వాట్సాప్ లో వివాదం..కోర్ట్ లో కాల్పులు

వాట్సాప్ గ్రూప్ లో చిన్నవివాదం చినికి చినికి గాలివానైంది. దీంతో ఓ లాయర్ కోర్ట్ ఆవరణలో కాల్పులకు తెగబడ్డాడు.

ఉత్తర్ ప్రదేశ్ గాజియాబాద్ కోర్ట్ లో కాల్పుల కలకలం సృష్టించాయి. శుక్రవారం రాత్రి వాట్సప్ లో రెండు గ్రూపుల సభ్యుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో ఓ గ్రూప్ లో ఉన్న లాయర్ మరో గ్రూప్ లో ఉన్న లాయర్ కు వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చినట్లే కోర్ట్ లో కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులతో అప్రమత్తమైన బాధితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

రాహుల్ చౌదరి, విక్రాంత్ త్యాగి ఇద్దరు లాయర్లు. శుక్రవారం సాయంత్రం వాట్సాప్ గ్రూప్ లో చాటింగ్ చేసుకుంటుండగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో కోపోద్రికుడైన రాహుల్ ..విక్రాంత్ ను బెదిరించాడు. రేపు నిన్ను చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. రాహుల్ వార్నింగ్ తో బాధితుడు విక్రాంత్ స్థానిక పోలీసులకు, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు సునీల్ దత్ కు ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో శనివారం రాహుల్ బుల్లెట్లు లోడ్ చేసిన గన్ తో కోర్ట్ కు హాజరయ్యాడు. కోర్ట్ ఆవరణలో ఇద్దరు ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు . వాగ్వాదం జరుగుతుండగా రాహుల్ తన దగ్గరున్న తుపాకీతో విక్రాంత్ పై  3రౌండ్లు కాల్పులు జరిపాడు. నిందితుడు కాల్పులతో భయాందోళనకు గురైన బాధితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు కూడా అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పులతో  కోర్ట్ ఆవరణంలో ఏం జరుగుతుందో అర్ధం కాని తోటి లాయర్లు పోలీసులకు సమాచారం అందించారు. లాయర్ల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కోర్ట్ ఆవరణలో దొరికిన బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates