పోలీసులు వద్దన్నామావోల ఇలాకాలో నేతల టూర్లు

జయశంకర్‌‌ భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌‌ మంగళవారం పర్యటన ఆగమాగమైంది. పోలీసులు, టీఆర్ఎస్​లీడర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలకు లీడర్లు వెళ్లడానికి పోలీసులు అస్సలు అంగీకరించలేదు. మంత్రిని పంపించడానికి ససేమిరా ఒప్పుకోలేదు. వాజేడు మండలంలో ఎమ్మెల్సీ వెహికల్​కు పోలీసులు వారి వెహికల్ అడ్డుపెట్టారు. ఎమ్మెల్సీ సీఐతో గొడవపెట్టుకొని మరీ ఊళ్లల్లో తిరిగారు. కొన్ని గ్రామాల్లో మహబూబాబాద్‌‌ ఎంపీ కవిత కూడా పోలీసులను లెక్క చేయకుండా  తిరిగారు.  దీంతో ములుగు, ఏటూరునాగారం ఏఎస్సీలు సాయిచైతన్య, గౌస్‌‌ ఆలం తమ శాఖ ఉన్నతాధికారులకు నివేదించారు.

మంత్రితో రెండు గంటల చర్చ

వాజేడు, వెంకటాపురం మండలాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి మంత్రి సత్యవతి రాథోడ్‌‌ రోడ్డు మార్గంలో వెంకటాపురం చేరుకున్నారు. మావోయిస్టు పార్టీకి కంచుకోట అయిన వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ మండలాల్లో మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత  పర్యటనపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు మాత్రమే అనుమతించారు. ఇక్కడ ఎమ్మెల్సీ బాలసాని ఇంట్లో ములుగు, ఏటూరునాగారం ఏఎస్పీలు మంత్రితో సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారు. వెంకటాపురం మండలంలోని ఆలుబాక గ్రామంలో ఇటీవల మావోయిస్టులు టీఆర్‌‌ఎస్‌‌ కార్యకర్తను చంపేశారు. దీంతో ఈ గ్రామంలో, వాజేడు మండలంలో మంత్రి పర్యటనకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ గ్రామాల్లో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ వంటి ప్రజాప్రతినిథులు పర్యటిస్తే సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. తన సొంత మండలంలో తిరగొద్దని చెప్పడం ఏంటని ఎమ్మెల్సీతోపాటు పలువురు టీఆర్‌‌ఎస్‌‌ నాయకులు పోలీసులతో వాగ్వివాదం పెట్టుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటనకు పోలీస్ ఆఫీసర్లు అనుమతించకపోవడంతో  మంత్రి సత్యవతి రాథోడ్‌‌ కేవలం పాత్రపురం, ఉప్పెడు -వీరాపురం, వెంకటాపురం గ్రామాల పర్యటనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెంకటాపురం మండల పరిధిలోని అలుబాక, వాజేడు మండలంలో పర్యటన రద్దు చేసుకొని మంత్రి వెనుదిరిగారు.

ఎమ్మెల్సీకి పోలీస్ వెహికల్ అడ్డు

వాజేడు మండలంలో పర్యటించవద్దని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినా వినకుండా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తన వెహికల్‌‌లో గ్రామాలకు బయలుదేరారు. జగన్నాథపురం గ్రామం వద్ద ఏటూరునాగారం సీఐ కిరణ్ ఎమ్మెల్సీ వాహనాన్ని అడ్డుకున్నారు. వాజేడు మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటనను రద్దు చేసుకోవాలని కోరారు. దీంతో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నా ప్రాతంలో నేను తిరగడానికి ఆంక్షలు ఏమిటంటూ రహదారిపై ఉన్న వెహికల్​ను తొలగించమని సీఐతో వాగ్వివాదం పెట్టుకున్నారు. సీఐ తన వాహనాన్ని తొలగించిన అనంతరం వాజేడు మండలంలో పర్యటించారు. పోలీసులు లేకుండానే మరికాల గ్రామానికి వెళ్లి రైతు వేదిక భవనాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు. ఆ తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీలు పోలీసులు లేకుండానే వాజేడు మండలంలో కూడా పర్యటించారు.

Latest Updates