ఎంపీల రాబడి పైపైకి

ఎన్నికలేవైనా పేదరిక నిర్మూలనే మా లక్ష్యమంటూ రాజకీయ నేతలు హామీలు గుప్పించడం మామూలే..  ప్రచారంలో భాగంగా గుడిసెల్లో భోజనం చేస్తూ, పేదలను హత్తుకుని ఫొటోలకు ఫోజులిస్తారు. పేదరికాన్ని పారదోలేందుకు సంక్షేమ పథకాల వరాలు గుప్పిస్తారు. ఒకటేమిటి.. ఎన్ని రకాలుగా వీలైతే అన్నిరకాలుగా ఊరిస్తారు. మరి నిజంగా వారు పేదల ప్రతినిధులేనా? రాజకీయ నేతల ఆదాయానికి, సామాన్యుడి ఆదాయానికి ఏ స్థాయిలో తేడాలున్నాయో తెలుసుకునేందుకు ఓ ఇంగ్లిష్​పత్రిక రీసెర్చ్​చేసి వివరాలను వెల్లడించింది. లోక్​సభ ఎంపీల ఆదాయం, ఆస్తుల సగటును లెక్కగడితే.. ప్రజల ఆదాయం కన్నా నేతల ఆదాయం 1400 రెట్లు ఎక్కువగా ఉందని తేలిందట. 2004 నుంచి 2019 దాకా ఎంపీల ఆస్తుల వివరాలను పరిశీలిస్తే.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఎంపీల నికర ఆస్తులు వేగంగా పెరిగాయని తేలింది.

రాష్ట్రాలు, ఎంపీల ఆదాయంలో భారీ తేడా

రాష్ట్రాల తలసరి ఆదాయాన్ని, ఆ రాష్ట్రంలోని రాజకీయ నేతల సగటు ఆదాయాన్ని కంపేర్​చేస్తే.. వాటి మధ్య అంతరం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్​టాప్​లో ఉంది. ఏపీ తలసరి ఆదాయం రూ.96,374  కాగా అక్కడి ఎంపీల సగటు ఆదాయం రూ.50 కోట్లకు పైనే ఉందని తేలింది. ఆ తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, బీహార్, పంజాబ్, కర్నాటక, జార్ఖండ్, అస్సాం, తమిళనాడు ఉన్నాయి. ఈ లిస్ట్​లో చివరి స్థానంలో నిలిచిన రాష్ట్రం సిక్కిం. ఇక్కడి నేతల సగటు ఆదాయం రాష్ట్ర తలసరి ఆదాయంకన్నా కేవలం 0.32 రెట్లు ఎక్కువగా ఉందని రీసెర్చర్లు చెప్పారు.

ఎందుకీ తేడా?

రాష్ట్ర తలసరి ఆదాయానికి, ఎంపీల సగటు ఆదాయానికి మధ్య ఈ స్థాయిలో తేడాలు ఉండడానికి రెండు కారణాలు ఉన్నాయని అశోకా వర్సిటీ ప్రొఫెసర్ గిల్లీస్​వెర్నియర్ చెబుతున్నారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఎక్కువగా బడా వ్యాపారులు పోటీ చేసి గెలుపొందడం ఒక కారణం కాగా పొలిటీషియన్లు కొత్తగా రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ తదితర రంగాల్లో అడుగుపెట్టడమూ మరో కారణమని అన్నారు.

Latest Updates