
-
ఫోన్ లాక్కొని పరారైన దుండగులు
-
అడ్వొకేట్ చేతికి.. నడుముకు గాయాలు
బషీర్ బాగ్, వెలుగు: ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ న్యాయవాది పై కత్తితో దుండగులు దాడి చేశారు. మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఖైరతాబాద్ కు చెందిన కళ్యాణ్ అనే న్యాయవాది తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు బయటకు వచ్చారు. ఐమాక్స్ వద్ద ఫోన్ మాట్లాడుతూ.. తన కుక్కని పట్టుకొని ఒంటరిగా నడుస్తూ వెళ్తున్నారు. ఇంతలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు యాక్టివా పై న్యాయవాది వద్దకు వచ్చారు. న్యాయవాదితో తన పెంపుడు కుక్క గురించి అడుగుతున్నట్లు నటించారు.
క్షణాల్లో వారి వెంట తీసుకొచ్చిన కత్తితో న్యాయవాది కళ్యాణ్ మీద దాడి చేశారు. తేరుకునేలోపే న్యాయవాది చేతిలోని సెల్ఫోన్ లాక్కొని యాక్టివాపై పారిపోయారు. దీంతో న్యాయవాది చేతికి , నడుము భాగంలో గాయాలయ్యాయి. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఖైరతాబాద్ పోలీసులు న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మొబైల్ చోరీ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు దుండగులు వచ్చిన రూట్లను సీసీ కెమెరాల ద్వారా నాలుగు టీమ్ లతో దర్యాప్తు చేస్తున్నారు. లక్డీకాపుల్ లోని ఓ ప్రేవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న న్యాయవాది కళ్యాణ్ ను గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పరామర్శించారు. దాడి చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.