ఎల్బీ నగర్- అమీర్ పేట్ మెట్రో లైన్ ప్రారంభం

హైదరాబాద్ : నగరంలో మెట్రో రైలు మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఎల్బీనగర్ – అమీర్ పేట్ – మియాపూర్ మెట్రో రైలు మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ (సోమవారం – సెప్టెంబర్ 24) మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు.. ఎల్బీనగర్ – అమీర్ పేట్ మెట్రో లైన్ ను రాష్ట్ర గవర్నర్ నరసింహన్… రాష్ట్రమంత్రి కేటీఆర్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో ప్రారంభించారు. ఆ తర్వాత.. రైలులో గవర్నర్, మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు , సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇతర నేతలు ప్రయాణించారు.

అమీర్ పేట్ నుంచి ఎల్బీనగర్ కు తొలిసారి వెళ్తూ.. మధ్యలో ఎంజీబీఎస్ స్టేషన్ దగ్గర గవర్నర్, మంత్రులు కాసేపు ఆగారు. ఎంజీబీఎస్ స్టేషన్ లో విశేషాలను గవర్నర్ కు మంత్రి కేటీఆర్ వివరించారు.

అమీర్‌పేట నుంచి పంజాగుట్ట, ఖైరతాబాద్, అసెంబ్లీ, నాంపల్లి, కోఠి, ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట మీదుగా ఎల్బీనగర్ వరకు మెట్రో రైలు మొదటిసారి జనంతో తిరిగింది. మెట్రో రైలు ప్రాజెక్టులోనే ప్రధానమైన మార్గం కావడంతో.. జనం సంతోషపడుతున్నారు. ఎల్బీనగర్ – మియాపూర్ మధ్య మొత్తం 29 కిలోమీటర్లు. అమీర్ పేట్ నుంచి మియాపూర్ లైన్ ఇప్పటికే వినియోగంలో ఉంది. ఇప్పుడు ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట వరకు 16 కిలోమీటర్ల మెట్రో లైను అందుబాటులోకి వచ్చేసింది.  దీంతో.. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ ఏరియాకు.. ట్రెయిన్ దిగకుండా.. కేవలం 40 నిమిషాల్లో చేరుకోవచ్చని అధికారులు చెప్పారు. ఉప్పల్ టు అమీర్ పేట్ లైన్ కలుపుకుంటే.. నగరంలో ప్రస్తుతం 46 కిలోమీటర్ల మెట్రో లైన్ అందుబాటులో ఉంది.

Posted in Uncategorized

Latest Updates