చట్టాలతో జనాభా నియంత్రణ చేయలేం: ఆడపిల్లల చదువుతోనే..

చట్టాలతో జనాభా నియంత్రణ చేయలేం: ఆడపిల్లల చదువుతోనే..
  • బీహార్ సీఎం నితీశ్ కుమార్‌‌ కామెంట్

పాట్నా: ఎన్డీయేలోనే ఉంటూ జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తరచూ బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. యూపీ బీజేపీ సర్కారు ఇటీవలే తెచ్చిన జనాభా నియంత్రణ చట్టాలపై ఆయన స్పందించారు. బీహార్ రాజధాని పాట్నాలో నితీశ్ మాట్లాడుతూ.. చట్టాలతో జనాభా నియంత్రణ సాధ్యం కాదని తాను భావిస్తున్నానని చెప్పారు. అయితే రాష్ట్రాలు వాటికి నచ్చిన చట్టాలు తెచ్చుకునే స్వేచ్ఛ ఉందని, కానీ చట్టాలతో జనాభా కంట్రోల్ చేయలేమని, దానికి చైనానే ఉదాహరణ అని అన్నారు. స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానే జనాభా నియంత్రణ సాధ్యమని ఆయన అన్నారు. తన ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నానని, ఏ కుటుంబాల్లోనైతే ఎక్కువగా చదువుకున్న మహిళలు ఉన్నారో, ఆ ఇంట్లో సంతానం పరిమిత సంఖ్యలో ఉన్నట్టుగా తేలిందని చెప్పారు. మహిళల్లో చదువు, అవగాహన పెరిగితే జనాభా పెరుగుదల రేటు తగ్గుతుందని నితీశ్ తెలిపారు. ‘‘2040 కల్లా జనాభా గ్రోత్‌ రేట్ తగ్గడం మొదలవుతుంది. అయితే ఇది చట్టాల ద్వారా సాధించవచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ జనాభా కంట్రోల్‌ ఎలా చేయొచ్చన్నదానిపై మాకు ఒక క్లారిటీ ఉంది. ఇది కేవలం ఒక కమ్యూనిటీ గురించి మాత్రమే కాదు.. మహిళలు చదువుకుంటే ప్రతి ఒక్కరూ బెనిఫిట్ అవుతారు. బీహార్‌‌లో ఏటా పుడుతున్న పిల్లల సంఖ్యలో ఎంత తగ్గుదల ఉందో చూస్తే ఆ విషయం అర్థమవుతుంది” అని ఆయన చెప్పారు. కాగా, ఇద్దరికి మించి ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు అందించబోమని, ప్రభుత్వ ఉద్యోగానికీ వాళ్లు అర్హులు కారని యూపీ సర్కారు ఇటీవలే చట్టం తెచ్చిన నేపథ్యంలో నితీశ్ ఇలా స్పందించారు.